MKOne Telugu Times Youtube Channel

సంక్షేమ సిద్ధుడు..

సంక్షేమ సిద్ధుడు..

కొత్త సీఎం సిద్ధరామయ్యపై కన్నడ ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. గత కాంగ్రెస్ సర్కార్ హయాంలో కర్నాటకలో సిద్ధరామయ్య.. సంక్షేమపథకాలను కచ్చితంగా అమలు చేశారు. వసతి రామయ్య, ఆరోగ్య రామయ్య, బెళకు రామయ్య(ఫ్రీ పవర్), పశుభాగ్య, కృషి భాగ్య, ఇందిరా క్యాంటీన్స్ సహా పలు పథకాలను సమర్థంగా అమలుచేశారు. అయితే ప్రతీసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీ ఉండడంతో.. సిద్ధరామయ్య సర్కార్ ఓటమి తప్పలేదు. కానీ సిద్ధూ చేపట్టిన సంక్షేమపథకాల ప్రభావం మాత్రం.. కన్నడిగులపై అపారంగా ఉందనే చెప్పాలి. అందుకే డికె ఎంతగా పట్టుబట్టిన ... తొలి దఫా సీఎం పదవి సిద్ధరామయ్యకే హైకమాండ్ అప్పజెప్పింది.

ఈ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత హామీలు పెను ప్రబావం చూపించాయి. దీంతో వీటి అమలుపైనా ఓ ప్రత్యేక ప్రణాళికను కాంగ్రెస్ రూపొందిస్తోంది. దీన్ని అమలు చేసే బాధ్యతను సిద్ధు భుజాలపై పెడుతున్నారు. అయితే ఇది సిద్ధరామయ్యకు కాస్త కఠినమైన పరీక్షగానే చెప్పొచ్చు. ఎందుకంటే వీటి అమలుకు వేల కోట్ల రూపాయలు అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని సమీకరించడానికి చాలా వనరులు కావాలి.  కానీ అపార అనుభవం ఉండడంతో.. దీన్ని ఆయన విజయవంతంగానే నిర్వహిస్తారని కాంగ్రెస్ హైకమాండ్, అభిమానులు భావిస్తున్నారు.

ఇక ఇటీవలి కాలంలో కర్నాటకలో మతపరమైన అంశాలకు అత్యంత ప్రాధాన్యత లభించింది. సర్కార్ సైతం వాటికి పరోక్షంగా ఆజ్యం పోసిందనే చెప్పాలి. దీంతో హిజాబ్, హలాల్ సహా పలు అంశాలు.. కర్నాటకను అతలాకుతలం చేశాయి. వీటిపై వ్యాపార వేత్తలు ఆందోళన చెందారు. పరిస్థితి ఇలానే ఉంటే.. తాము వేరే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి ఉంటుందని సున్నితంగానే వ్యాఖ్యానించారు. వీటన్నింటినీ దూరం చేసి మళ్లీ బెంగుళూరుకు పాతవైభవం తెచ్చేదిశగా కొత్త సర్కార్ పనిచేయాలని కన్నడ ప్రజలు కోరుతున్నారు.

మరీ ముఖ్యంగా బొమ్మై సర్కార్ అవినీతిపై కన్నడిగులు కన్నెర్ర చేశారు. మరీ ముఖ్యం 40 పర్సెంట్ కమిషన్  సర్కారంటూ కాంగ్రెస్ ప్రచారం బాగా పనిచేసింది. దీంతో ఈ సర్కార్ పూర్తి పారదర్శకంగా పనిచేయాలని కన్నడిగులు కోరుకుంటున్నారు. ఆదిశగా సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఎందుకంటే.. సిద్ధరామయ్య అనుభవజ్ఞుడు. తన విజన్ ప్రకారం ముందుకెళ్లి.. రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం దిశగా పరుగులు పెట్టించాలని సగటు కన్నడిగుడు కోరుకుంటున్నాడు.

 

 

Tags :