రివ్యూ : 'కపటధారి' అక్కడ సక్సెస్ కానీ... ఇక్కడ కష్టం

రివ్యూ : 'కపటధారి' అక్కడ సక్సెస్ కానీ... ఇక్కడ కష్టం

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.25/5
బ్యానర్  : క్రియేటివ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌
నటీనటులు : సుమంత్‌, నందిత, నాజర్‌, జయప్రకాశ్, వెన్నెల కిషోర్‌ తదితరులు
సినిమాటోగ్రఫీ : రసమతి, సంగీతం : సిమన్‌ కె కింగ్‌
ఎడిటర్‌ : ప్రవీన్‌ కేఎల్‌, నిర్మాతలు : ధనంజయన్‌, లలితా ధనంజయన్‌
దర్శకత్వం : ప్రదీప్‌ కృష్ణమూర్తి
విడుదల తేది : 19.02.2021

అక్కినేని ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ వున్న హీరో యార్లగడ్డ సుమంత్.  ఒకప్పుడు వరుస ప్రేమకథా చిత్రాలు చేసి లవర్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్న సుమంత్‌,‌ తన కెరీర్ లో సత్యం, గౌరీ, గోదావరి చిత్రాలు తప్ప మిగతా సినిమాలన్నీ అవేరేజ్ డిజాస్టర్ట్స్ చిత్రాలే వున్నాయి. హీరోయిజం, మాస్‌ మసాల అంశాలను పక్కనబెట్టి విభిన్న కథలు ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పుడు థ్రిల్లర్‌ కథలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఈసారి ‘కపటధారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుమంత్‌. కన్నడ సూపర్‌ హిట్‌ ‘కవలుధారి’ సినిమాకు ఇది రీమేక్‌. ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తమిళ వెర్షన్‌ జనవరి 28న విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. మరి కన్నడ, తమిళంలో విజయం సాధించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారు? వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సుమంత్‌కు ఈ సినిమా అయినా కెరీర్ ని లైన్ లో పెడుతుందా రివ్యూ లో చూద్దాం. 

కథ:

గౌతమ్‌ (సుమంత్‌) ఒక సిన్సియర్‌ ట్రాఫిక్‌ ఎస్సై. కానీ ఆ జాబ్‌తో అతను సంతృప్తి చెందడు. ఖాకి బట్టలేసుకున్న పోలీసుగా విధుల్లో చేరి క్రైమ్‌ కేసులను చేపట్టాలని అనుకుంటాడు. కానీ ఎన్ని సార్లు ప్రయత్నించినా, పై అధికారులు అతనికి ప్రమోషన్‌ ఇవ్వరు. ఇదిలా ఉంటే....  ఒకరోజు మెట్రో కోసం తవ్విన తవ్వకాలల్లో ఓ ముగ్గురి అస్థిపంజరాలు బయటపడతాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పైపైనే  విచారణ చేసి కేసును మూసేసే ప్రయత్నం చేస్తారు. కానీ గౌతమ్‌ మాత్రం ఆకేసును సీరియస్‌గా తీసుకొని ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతనికి జర్నలిస్ట్‌ గోపాల్‌ కృష్ణ (జయప్రకాశ్), 40 ఏళ్ల క్రితం ఆ కేసును డీల్‌ చేసిన రిటైర్డ్‌ పోలీసు అధికారి రంజన్ ‌(నాజర్‌) పరిచయం అవుతారు. కేసు విచారణలో ఆలేరు శ్రీనివాస్‌ అనే మరోవ్యక్తి పేరు బయటకు వస్తుంది. అసలు ఈ ఆలేరు శ్రీనివాస్‌ ఎవరు? అతనికి ఈ కేసుకు ఏం సంబంధం? మెట్రో తవ్వకాల్లో లభించిన అస్థిపంజరాలు ఎవరివి? వాళ్లు ఎలా చనిపోయారు? కేసు విచారణలో గౌతమ్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? చివరకి అతను ఈ కేసును గౌతమ్  ఎలా ఛేదించాడనేది మిగతా కథ.

నటి నటుల హావభావాలు:

ఇప్పటి వరకు పలు కుటుంబ కథ చిత్రాల్లో ప్రేమ కథా చిత్రాల్లోనూ కనిపించిన సుమంత్ ఈ సినిమాలో చేసిన పోలీస్  రోల్ లో కొత్తగా కనిపిస్తాడు. అలాగే తన పర్సనాలిటీకి తగ్గ పాత్ర కూడా కావడం ఈ రోల్ కు మంచి ప్లస్ అయ్యాడు. దీనికి తగ్గట్టుగానే సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే హీరోయిన్ నందిత శ్వేతకు తక్కువ స్క్రీన్ స్పేస్ దక్కినా ఉన్నంత సేపు మంచి నటన ను కనబరిచింది. కొన్ని చోట్ల ఎమోషనల్‌ సీన్లను కూడా బాగా పండించాడు. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం నాజర్‌ పాత్ర. రిటైర్డ్‌ పోలీసు అధికారి రంజిత్‌ పాత్రకు ఆయన ప్రాణం పోశాడు. దాదాపు హీరోతో సమానంగా స్ర్కీన్‌ను పంచుకున్నాడు. తన అనుభవం అంతా తెరపై కనబడుతుంది. ఇక జరల్నిస్టుగా జయప్రకాశ్‌ తన పాత్రకు న్యాయం చేశాడు. మరి వీరితో పాటుగా కీలక నటులు నాజర్ కూడా తన రోల్ కు న్యాయం చేకూర్చారు. అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ అక్కడక్కడా కనిపించి నవ్వులు పూయిస్తాడు.

సాంకేతిక వర్గం పనితీరు:

‘కవలుధారి’కి రీమేక్‌ ‘కపటధారి’. క్రైమ్‌ థ్రిల్లర్‌ కావడంతో విడుదలైన తమిళ్ కన్నడ రెండు భాషల్లోనూ సక్సెస్ సాధించుకుంది.  ఇక తెలుగు ప్రేక్షకులు కూడా క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలను బాగానే ఆదరిస్తారనే  నమ్మకంతో ప్రదీప్‌ కృష్ణమూర్తి తెలుగులో కూడా ఈ మూవీని తెరకెక్కించాడు. అతని నమ్మకం కొంతవరకు వమ్ముకాలేదనే చెప్పాలి. థ్రిల్లింగ్‌ అంశాలు, ట్విస్ట్‌లు మెండుగా ఉండటం సినిమాకి చాలా ప్లస్‌ అయింది. అయితే, ఈ కథను తెలుగు ప్రేక్షకులను నచ్చే విధంగా తీర్చిదిద్దడంలలో దర్శకుడు తడబడ్డడని చెప్పొచ్చు. దర్శకుడు థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన ఫీల్‌ని క్రియేట్‌ చేయగలిగాడు కానీ ఎమోషనల్‌ అంశాలను మరిచాడు. ఒరిజినల్ వెర్షన్‌ని మక్కీకి మక్కీ దించేశాడు. ఈ చిత్రానికి అదే మైనస్ కథ నెమ్మదిగా సాగడం, కొన్ని సీన్లు రిపీట్‌ కావడం ప్రేక్షకుడిని ఇబ్బంది పెడతాయి. ఇలాంటి క్రైమ్ తరహా సినిమాలు ఇదివరకే చాలా చూశాం కదా అనే ఫీలింగ్  ప్రేక్షకుడికి కలుగక మానదు.  ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సిమోన్ కె కింగ్ నేపథ్య సంగీతం. తన బీజీయంతో కొన్ని సన్నివేశాలకు అతను ప్రాణం పోశాడు. కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్లే సినిమాపై కాస్త ఆసక్తి పెరుగుతుంది అనడం అతిశయోక్తికాదు. ఎడిటర్‌ ప్రవీణ్ కెఎల్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

విశ్లేషణ:

రీమేక్ గా వచ్చినటువంటి ఈ కపటదారి అక్కడక్కడా మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పర్వాలేదు అనిపిస్తుంది. అలాగే చివరి 20 నిమిషాలు బాగుంటుంది. కానీ కాస్త స్లోగా సాగే ఫస్ట్ హాఫ్, ఇంకా బోరింగ్ గా అనిపించే కొన్ని ఆకట్టుకోని అంశాలు నిరాశ పరుస్తాయి. సినిమా థీమ్ లోనికి వెళ్లినట్టయితే దానికి అనుగుణంగా వచ్చే కొన్ని సీన్స్ మంచి ఆసక్తికరంగా అనిపిస్తాయి. అలాగే ఆ కపాలాలను వాటి చుట్టూతా తిరిగే సస్పెన్స్ దానిని కనెక్ట్ చేసిన విధానం ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. అలాగే సినిమాలో వచ్చే ట్విస్టులు కూడా చాలా బాగా అనిపిస్తాయి. ఈ మధ్య ఓ టి టి లో వెబ్ సిరీస్ సినిమాలు ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ కావడంతో  సినిమా కొత్తగా అనిపించదు. కపటధారి ఓ సారి చూడొచ్చు.   

 

Tags :