మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి? కేసీఆర్ కీలక నిర్ణయం

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి? కేసీఆర్ కీలక నిర్ణయం

మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో కాక రేపుతోంది. ఈ బైపోల్ లో నెగ్గాలని ప్రధాన పార్టీలు మూడూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. ఆ పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ప్రచార బరిలో దూసుకు పోతున్నారు. కానీ టీఆర్ఎస్ మాత్రం అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బట్టి తమ అభ్యర్థిని ప్రకటించాలనుకుంది టీఆర్ఎస్. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దాదాపు ఖరారయ్యారని తెలుస్తోంది.

మునుగోడు ఉపఎన్నికలపై టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లా ముందే అభ్యర్థిని ప్రకటించకుండా.. ఎన్నికల షెడ్యూల్ వచ్చాకే అభ్యర్థిని అనౌన్స్ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకూ మండలాలవారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని, ప్రచారం సాగించాలని కేసీఆర్ సూచించారు.

మండలాలవారీగా జరిగే ఆత్మీయ సమావేశాల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డే తమ పార్టీ అభ్యర్థి.. అనే సంకేతాలివ్వాలని మంత్రి జగదీశ్ రెడ్డికి కేసీఆర్ సూచించారు. కేడర్ కు ఈ మేరకు సంకేతాలివ్వడం ద్వారా వారు అర్థం చేసుకుంటారని చెప్పారు. ఇప్పటికే గట్టుప్పల్, మర్రిగూడ మండలాల్లో టీఆర్ఎస్ ఆత్మీయ సమావేశాలు నిర్వహించింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ సమావేశాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇవాళ చౌటుప్పల్ మండలంలో టీఆర్ఎస్ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తోంది. అయితే ఈ ఆత్మీయ సమావేశాలకు పార్టీ కీలక నేతలు బూర నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్... గైర్హాజరవుతున్నారు. వీళ్లిద్దరూ మునుగోడు ఉపఎన్నిక టికెట్ ఆశిస్తున్నారు.

మునుగోడులో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ లో గట్టి పోటీ ఉంది. బూర నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్, కూసుకుంట్ల ప్రభాక్ రెడ్డి తదితరులు టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో బీసీ ఓట్లు అధికంగా ఉండడంతో తనకే టికెట్ ఇవ్వాలని బూర నర్సయ్య గౌడ్ పట్టుబడుతున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన వాడిగా, సీనియర్ నేతగా ఉన్న తనకే టికెట్ ఇవ్వాలని కర్నె ప్రభాకర్ డిమాండ్ చేస్తున్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో.. వారిని ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థిని నిలపాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఆ సమీకరణాల్లో భాగంగానే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ మేరకు దాదాపు నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ రాగానే కూసుకుంట్లను అభ్యర్థిగా ప్రకటించనుంది. మరి అసంతృప్తులను టీఆర్ఎస్ అధిష్టానం ఎలా చల్లారుస్తుందనేది చూడాలి. 

 

Tags :