ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ ప్రమాణ స్వీకారం

ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌, మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు, పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాకు గవర్నర్‌, ముఖ్యమంత్రి పుష్పగుచ్ఛాలతో అభినందించి శాలువాతో సత్కరించారు.

జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గఢ్‌లోనిని రాయ్‌గఢ్‌లో జన్మించారు. బిలాన్‌పుర్‌లోని గురు ఘసిదాస్‌ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 2005 జనవరిలో ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ద్వారా సీనియర్‌ న్యాయవాది హోదాను పొందారు. ఆ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గానూ పని చేశారు. హైకోర్టు నియమాల రూపకల్పన కమిటీ సభ్యులుగా పనిచేశారు. ఆ రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా సేవలందించారు. ఆ తర్వాత అడ్వొకేట్‌ జనరల్‌గా పదోన్నతి పొందారు. 2009 డిసెంబరు 10న ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగారు. అనంతరం ఏపీ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు.

 

Tags :