MKOne TeluguTimes-Youtube-Channel

ఆ ఇద్దరే కాదు.. దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదు

ఆ ఇద్దరే కాదు.. దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదు

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.  సీఎం కేసీఆర్‌తో మంత్రులు ఉన్నతాధికారుల భేటీ ముగిసిన అనంతరం మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.  ప్రవీణ్‌, రాజశేఖర్‌ రెడ్డే కాదు. ఈ కేసులో ఇంకా ఎవరు ఉన్నా కఠిన చర్యలు తప్పవన్నారు. కమిషన్‌లో ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ వ్యవహారం ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పే గానీ, సంస్థాగత వైఫల్యం కాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 

టీఎస్‌పీఎస్‌సీ పరీక్ష నిర్వహణను మరింత పకడ్బందీగా చేపట్టేందుకు చేయాల్సిన మార్పులను చేస్తాం. నాలుగు పరీక్షలు రద్దయ్యాయి. ఈ పరీక్షలను రాసే విద్యార్థులు ఎవరూ ఫీజు చెల్లించనవసరం లేదు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారెవరూ ఫీజు చెల్లించనక్కర్లేదు. మార్పులు తీసుకొచ్చి మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకొని సాధ్యమైనంత త్వరగా పరీక్షలు నిర్వహిస్తాం. గతంలో దరఖాస్తు చేసుకున్నవారంతా పరీక్ష రాసేందుకు అర్హులే.  ఈ నాలుగు పరీక్షలకు సంబంధించి కోచింగ్‌ మెటీరియల్‌ అంతా ఆన్‌లైన్‌లో పెడతాం. ఉచితంగా మెటీరియల్‌ ఇచ్చే బాధ్యత మాది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టడీ సర్కిళ్లను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాం. రీడింగ్‌ రూమ్‌లు సైతం 24 గంటలలూ తెరిచే ఉంచాలని నిర్ణయించాం. ఉచిత మెటీరియల్‌తో పాటు ఉచిత భోజన వసతి కూడా అందిస్తాం. ఆయా జిల్లాల కలెక్టర్లు వీటిని  పర్యవేక్షిస్తారు. విద్యార్థులు పూర్తిస్థాయిలో సన్నద్దం కావడానికి సహకరిస్తాం అని అన్నారు.

 

 

Tags :