చెన్నై లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ మహాకుంభాభిషేకం

చెన్నైలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విశ్వక్సేనారాధన, చతుష్టార్చన, బలిహరణ, గోష్టి, బ్రహ్మాఘోష, వేదశాత్తుమొర, మహా పూర్ణాహుతి, ప్రాయశ్చిత్త హోమాలు, శాంతిహోమాలు, పూర్ణాహుతిని నిర్వహించారు. కుంభ ఉద్వాసన, కుంభ ప్రోక్షణ, విమాన, రాజగోపురానికి కుంభ ప్రోక్షణ, ప్రాణ ప్రతిష్ఠ, హారతి నిర్వహణ అనంతరం శ్రీ పద్మావతి శ్రీనివాసుల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. మహా కుంభాషేకం నిర్వహణ పట్ల విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామి సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణానికి స్థలం విరాళంగా ఇచ్చిన సినీనటి కాంచన, వారి కుటుంబ సభ్యులు అదృష్టమవంతులని పేర్కొన్నారు. దేశంలోని జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాల్లో కెల్లా తిరుమల శ్రీవారు గొప్ప దేవుడని కొనియాడారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి టీటీడీ స్థానిక సలహాలమండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.