ఆకట్టుకున్న శివపదం నృత్యరూపకం

ఆకట్టుకున్న శివపదం నృత్యరూపకం

కాలిఫోర్నియాలోని శాన్‌ హోసే నగరంలో ఆదివారం జులై 31న శివపదం నృత్యరూపకం ‘‘కాశి సందర్శనం’’ కనులపండువగా జరిగింది. బ్రహ్మశ్రీ డా. సామవేదం షణ్ముఖశర్మ తెలుగు, సంస్కృత భాషలలో రచించిన వెయ్యికిపైగా శివపదాలు నుంచి కాశి సందర్శనంలోని ఏకాదశ శివపదం కీర్తనలకు మల్లాది సూరిబాబు, మల్లాది శ్రీరాం, మల్లాది రవికుమార్‌, అనుములయోష, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్‌ తదితరులు సంగీతం సమకూర్చి గానం చేసారు. కాలిఫోర్నియాలో కాశి సందర్శనం - శివపదం నృత్యరూపకం కాశీలో వర్ణించే 11 సంస్కృత కీర్తనలను ఎంపిక చేసుకొని, శాన్‌ హోసేకి చెందిన సునీత పెండెకంటి, భిదిష మొహంత్యె, మాధవి, చందన వేటురి, దీపన్విత సేనుగుప్త, వాసుదెవన్‌ ఇయంగర్‌, రాజెష్‌ చావలి, శిమ ఛొక్రబొర్థ్య్‌ గురువుల శిష్యబృందం 6 భారతీయ నృత్య శైలుల్లో, 55 మంది ప్రవాస నృత్యకళాకారులు ప్రదర్శించారు.

ప్రతి నృత్యం ముందు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయడం ఒక చారిత్రాత్మకమైన ఘట్టమని నిర్వాహుకులు తెలిపారు. 500 మందికి పైగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించి కాశి పట్టణాన్ని సందర్శినట్టుగా అనుభూతుని పొందారు. ఇంకా ఎంతో మంది పలుదేశాలనుండి అంతర్జాలం ద్వారా వీక్షించి కాశి వెళ్ళిన ఆత్మానుభవంలో మైమరచిపోయారు. కాలిఫోర్నియాలో కాశి సందర్శనం శివపదం నృత్యరూపకం కర్నాటక సంగీతానికి కథక్‌, ఒడిసి.. హిందుస్తాని సంగీతానికి కూచిపూడి, భరతనాట్యం శైలిలో ప్రదర్శించడం అందరిని ఆకట్టుకున్నాయి. చివరగా జయ జయ జయ గంగే అనే శివపద కీర్తనతో, నృత్య కారులు, షణ్ముఖ శర్మతో పాటుగా, ఈ కాశి సందర్శనం నృత్యరూపకాన్ని రూపుదిద్దిన సూత్రదారులు వాణి, రవిశంకర్‌ గుండ్లాపల్లి దంపతులు గంగా మాతకు దీపాలతో హారతి ఇచ్చి నిత్యం కాశీలో జరిగే గంగా హారతి దృశ్యాన్ని అద్భుతంగా కళ్ళకి కట్టినట్టు చూపించి హాల్‌ అంతా శివమయం చేసారు.

కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి వారి దివ్య ఆశీస్సులతో ప్రారంభించిన ‘‘నో యువర్‌ రూట్స్‌ (ధర్మమూలం)’’ సంస్థ, అంతర్జాతీయ శివపదం నిర్వాహణ బృందం వారు కలిసి శివపదం సృష్టికర్త అయిన బ్రహ్మశ్రీ డా. సామవేదం షణ్ముఖశర్మకు ‘‘శివపద చింతామణి’’ అన్న బిరుదును సమర్పించారు. అమెరికాలో కాశిని చూపించిన వాణి గుండ్లాపల్లిని ‘‘శివపదాంకిత’’ అన్న ప్రశంసా బిరుదుని, ఋషిపీఠం తరుపున ఇచ్చి సత్కరించారు.

 

Tags :