మలయాళ హీరో పృథ్వీరాజ్ 'కడువా' టీజర్

మలయాళ హీరో పృథ్వీరాజ్  'కడువా' టీజర్

మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ కడువా. మ్యాజిక్ ఫ్రేమ్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, 'భీమ్లా నాయక్' ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా కనిపించనున్నారు. పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న ' కడువా' జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. పృథ్వీరాజ్, వివేక్ ఒబెరాయ్‌, సంయుక్త మీనన్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.  

హైఆక్టేన్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఫుల్ పవర్ ప్యాక్డ్ గా అలరించింది 'కడువా'టీజర్.' ఆయనొక  చిరుత .. వేట కోసం కాచుకున్న చిరుత' అనే పవర్ ఫుల్ డైలాగ్ తో వీర్ లెవల్ లో పృథ్వీరాజ్ ఇచ్చిన మాస్ ఎంట్రీ  సాలిడ్ గా వుంది. పృథ్వీరాజ్ యాక్షన్, మాస్ స్వాగ్ నెక్స్ట్ లెవెల్ లో వున్నాయి. మరో పవర్ ఫుల్ పోలీసు పాత్రలో  వివేక్ ఒబెరాయ్‌ కనిపించారు. యాక్షన్ సీక్వెన్స్ అన్నీ అవుట్ స్టాండింగ్ అనిపించాయి. టీజర్ చివర పృథ్వీరాజ్ పులిలా గర్జించడం మాస్ ని మెస్మరైజ్ చేసింది.

డైరెక్టర్ షాజీ కైలాస్ కడువాతో మరోసారి తన మాస్ మార్క్ ని చూపించబోతున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. నిర్మాణ విలువలు ఉన్నంతగా వున్నాయి. అభినందన్ రామానుజం అందించిన విజువల్స్ రిచ్ అండ్ లావిష్ గా వున్నాయి.  జేక్స్ బిజోయ్ అందించిన నేపధ్య సంగీతం మాస్ ని మరింత ఎలివేట్ చేసింది. పృథ్వీరాజ్ హైవోల్టేజ్ యాక్షన్, భారీ నిర్మాణ విలువలు, మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.

పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. నా గత చిత్రం 'జనగణమన'కి ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ చిత్రం మంచి వసుళ్ళూ రాబట్టింది. తెలుగు ప్రేక్షకులు సినిమాని గొప్ప ప్రేమిస్తారు. హైదరాబద్ లో షూటింగ్ అంటే నాకూ ఎప్పుడూ ప్రత్యేకంగా వుంటుంది. నా 'బ్రోడాడీ' సినిమా అంతా హైదరాబాద్ లోనే షూట్ చేశా. ఇప్పుడు కడువా టీం కు మీరంతా గొప్ప స్వాగతం పలికారు. కడువా నాకు చాలా ప్రత్యెకమైన సినిమా. మాలయాళం నుండి మంచి సినిమాలు వస్తున్నాయి. వాస్తవానికి దగ్గరగా ఉండేవి, మెదడుకు పదునుపెట్టేవి, ఆలోచన రేకెత్తించే చిత్రాలుగా ఇలా చాలా జోనర్ చిత్రాలు వస్తున్నాయి. ఐతే మాస్ కమర్షియల్ సినిమాని మలయాళం పరిశ్రమ మర్చిపోయిందనే భావన కలిగింది.  ప్రేక్షకులు అమితంగా ఎంజాయ్ చేసే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలు రావడం తగ్గింది. ఇలాంటి నేపధ్యంలో ఈ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని ప్రేక్షకుల ముందుకు తీసురావాలని భావించా. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈసారి డబ్బింగ్ వెర్షన్ ని పక్కాగా ప్లాన్ చేశాం. టీం అంతా వచ్చి ప్రమోషన్స్ లో ఇక్కడ ప్రేక్షకులని కలవడం ఆనందంగా వుంది. భవిష్యత్ లో నా చిత్రాలన్నీ తెలుగులో విడుదల చేయడానికి ప్రయత్నిస్తా. నేను చేసిన సినిమాలు ఇక్కడ రిమేక్ కావడం ఆనందంగా వుంది. భీమ్లా నాయక్ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అలాగే చిరంజీవి గారి గాడ్ ఫాదర్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్వరలోనే తెలుగు, మలయాళం చిత్ర పరిశ్రమల కలయికలో పెద్ద  ప్రాజెక్ట్స్ వస్తాయనే నమ్మకం వుంది'' అన్నారు.

వివేక్ ఒబెరాయ్‌ మాట్లాడుతూ.,., హైదరాబాద్ లోనే పుట్టాను. మా కుటుంబంలో చాలామంది ఇక్కడే వున్నారు. ఇక్కడికి వస్తే స్కూటర్ కాలేజీలు చుట్టూ తిరగడాలు, గండిపేట్ పిక్నిక్, ట్యాంక్ బండ్ అన్నీ గుర్తుకు వస్తాయి. నా చిత్రాల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. 'కడువా'  రాకింగ్ మూవీ. ఇద్దరు బలమైన వ్యక్తుల మధ్య ఒక బుల్ ఫైట్ లా ఈ సినిమా వుంటుంది. నా కెరీర్ లో ఫోన్ లోనే ఓకే చేసిన మూవీ లూసిఫర్.  కడువా కథ కూడా పృథ్వీరాజ్ ఫోన్ లోనే చెప్పారు. కథ చెప్పినపుడు ఇదో బుల్ ఫైట్ లా ఉంటుందని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ లో నిజంగానే రెండు పెద్ద బుల్స్ తీసుకొచ్చి ఫైట్ చేయించారు. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది'' అన్నారు.

సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. కడువా ప్రమోషన్స్ తెలుగులో చేయడం ఆనందంగా వుంది. తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ప్యాషన్. భీమ్లా నాయక్ విడుదల అప్పుడు థియేటర్ లో ఒక పండగ లాంటి వాతావరణం చూశాను. కడువా చూస్తున్నపుడు కూడా అదే సెలబ్రేషన్స్ వుంటాయని భావిస్తున్నా'' అన్నారు.

 

Tags :