రివ్యూ : ‘లైగర్‌’ సైన్మా బక్వాస్

రివ్యూ : ‘లైగర్‌’ సైన్మా బక్వాస్

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2/5
నిర్మాణ సంస్థలు: పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్,  
నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి,
అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను మరియు మైక్ టైసన్
సంగీత దర్శకులు : సునీల్ కశ్యప్, విక్రమ్ మాంట్రోస్, తనిష్క్ బాగ్చి, జానీ, లిజో జార్జ్, డి జె  చేతస్
పాటలు: పూరీ జగన్నాథ్, భాస్కరభట్ల; సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, హైరో యాష్ జోహార్, అపూర్వ మెహతా
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పూరీ జగన్నాథ్
విడుదల తేదీ:25.08.2022

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, డాషింగ్‌ అండ్‌ డేరింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో విజయ్‌ సరసన అనన్య పాండే నటించింది. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలకు భారీ స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘లైగర్‌’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్‌ 25) ఈ చిత్రం తెలుగు,హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. ‘లైగర్‌’ కథేంటి? ఎలా ఉంది? సమీక్షలో చూద్దాం.

కథ :

కరీంనగర్ నివాసి లైగర్ (విజయ్ దేవరకొండ) మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కోసం తన తల్లి బాలమణి (రమ్యకృష్ణ)తో కలిసి బతకడానికి ముంబై వస్తాడు. నేషనల్ ఛాంపియన్ అవ్వాలని కల కంటాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య లైగర్, తాన్య (అనన్య పాండే)తో ప్రేమలో పడతాడు. దీంతో ఆట మీద కన్నా ప్రియురాలితో తిరుగుతూ పరధ్యానంలో ఉంటాడు. లాస్ వెగాస్‌లో జరిగిన ప్రపంచ MMA ఛాంపియన్‌షిప్ మరియు చివరకు USAలోని కిడ్నాప్ సంఘటనతో సినిమా ముగుస్తుంది. మరీ లైగర్ జర్నీలో తాన్య ప్రేమ దేనికి దారి తీసింది ?, లైగర్ తాను అనుకున్న గోల్ కి రీచ్ అయ్యాడా? లేదా ?, అసలు లైగర్ త‌న క‌ల‌ని నిజం చేసుకోవడానికి చేసిన కృషి ఏమిటి ?, ఈ మధ్యలో మైక్ టైస‌న్ ట్రాక్ ఏమిటి ? అనేది మిగిలిన కథ.

నటీనటుల హావభావాలు:

లైగర్ క్యారెక్టర్‌ లో విజయ్ అద్భుతమైన నటనను కనబరిచాడు. గత సినిమాల్లో కంటే, ఈ సినిమాలో విజయ్ కొత్తగా కనిపించడం తో పాటు నటనలో మరింత పరిపక్వత కనిపించింది. తన హై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో విజయ్ తన లైగర్ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక విజయ్ సరసన హీరోయిన్ గా నటించిన అనన్య పాండే తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మరియు తన గ్లామర్ తో బాగా అలరించింది. కొన్ని ప్రేమ సన్నివేశాల్లో విజయ్ – అనన్య మధ్య  కెమిస్ట్రీ చాలా భయంకరంగా వుంది. రమ్యకృష్ణ, అలీ, మైక్ టేసన్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు:

పూరి జ‌గ‌న్నాథ్ వ‌రుస ప‌రాజయాల‌తో ఇబ్బంది ప‌డుతోన్న స‌మ‌యంలో.. ఆయ‌న డైరెక్ట్ చేసిన ఇస్మార్ట్ శంక‌ర్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర తిరుగులేని విజ‌యాన్ని సాధించ‌టంతో పూరి మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడ‌నుకున్నారు. త‌దుప‌రి ఆయ‌న ఎవ‌రితో సినిమా చేస్తాడోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఆ స‌మ‌యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి .. లైగ‌ర్ సినిమాను అనౌన్స్ చేశాడు. అంత‌కు ముందు సినిమా ఇచ్చిన స‌క్సెస్ కిక్కో లేక ట్రెండ్‌ను ఫాలో అవుతూ సెన్సేష‌న్ క్రియేట్ చేద్దామ‌నుకున్నాడో ఏమో కానీ.. పూరి తొలిసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా లైగ‌ర్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. సినిమాటోగ్రఫర్ విష్ణు శర్మ తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు. అలాగే సినిమాలో నేపధ్య సంగీతంతో పాటు లాస్ట్ సాంగ్ కూడా బాగుంది. ముఖ్యంగా సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా, సినిమాలో వచ్చే పరిస్థితులకు తగట్లుగా పాటలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఎడిటర్ సినిమాను ఇంకా ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

విశ్లేషణ:

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో పక్కా యాక్షన్ ఎంటర్టైనెర్ గా వచ్చిన ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని మాస్ ఎలిమెంట్స్ పరంగా మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాల పరంగా బాగానే ఆకట్టుకున్నా, సినిమా మాత్రం పూర్తిస్థాయిలో ఆసక్తికరంగా సాగలేదు. సాధార‌ణంగా పూరి సినిమాల్లో హీరో క్యారెక్ట‌రైజేష‌న్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏం ఉండ‌దు. సినిమా ఫ‌స్టాఫ్ ఏదో అలా సాగిందిలే. పూరి మంచి స్టోరీ లైన్ ను అలాగే లైగర్ అనే మంచి క్యారెక్టర్ ను రాసుకున్నప్పటికీ, ఆ లైన్ ను ఆ క్యారెక్టర్ కి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. దీనికి తోడు, సినిమాలో యూత్ ని ఎట్రాక్ట్ చేసే క్రమంలో ప్రతి సన్నివేశంలో అవసరం ఉన్నా లేకపోయినా బోల్డ్ నెస్ ను ఇరికించడం కొంత ఇబ్బందిగా అనిపిస్తోంది. పైగా సెకెండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు మరి స్లోగా సాగుతాయి. ఇక ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ప్రేమలో పడే సన్నివేశాలతో పాటు సెకెండ్ హాఫ్ లో ఆ లవ్ తాలూకు ట్విస్ట్ కూడా మరీ సిల్లీగా ఉంది. మదర్ క్యారెక్టర్ ఎలివేషన్ కూడా బాగాలేదు. రమ్యకృష్ణ పాత్ర మరీ ఫోర్స్ గా ఉంది.

ఇక సినిమాలో కీలక సన్నివేశాలకు సరైనా లాజిక్ కూడా ఉండడు. పైగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ కాదు. సెకండాఫ్‌లో అయినా కిక్ ఇచ్చే సీన్స్ ఉంటాయ‌నుకుంటే. నీర‌స‌మొచ్చే సీన్స్ మాత్ర‌మే క‌నిపిస్తాయి. ఎంగేజింగ్ సీన్స్ లేవ‌నే చెప్పాలి.  కథనం రొటీన్ గా సింపుల్ గా ఉండటం, కొన్ని చోట్ల సీన్స్ సిల్లీగా సాగడం, ఇక సినిమాలో ఉన్న బలమైన కాన్ ఫ్లిక్ట్ ను పూర్తి స్థాయిలో వాడుకోలేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఇక క్లైమాక్స్ లో మెయిన్ పాయింట్ కి ఆధారంగానే సరైన ముగింపు ఇచ్చి ఉంటే బాగుండేది. అలాగే మైక్ టైసన్ సీక్వెన్స్ ను కూడా ఇంకా బలంగా రాసుకోవాల్సింది. అయితే విజయ్ దేవరకొండ హై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అలరిస్తోంది. మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. అయితే, మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం కనెక్ట్ కాదు. పూరి నుంచి ఈ త‌ర‌హా పాన్ ఇండియా రేంజ్ మూవీని క‌చ్చితంగా ప్రేక్ష‌కుడు ఊహించ‌లేదనేది మాత్రం క‌చ్చితంగా చెప్పొచ్చు.

 

Tags :