శ్రీసిటీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద అలరించిన 'కోలాటం' ప్రదర్శన

శ్రీసిటీ పరిసర ప్రాంతంలో సాంప్రదాయ జానపద కళారూపాలను ప్రోత్సహించేందుకు శ్రీసిటీలోని ఆధ్యాత్మిక, సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో ‘కోలాటం’ గ్రామీణ జానపద నృత్య రూపకాన్ని శనివారం స్థానిక శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మందిర ప్రాంగణం వద్ద ఏర్పాటు చేశారు. ఆరూరు గ్రామ కళాకారుల కోలాట ప్రదర్శనను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు, బాలికలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాంప్రదాయ దుస్తులలో నృత్యకారుల ఉత్సాహభరిత ప్రదర్శన అందరినీ ఎంతగానో అలరించింది.
కోలాటం ప్రారంభానికి ముందు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, ఆపై సాగిన సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణంలో భక్తులందరూ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిన ఆ ప్రదేశం సామూహిక భగవన్నామ స్మరణతో మార్మోగింది.
ఈ కార్యక్రమంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు చురుగ్గా పాల్గొనడం పట్ల శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
కోలాటం బృందానికి శ్రీసిటీ అకౌంట్స్ విభాగాధిపతి ఆర్.జనార్దన్ రెడ్డి నగదు పురస్కారాన్ని అందజేసి వారి ప్రతిభను అభినందించారు. శ్రీసిటీ ప్రతినిధులు మధు రెడ్డి, పి.ఎస్.బి.శాస్త్రి, పి.బాలాజీ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమానికి శ్రీసిటీ ఉద్యోగులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హాజరయ్యారు. భక్తులందరికీ తీర్థ, అన్నప్రసాదాలు అందజేశారు. స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొనడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు.