రివ్యూ: ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న'కోనసీమ థగ్స్'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్థ : హెచ్ ఆర్ పిక్చర్స్, జియో స్టూడియోస్ తో కలిసి...
నటీనటులు: హృదు హరూన్, బాబీ సింహా, ఆర్కే సురేష్, మునిష్కాంత్, అనశ్వర రాజన్, శరత్ అప్పాని, పిఎల్ తేనప్పన్
సంగీత దర్శకులు: సామ్ సిఎస్, సినిమాటోగ్రఫీ: ప్రియేష్ గురుసామి, ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
నిర్మాతలు: రియా శిబు, ముంతాస్ ఎం, దర్శకురాలు : బృంద
విడుదల తేదీ: 24.02.2023
'దయ' చిత్రంతో నేషనల్ అవార్డ్ విన్నింగ్ డ్యాన్స్ మాస్టర్ గా... 'హే సీనామిక' తో దర్శకురాలిగా మారి, బృంద తెరకెక్కించిన రెండో సినిమా తమిళ్ చిత్రం 'థగ్స్'. తెలుగులో “కోనసీమ థగ్స్” అనే పేరుతో అనువదించి.. రెండు భాషల్లో ఒకేరోజు విడుదల చేశారు. హీరోహీరోయిన్లు కొత్తవాళ్లు అయినప్పటికీ.. క్యారెక్టర్స్ అందరూ సీజన్ద్ ఆర్టిస్టులు కావడం, ట్రైలర్ కట్స్ & కెమెరా వర్క్ బాగుండడంతో సినిమాపై మాస్ సర్కిల్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా మైత్రి మూవీ మేకర్స్ L L P ద్వారా విడుదల కావడం, మరి సినిమా ఆ అంచనాలను ఏ మేరకు బృంద అందించారో? ఆమె దర్శకత్వంలో హృధు హరూన్ – బాబీ సింహా ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
కాకినాడలో హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ తిరిగే కుర్రాడు శేషు (హృదు హరూన్) ఒక అనాధ..అదలా ఉండగా.. తొలిచూపులోనే కోయిల (అనశ్వర రాజన్)ను ప్రేమిస్తాడు. ఆమెతో జీవితం ఊహించుకుంటూ ఎంతో ఆనందంగా బ్రతికేస్తుంటాడు. కట్ చేస్తే.. తను పనిచేసే లోకల్ రౌడీ తమ్ముడు తన ప్రేయసి మీద మోజుపడడం తట్టుకోలేక, ఒకానొక సందర్భంలో అనుకోకుండా అతడి మృతికి కారణమవుతాడు. ఈ క్రమంలో కాకినాడ మార్కెట్ కి సంబంధించిన దొర (బాబీ సింహా)తో పరిచయం ఏర్పడుతుంది. అతను హత్య కేసులో నిందితుడు. జైలుకి వచ్చిన రకరకాల ఖైదీలు పరిచయం అతనికి అవుతారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో శేషు – దొర, మధు (మునిష్కాంత్) తదితరులు కలిసి.. జైలులో మరికొందర్ని కలుపుకుని, ఆ జైలు నుంచి తప్పించుకోవడానికి ఒక ముఠాగా ఏర్పడతారు. అసలు శేషు ప్లాన్ ఏంటి? జైల్ నుంచి ఎలా తప్పించుకోవాలనుకుంటాడు? తప్పించుకున్న తర్వాత లైఫ్ లీడ్ చేయడానికి శేషు ప్లానింగ్ ఏమిటి? అనేది “కోనసీమ థగ్స్” మిగతా సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.
నటీనటుల హావభావాలు :
హీరో హృదు హరూన్ చూడ్డానికి చిన్నపిల్లాడిలా ఉన్నా.. నటుడిగా ఎంతో ఆకట్టుకున్నాడు. రఫ్ క్యారెక్టర్లో మంచి ఈజ్ తో నటించాడు. ఈ సినిమా అతనికి తొలి చిత్రం అంటే నమ్మలేము. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ లో చక్కని పరిణితి ప్రదర్శించాడు. బాబీ సింహా, మునిష్కాంత్, ఆర్కే సురేష్ వంటి హేమాహేమీల నడుమ తన స్క్రీన్ ప్రెజన్స్ ను కాపాడుకోగలిగాడంటే.. నటుడిగా అతనికి మంచి ఫ్యూచర్ ఉందనిపిస్తోంది. ఎమోషనల్ పాత్రలో సముద్రఖని అద్భుతంగా నటించారు. హీరోయిన్ అనశ్వరకు ఉన్న స్క్రీన్ టైమ్ తక్కువ అయినప్పటికీ.. ఉన్నపాటి కొద్ది సన్నివేశాల్లో అందంగా, కళ్ళతో హావభావాలు పలికిస్తూ ఆకట్టుకుంది. బాబీ సింహా, మునిష్కాంత్, ఆర్కే సురేష్ పోటీపడి నటించారు. ఈ ముగ్గురి నటన వల్లే సినిమా రక్తి కట్టింది అంటే . బాబీ సింహా క్యారెక్టర్ కు ఇచ్చిన ఎలివేషన్ బాగుంది. అలాగే.. ఆర్కే సురేష్ పాత్రకు కూడా కాస్త బ్యాగ్రౌండ్ యాడ్ చేసి ఉంటే ఇంకాస్త కనెక్టివిటీ ఉండేది. అదే విధంగా మునిష్కాంత్ పాత్రను ఎలివేట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది.
సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకురాలు బృంద ఈ చిత్రాన్ని తెరకెక్కించింది అంటే నమ్మడం కాస్త కష్టమే. అందులోనూ ఆమె డైరెక్షనల్ డెబ్యూ ఫిలిమ్ “హే సినామిక” చూసిన తర్వాత “కోనసీమ తగ్స్” చూస్తే కచ్చితంగా షాక్ అవుతారు. రైన్ ఫైట్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ & క్లైమాక్స్ ను కంపోజ్ చేసిన విధానం మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. దర్శకురాలిగా బృంద తన మార్క్ క్రియేట్ చేసుకోలేకపోయినా..ఈ చిత్రంతో ఒక హిట్ మాత్రం కొట్టిందీ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో మరో టెక్నీషియన్ గురించి చెప్పాలంటే ...సినిమాటోగ్రాఫర్ ప్రియేష్ గురుస్వామి. ఈ సినిమాకి రియల్ హీరో. గంటన్నరకు పైగా సినిమా ఒకే లొకేషన్ లో జరిగినా.. ఎక్కడా బోర్ కొట్టకుండా చిన్న లొకేషన్ ను కూడా మల్టీపుల్ యాంగిల్స్ లో కవర్ చేసిన విధానం బాగుంది. అలాగే డిమ్ లైట్ షాట్స్ & నైట్ షాట్స్, ముఖ్యంగా క్లైమాక్స్ బ్లాక్ ను పిక్చరైజ్ చేసిన విధానం ఆడియన్స్ కు, ముఖ్యంగా మాస్ జనాలకి మంచి కిక్ ఇస్తుంది. సినిమా ఆధ్యంతం చక్కగా రన్ అయిందంటే ముఖ్య కారకుడు ప్రియేష్ అని చెప్పాలి.
శిబు తమీన్స్ కథను “ప్రిజన్ బ్రేక్, శవ్శాంక్ రిడంప్షన్” వంటి సినిమాల స్పూర్తితో రాసుకున్నప్పటికీ.. నేటివిటీకి తగ్గట్లుగా కథ & స్క్రీన్ ప్లే ను రాసుకోవడంలో విజయం సాధించాడు. ప్రతి పాత్రకు ఒక మోటివ్ ఉండేలా ప్లాన్ చేసిన విధానం బాగుంది. శామ్ సి.ఎస్ సంగీతం పర్వాలేదు అనిపించింది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
విశ్లేషణ:
కోనసీమ థగ్స్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ మరియు యాక్షన్ సీక్వెన్సెన్స్ ఆకట్టుకున్నాయి. ఐతే, సినిమాలో కథనం మాత్రం పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా సాగలేదు. స్లో నేరేషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే సినమాలో చెప్పాలనుకున్న మెయిన్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకు పోయేలా వున్నాయి . మొత్తమ్మీద ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేకపోయినా.. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ లను ఇష్టబడే వారికి నచ్చుతుంది. మాస్ ప్రేక్షకులకు ఈ చిత్రం విందు భోజనం లాంటిది.