హ్యాట్రిక్ కొడతాం.. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మారుద్దాం: కేటీఆర్

హ్యాట్రిక్ కొడతాం.. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మారుద్దాం: కేటీఆర్

వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థులను మట్టికరిపిస్తామని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడుతుందని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే 2024లో కేంద్రంలో కూడా తెలంగాణకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు నారాయణపేట జిల్లాలో ఆయన పర్యటించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో పాల్గొన్న ఆయన బీజేపీపై ధ్వజమెత్తారు.

పాలమూరు నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తారని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని చెప్పిన కేటీఆర్.. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్న మోదీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచినందుకే వీళ్లకు మోదీ దేవుడయ్యాడా? అంటూ ఎద్దేవా చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేంద్రం ఎన్ని ఆటంకాలు కలిగించినా, ఆ పనులు పూర్తిచేసి పాలమూరు రైతాంగానికి నీళ్లు అందించే బాధ్యత కేసీఆర్ సర్కారుదే అని ఆయన తేల్చిచెప్పారు.

 

Tags :