క్యాట్స్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి ప్రేమామృత ధార మంచినీటి పథకం ప్రారంభం

క్యాట్స్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి ప్రేమామృత ధార మంచినీటి పథకం ప్రారంభం

రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (క్యాట్స్‌), సత్యసాయి సేవాసంస్థలు, పాడేరు వారి సహకారంతో విశాఖ జిల్లా, గుమ్మంతి గ్రామంలో ఏర్పాటు చేసిన  శ్రీ సత్యసాయి ప్రేమామృత ధార మంచినీటి పథకం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. క్యాట్స్‌ సంస్థ ప్రతినిధులు గోపికృష్ణ జయంతి, శ్రీమతి లక్ష్మి లావణ్య తేలుకు ఆ గ్రామ గిరిజనులంతా సాయి భజనలు, గిరిజన వాయిద్యాలు,  నృత్యాల కోలాహలంతో ఘనంగా స్వాగతం పలికారు. సత్యసాయి సేవా సంస్థ సభ్యులతో కలసి వారు మంచినీటి పథకానికి ప్రారంభోత్సవం చేసి ఆ గ్రామంలోని 110 మంది గ్రామస్థులకు రగ్గులు, చీరలు, పంచెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు కే. గణేష్‌ మాట్లాడుతూ క్యాట్స్‌ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

గోపికృష్ణ, లావణ్య మాట్లాడుతూ క్యాట్స్‌ అధ్యక్షురాలు శ్రీమతి కొండపు సుధారాణి గారి అధ్యక్షతన తలపెట్టిన ఈ పథకం వల్ల గిరిజనులు ఒక బిందెడు నీటికోసం ఎండనకా వాననక, వాగులు వంకలు దాటి ఎన్నో బాధలు పడి ఎంతో దూరం వెళ్ళి తెచ్చుకునే అవసరం లేకుండా ఆ నీటినే వారి ఊరివరకు పైపులైన్ల ద్వారా తెచ్చి వాటరు టాంకులను ఏర్పరచి వాటిద్వారా ఊరందరికీ నీరు అందిస్తున్నామన్నారు. ఈ పథకానికి ఆ గ్రామస్థుల ఆనందం విలువ కట్టలేనిదనీ, ఇంత అద్భుతమైన కార్యక్రమంలో తాము వ్యక్తిగతంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందనీ, ఈ మంచినీటి పధకంకు విరాళాలిచ్చిన తమ సంస్థ సభ్యులు  సుజిత్‌ మారం, చైతన్య తుల, మల్లా భద్రయ్య, రమణ మద్దికుంటతోపాటు, వారి మిత్రబృందానికి ఈ కార్యక్రమానికి తోడ్పడిన సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులందరికీ వారు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ‘‘వనవాసి’’  కార్యకర్తలు, సత్యసాయి కార్యకర్తలు గిరిజనులతో పాటు సత్యసాయి సేవా సంస్థ కోఆర్డినేటర్‌ ప్రతాప్‌ కుమార్‌, మరియు ప్రశాంతి నిలయం ఏలూరు సేవా కో-ఆర్డినేటర్‌ సురేష్‌, ట్రస్ట్‌ సభ్యులు చరణ్‌, కె.ఎ.వి.ఎస్‌.ఎన్‌. మూర్తి, శ్రీనివాస్‌ శీరపు తదితరులు హాజరయ్యారు.

ఈ పథకం ప్రారంభించడంపై సుధారాణి కొండపు మాట్లాడుతూ, గిరిజనులు మంచినీటికోసం ఎంతోదూరం వెళ్ళి ఇబ్బందులు పడటాన్ని చూశానని, వారికి ఎలాగైనా సహాయపడాలన్న ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి మా కార్యవర్గ సభ్యులు అందరూ సహకరించారని చెప్పారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నామని దాతల సహాయంతో గిరిజనుల కష్టాలను తొలగించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

 

Click here for Event Gallery

 

 

Tags :