రివ్యూ: నిరాశ పరిచిన 'లాల్‌సింగ్‌ చడ్డా' అమీర్ ఖాన్

రివ్యూ: నిరాశ పరిచిన 'లాల్‌సింగ్‌ చడ్డా' అమీర్ ఖాన్

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.25/5  
నటీనటులు : ఆమిర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌, నాగచైతన్య, మోనా సింగ్‌, మానవ్ విజ్,
ఆర్య శర్మ,అరుణ్ బాలి, మరియు షారుఖ్ ఖాన్ (హీరోగా) తదితరులు
నిర్మాణ సంస్థలు:  వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్
మూల కథ: విన్స్టన్ గ్రూమ్, ఎరిక్ రోత్, 'ఫారెస్ట్ గంప్' (హాలీవుడ్ చిత్రం)
సంగీతం : ప్రీతమ్, సినిమాటోగ్రఫీ: సేతు, సమర్పణ : మెగా స్టార్ చిరంజీవి,
నిర్మాతలు:ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే,
దర్శకత్వం: అద్వెత్‌ చందన్‌
విడుదల తేది: 11.08.2022

దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత.... బాలీవుడ్ పర్‌ఫెక్ష్‌నిస్ట్ అని పేరు తెచ్చుకున్న ఆమిర్ ఖాన్ నటించి నిర్మించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’.  ఆమిర్ ఖాన్ హిరోయిజానికి అతీతంగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తన స్టార్ డమ్‌ను సంపాదించుకున్న విషయం  తెలిసిందే. ఆయన గత చిత్రం థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని ఆమిర్ ఖాన్ స్టార్ట్ చేసిన సినిమాయే ‘లాల్ సింగ్ చడ్డా’. 1996లో ఆరు ఆస్కార్‌ విన్నింగ్‌ హాలీవుడ్ ఫిల్మ్‌  ‘ఫారెస్ట్ గంప్’కు ఇది రీమేక్. మన ఇండియన్ సినిమాలకు అనుగుణంగా కథా కథనంలో మార్పులు చేర్పులు చేసి ఆమిర్ ఖాన్ ఈ సినిమాను రూపొందించారు. మధ్యలో కరోనా రావటంతో సినిమా విడుదల మరి కాస్త ఆలస్యమైంది. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు,తమిళ్ భాషల్లోనూ రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేయటంలో ఆమిర్ ఖాన్‌కి మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ చేయటం.. ఆయన సమర్పణలో సినిమా రిలీజ్ అవుతుండటంతో పాటు నాగ చైతన్య కీలక పాత్రలో నటించటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్‌ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లాల్‌సింగ్‌ చడ్డా’మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ :

ఈ కథంతా 1975 నుంచి మొదలవుతుంది. లాల్ సింగ్ చడ్డా (ఆమిర్ ఖాన్) కరోలి ప్రాంతంలోని పఠాన్ కోట్ గ్రామానికి చెందిన వాడు. అందరి పిల్లలోని (IQ) కంటే చడ్డా ఐక్యూ తక్కువగా ఉంటుంది. అతను చిన్నప్పుడు సరిగ్గా కూడా నడవలేడు. తనపై తనకు సరిగ్గా నమ్మకం ఉండదు. కానీ లాల్ సింగ్ చడ్డా తల్లి (మోనా సింగ్) తన కొడుక్కి మంచి చెడులను చెబుతూ అందరి పిల్లలా పెంచాలనుకుంటుంది.  తన కొడుకు ఎంతో తెలివైన వాడని ఆమె నమ్ముతుంది. లాల్ సింగ్ కూడా తల్లి మాటలను గౌరవిస్తుంటాడు. కానీ కొడుకుని ప్రత్యేకమైన పాఠశాలకు పంపకుండా సాధారణ పిల్లలు చదువుకునే స్కూల్‌కే పంపుతుంది. అక్కడ అందరూ హేళన చేస్తు అతనితో దూరంగా ఉంటే. రూప(కరీనా కపూర్‌) మాత్రం అతనితో స్నేహం చేస్తుంది. తల్లి చెప్పే మాటలు.. రూప ప్రోత్సాహంతో లాల్‌ సాధారణ వ్యక్తిలాగే ఉంటాడు. తనకు అంగవైకల్యం ఉన్నదన్న విషయాన్నే మర్చిపోతాడు. రూప తండ్రి తాగుబోతు, తను ఓ సందర్భంలో రూప తల్లిని చంపేసి జైలు పాలవుతాడు. అప్పటి నుంచి ఆమె లాల్ సింగ్‌ ఇంట్లోనే పెరిగి పెద్దదవుంతుంది. చిన్నతనం లో  ఓ సందర్భంలో రూప చెప్పే మాటలతో పరుగెత్తడం మొదలుపెడతాడు. ఎంతలా అంటే.. ప్రతి రన్నింగ్‌ రేస్‌లో విజయం సాధించేలా. ఇద్దరూ కాలేజ్ చదువుల కోసం ఢిల్లీ వెళతారు.

చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరగటంతో రూప, డబ్బున్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. క్రమంగా ఆమె మోడలింగ్‌లోకి అడుగు పెడుతుంది. హీరోయిన్ కావాలనే కోరికతో మాఫియా డాన్స్‌తో పరిచయం పెంచుకుంటుంది. ఇదంతా లాల్ సింగ్ చడ్డాకు నచ్చదు. తన అమాయకత్వంతో నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా ఆమె పట్టించుకోదు. అతనికి దూరంగా వెళ్లిపోతుంది.  అలాగే కాలేజీ విద్యను పూర్తి చేసి తన తండ్రి, తాత, ముత్తాతల మాదిరే ఆయన కూడా ఆర్మీలో జాయిన్‌ అవుతాడు. జవాన్‌గా లాల్‌ దేశానికి చేసిన సేవ ఏంటి? యుద్దంలో ప్రాణాలు కోల్పోయిన తన స్నేహితుడు బాలు అలియాస్‌ బాలరాజు(నాగచైతన్య) చివరి కోరిక ఏంటి? ఆ కోరికను లాల్‌ నెరవేర్చాడా లేదా? చిన్ననాటి స్నేహితురాలు రూప పెద్దయ్యాక పడిన కష్టాలేంటి? ఆపదలో ఉన్న సయమంలో లాల్‌ ఆమెకు ఎలా తోడుగా నిలిచాడు? తన అమాయకత్వంతో పాకిస్తాన్‌ ఉగ్రవాది మహ్మద్‌బాయ్‌ని ఎలా మంచి వాడిగా మార్చాడు? లాల్‌ తన జీవిత ప్రయాణంలో నేర్చుకున్న సత్యాలు ఏంటి? అనేదే తెలియాలంటే థియేటర్స్‌లో లాల్‌సింగ్‌ చడ్డా’సినిమా చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు:

యాబై ఏడేళ్ల వయసులో ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా కోసం మరోసారి ఆమిర్ ఖాన్ లుక్ విషయంలో రిస్క్ చేశారు. బరువు పెరగటం, తగ్గటం వంటి చేశారు. యుక్త వయసులో ఉన్న పాత్ర కోసం ఆయన బరువు తగ్గారు. అదే లుక్‌ను ఆర్మీ పాత్ర కోసం కూడా మెయిన్ టెయిన్ చేశారు. ఇక మధ్య వయస్కుడిగా కనిపించడానికి కండలు పెంచారు. ఆ తర్వాత కాస్త ఒళ్లు చేసి లావయ్యారు. ఇలా లుక్ విషయంలో ఆమిర్ చేసిన ఎక్స్‌పెరిమెంట్స్ చూస్తే అభినందించకుండా ఉండలేం. ఈ చిత్రంలో కూడా కూడా ఆమిర్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. లాల్‌సింగ్‌ చడ్డా పాత్రలో జీవించేశాడు. కథనంతా తన భుజాన వేసుకొని ముందుకు నడిపించాడు. అయితే ఈ చిత్రంలో ఆయన పోషించిన పాత్ర ‘పీకే’సినిమాను గుర్తుచేస్తుంది.  ఇక ఈ సినిమాకు ప్రధానబలం ఎమోషన్స్. ఆమిర్ ఖాన్ పాత్ర చుట్టూనే ఈ ఎమోషన్స్ క్యారీ అవుతాయి. కానీ అవేవీ ప్రేక్షకుడికి కనెక్ట్ కావు. ఒకనొక దశలో అదే కామెడీగా మారిపోయింది కూడా. సినిమా కథనం స్లోగా ఉంది. ఎమోషన్స్ లేని పాత్రలు, సన్నివేశాల కలయిక బోరింగ్‌గా అనిపిస్తాయి.

కరీనా కపూర్ పాత్ర కూడా ఆడియెన్స్‌కి కనెక్ట్ కాదు. ఆమె రోల్ గమనిస్తే దేని కోసమో వెంపర్లాడుతూ చివరకు హీరోను చేరుకునేలా చూపించారు. ఇక కీలక పాత్రలో నటించిన నాగ చైతన్య పాత్ర అయినా ఆసక్తికరంగా ఉందా.. అంటే అదీ లేదు. చెడ్డీలు, బనియన్స్ అంటూ తన పాత్ర కనిపించినంత సేపు ప్రేక్షకుడిని చావ గొడుతుంటుంది. ఇదేంట్రా బాబు ఇది లాల్ సింగ్ చడ్డా కథ కాదు.. లాల్ సింగ్ చెడ్డీ, బనియన్ కథ అనిపించేంతగా ఇబ్బంది పెట్టిందంటే నమ్మండి! . మరి ఇలాంటి పాత్రను నాగ చైతన్య ఎందుకు చేయడానికి ఓకే చేశాడో అర్థం కాలేదు. లుక్ వైజ్ కూడా చాలా డి గ్లామర్ గా కనిపిస్తాడు.  నిజానికి విజయ్ సేతుపతి చేయాల్సిన పాత్ర అది..ఇక హీరో తల్లి పాత్ర, అతని సపోర్ట్ చేసిన పాత్రలు ఏవీ ఆడియెన్స్‌కి కనెక్ట్ కావు. ఆమిర్ ఖాన్ సినిమాలో ఓ టింజ్ కామెడీ ఉంటుంది. అది సినిమాలో మిస్ అయ్యిందనే చెప్పొచ్చు.  

సాంకేతికవర్గం పనితీరు:

ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు హిందీ  రీమేకే ‘లాల్‌సింగ్‌ చడ్డా’. మాతృకకు ఎలాంటి భంగం కలకుండా, భారతీయ నేటివిటికి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అద్వెత్‌ చందన్‌. అయితే ఇండియన్ స్క్రీన్ పై కాలేదు.  స్క్రీన్‌ప్లే, నిడివి సినిమాకు పెద్ద  మైనస్‌. కథంతా ఒకే మూడ్‌లో సింపుల్‌గా సాగుతుంది. 1975 నుంచి 2018 వరకు భారత్‌లో జరిగిన కొన్ని సంఘటలను గుర్తు చేస్తూ కథనాన్ని నడిపించాడు. కార్గిల్‌ వార్‌ సన్నివేశాలు మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. రొటీన్‌ స్టోరీకి రొటీన్‌ క్లైమాక్స్‌ మరింత మైనస్‌. స్క్రిప్ట్‌ రైటర్‌గా అతుల్‌ కులకర్ణి  మాతృకకు ఎలాంటి భంగం కలగకుండా మన దేశ చరిత్రని, సంస్కృతిని సీన్స్ లో నింపే ప్రయత్నం చేసి సక్సెస్‌ అయితే..  దానిని తెరకెక్కించడంలో దర్శకుడిగా అద్వైత్‌ ఫెయిల్‌ అయ్యాడనే చెప్పాలి. సత్యజిత్ పాండే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాప్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. ఇక సంగీతం, నేపథ్య సంగీతం సంబంధం లేదన్నట్లు అనిపించాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

విశ్లేషణ:

ఆమిర్ ఖాన్ వైవిధ్యమైన సినిమాలను, పాత్రలను ఎంచుకోవటమే కాదు.. అందులో ఒదిగిపోవడానికి చేసే ప్రయత్నం ఎంతో అద్భుతంగా ఉంటుంది. త్రీ ఇడియట్స్, పీకే, దంగల్ వంటి సినిమాలు అందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అంతెందుకు ఆయన గత చిత్రం థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ డిజాస్టర్ అయ్యింది. కానీ ఆ సినిమాలోని తన పాత్ర కోసం ఆయన తన ముక్కు, చెవులను కూడా కుట్టించుకున్నారంటే ఆయన కమిట్‌మెంట్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అలాంటి ప్రయత్నం మరోసారి ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’లో చేయడానికి ప్రయత్నించారు.  ఈ చిత్రం కోసం దాదాపు నాలుగేళ్లు కష్టపడ్డారు. ఈ సినిమా కోసం ఇంతలా కష్టపడాలా అనిపిస్తుంది. ఇదేనా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతూ వచ్చిందనే భావన కలిగింది. ఈ సినిమాకు ప్రధానబలం ఎమోషన్స్. ఆమిర్ ఖాన్ పాత్ర చుట్టూనే ఈ ఎమోషన్స్ క్యారీ అవుతాయి. కానీ అవేవీ ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేదు. అసలు సినిమాతో ఏం చెప్పాలనుకున్నారనేది థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకుడికి అర్థం కానీ విషయం. ఏదైతే ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుందని భావించారో అదే ఎమోషన్స్ సినిమాలో మిస్ అయ్యాయి. 

 

Tags :