జో బైడెన్ కు కొత్త చిక్కులు..వెలుగులోకి మరిన్ని

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రోజురోజుకూ మరింతగా సమస్యల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆయన నివాసంలో మరిన్ని అధికారిక రహస్య పత్రాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని శ్వేతసౌధం వెల్లడించింది. ఆ పత్రాలన్నీ 2009`16 మధ్య బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటినాటివే. వాషింగ్టన్‌లోని బైడెన్ ప్రైవేటు నివాసమైన పెన్ బైడెన్ సెంటర్లో గతేడాది నవంబరులో రహస్య పత్రాలు బయటపడిన సంగతి ఇటీవల వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ పత్రాలు దొరికిన తర్వాత న్యాయశాఖతో సమన్వయం చేసుకుంటూ దేశాధ్యక్షుడి న్యాయవాదులు డెలావర్‌లో విల్మింగ్టన్, రహబత్ బీచ్‌ల్లోని బైడెన్ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. అక్కడ గుర్తించిన పత్రాలను క్షుణ్నంగా పరిశీలించారు. వాటిలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటికి సంబంధించిన అధికారిక రహస్య పత్రాలు కూడా కొద్ది సంఖ్యలో ఉన్నట్లు తేల్చారు. మొత్తం పత్రాల్లో ఒక్కటి తప్ప మిగిలినవన్నీ విల్మింగ్టన్ నివాసంలోని స్టోరేజీ ప్రదేశంలో దొరికాయి.