తెలంగాణ నూతన సీజేగా భుయాన్ నియామకం

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను ఈ మేరకు విడుదల చేసింది. ప్రస్తుత తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ సతీష్‌చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భుయాన్‌కు పదోన్నతి లభించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం గత నెల కేంద్రానికి సిఫారసు చేసింది. దాదాపు నెల రోజులకు కేంద్రం అంగీకారం చెప్పి రాష్ట్రపతికి ఫైల్‌ను సమర్పించింది. రెండు రోజులకే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. వెంటనే కేంద్ర లా అండ్ జస్టిస్ అడిషినల్ సెక్రటరీ రాజీందర్ కాశ్యప్ పేరిట గెజిట్ నోటిఫికేన్ ఉత్తర్వులు వెలువడ్డాయి.
అస్సాంకు చెందిన జస్టిస్ భూయాన్ గౌహతిలో 1964లో ఆగస్టు 2న జన్మించారు. గౌహతిలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశాక 1991 మే 20న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. అనేక ప్రభుత్వ సంస్థలు, అస్సాం ప్రభుత్వ న్యాయవాదిగా చేశారు. అదనపు ఏజీగా కూడా చేశారు. సీనియర్ న్యాయవాదిగా ప్రమోషన్ పొందారు. అక్కడే 2011 అక్టోబర్ 17వ తేదీన హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.