మునుగోడుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేస్తాం : మంత్రి కేటీఆర్

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ మునుగోడులో త్వరలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని తెలిపారు. చండూరు మున్సిపాలిటికి రూ.50 కోట్లు, చౌటుప్పల్ మున్సిపాలిటీకి రూ.30 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో కొత్త 5 సబ్ స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. చండూరును త్వరలో రెవెన్యూ డివిజన్‌గా మారుస్తామని ప్రకటించారు. నారాయణపురంలో గిరిజన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నల్గొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలు టీఆర్ఎస్ వశమయ్యాయన్న మంత్రి నల్గొండ జిల్లా ప్రజలు టీఆర్ఎస్ను చాలా గొప్పగా ఆదరించారన్నారు. నల్గొండ జిల్లాలో రాబోయే 6 నెలల్లో రూ.1,544 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడిరచారు. 2014కు ముందు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక వైద్య కళాశాల కూడా లేదని గుర్తు చేశారు. జిల్లాలో పెండిరగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.