రివ్యూ : 'మాచర్ల నియోజకవర్గం' లో ఏముందని థియేటర్ కి వస్తారు?

రివ్యూ : 'మాచర్ల నియోజకవర్గం' లో ఏముందని థియేటర్ కి  వస్తారు?

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.25/5
నిర్మాణ సంస్థలు : శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మ్యూజిక్,  
నటీనటులు: నితిన్, కృతీశెట్టి, కేథరిన్ థ్రేసా, రాజేంద్ర ప్రసాద్, సముద్ర ఖని, వెన్నెల కిశోర్, మురళి శర్మ, జయప్రకాష్, ఇంద్రజ, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీ, అంజలి స్పెషల్ సాంగ్ లో.... నటించారు.
కళ : సాహి సురేష్, సంగీతం: మహతి స్వరసాగర్,
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరేళ్ల, మాటలు : మామిడాల తిరుపతి,
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి,
దర్శకత్వం: ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి, (ఎస్ ఆర్ శేఖర్)
విడుదల తేది: 12.08.2022

నితిన్‌, కృతీశెట్టి, కేథరిన్ థ్రేసా హీరోహీరోయిన్లుగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'  భీష్మతో కమర్షియల్ హిట్ కొట్టిన నితిన్  తర్వాత చేసిన చెక్, రంగ్ దే, మాస్ట్రో చిత్రాల అపజయాల తర్వాత, మళ్లీ కమర్షియల్ మూవీ చేయడానికి నిర్ణయించుకుని ఆయన సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య మ్యూజిక్ సంయుక్తంగా రూపొందించిన సినిమానే ‘మాచర్ల నియోజకవర్గం’. ఎడిటర్ ఎమ్‌ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి (ఎస్.ఆర్.శేఖర్) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. సినిమా ట్రైలర్, పాటలు ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపైఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఆగస్టు 12) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి నితిన్ తన పరాజయాలకు బ్రేక్ వేసి ఈ సారైనా హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారా.. లేదా.. ప్రేక్షకులను ఎలా మెప్పించారు.. అనేది సమీక్ష లో చూద్దాం. 

కథ:

మాచర్ల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే నాగప్ప చనిపోయిన తర్వాత అతని కొడుకు రాజప్ప(సముద్ర ఖని)కి సీటు ఇవ్వకూడదని పార్టీ అనుకుంటుంది. కానీ.. అతను తన రౌడీయిజంతో మాచర్ల నియోజకవర్గంలో అస్సలు ఎన్నికలనేవే లేకుండా చేస్తాడు. అలా దాదాపు ముప్పై ఏళ్ల పాటు తనకు ఎదురనేదే లేకుండా రాజప్ప మాచర్లను శాసిస్తుంటాడు. సామాన్యులు, అధికారలు ఎవరైనా సరే.. అతనికి ఎదురొచ్చిన వారందిరినీ చంపేస్తుంటాడు. మరోపక్క సిద్దార్థ్ రెడ్డి (నితిన్) సివిల్స్ టాపర్. పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో స్వాతి (కృతి శెట్టి)ని చూసి ప్రేమలో పడతాడు.  ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమెకు తన ప్రేమను చెప్పి ఒప్పించాలనుకునేలోపు ఆమె వెళ్లిపోతుంది. తీరా సిద్ధు ఉండే కాలనీలో వారి పక్కింట్లో ఉండే గుంతలకిడి గుర్నాథం (వెన్నెల కిషోర్) ఇంటికే వస్తుంది. ఎందుకంటే గుర్నాథం ఆమెకు బావ అవుతాడు. తన పక్కింట్లోకి స్వాతి వచ్చిందని తెలుసుకున్న సిద్ధు ఆమెకు మరింత దగ్గర కావటానికి ప్రయత్నిస్తుంటాడు.

అదే సమయంలో సిటీ కమిషనర్, లాయర్ సత్యమూర్తిని కలవటానికి స్వాతికి హెల్ప్ కూడా చేస్తాడు సిద్ధు. అయితే ఓరోజు అనుకోకుండా స్వాతి కనపడకుండా పోతుంది. ఆమెను వెతుక్కుంటూ సిద్ధు మాచర్ల వస్తాడు. అక్కడ రాజప్ప కొడుకు వీర.. స్వాతిని చంపబోతుంటే కాపాడుతాడు. అదే సమయంతో గుంటూరుకే తనకు కలెక్టర్‌గా పోస్టింగ్ వచ్చిందని సిద్ధుకి తెలుస్తుంది. అసలు రాజప్ప కి స్వాతికి మధ్య ఉన్న కనెక్షన్ ఏమిటి ?, ఆ తర్వాత గుంటూరు జిల్లాకు కలెక్టర్ గా వచ్చిన సిద్దార్థ్ రెడ్డి మాచర్ల నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఎలా జరిపించాడు ?, ఫలితంగా జరిగిన కొన్ని నాటకీయ పరిణాలు ఏమిటి ? చివరకు సిద్దార్థ్ రెడ్డి మాచర్ల నియోజకవర్గం’లో పరిస్థితులు మార్చాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.

నటీనటుల హావభావాలు:

ప్రేమకథా చిత్రాలతో అలరించిన నితిన్.. అందుకు భిన్నంగా రాజకీయ నేపథ్యం ఉన్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో ముందుకొచ్చాడు. సినిమాలో పాలిటిక్స్, కలెక్టర్ విధులు చూపిస్తూనే కామెడీని పండించే ప్రయత్నం చేశాడు.   సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కీలక పాత్రలో నటించిన హీరోయిన్ కృతి శెట్టి కూడా చాలా బాగా నటించింది. కథలో ఆమె పాత్రను ఇన్ వాల్వ్ చేయడం బాగుంది. మరో హీరోయిన్ కేథరిన్ పాత్ర కేవలం సపోర్టింగ్ రోల్ కే పరిమితమైంది. కానీ ఉన్నంతలో తన పాత్ర పరిధి మేరకు ఆమె బాగానే నటించింది. విలన్ గా ప్రధాన పాత్రలో కనిపించిన సముద్రఖని తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించిన రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. సినిమాలో వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది.

సాంకేతికవర్గం పనితీరు:

ఎడిటింగ్ లో మంచి పేరు సాధించిన దర్శకుడు ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి. కొత్త డైరెక్టర్ కొత్త ఫార్ములాతో వస్తే బాగుండేది. కానీ  రెగ్యూలర్ రొటీన్ ఫార్ములాతో తెరపై 'మాచర్ల నియోజకవర్గం'ను ఆవిష్కరించాడు. అక్కడక్కడ స్క్రీన్ ప్లే లో కొద్దిగా స్లో కావడంతో సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఈ కథను న‌మ్మి నితిన్ సినిమా ఎలా  చేశాడో అస్స‌లు అర్థం కాలేదు. కలెక్టర్ గా నితిన్ చెప్పే డైలాగ్ లు ఆకట్టుకునేలా ఉన్నాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ, సినిమాలోని చాలా సన్నివేశాలను ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చూపించారు. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

విశ్లేషణ:

ప్ర‌తి హీరో ప్రేక్షకుడికి క‌నెక్ట్ కావటానికి క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్ సినిమాల్లో యాక్ట్ చేయాల‌నుకోవటం త‌ప్పేమీ కాదు. అయితే క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్ అంటే ఒకే స్టైల్లోనే ఉంటాయా? అని ఇలాంటి సినిమాలు చుస్తే అనిపిస్తుంది. ‘మాచర్ల నియోజకవర్గం’ అలాంటి  అలాంటి రొటీన్  సినిమాల లిస్టులోకి చేరింది. సినిమా అనౌన్స్ చేసినప్పుడు. అందులో నితిన్ కలెక్టర్‌గా మెప్పిస్తాడ‌నే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆడియెన్స్‌లో ఆస‌క్తి క‌లిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు నితిన్ చేయన‌టువంటి పాత్ర‌లో ఎలా మెప్పిస్తాడో చూడాల‌ని అంద‌రూ అనుకున్నారు. ఇటీవల రామారావు ఆన్ డ్యూటీ మూవీ లో కూడా రవితేజ గవర్నమెంట్ ఆఫీసర్ గా నటించాడు ఆ చిత్రం విడువులై నెల తిరగకుండానే ఇప్పడు నితిన్. చిత్రంలోని నమ్మశక్యం కాని సన్నివేశాలతో, ఇంట్రెస్ట్ కలిగించలేని స్క్రీన్ ప్లేతో , వర్కౌట్ కాని పొలిటికల్ సీన్స్ వంటి అంశాలు కారణంగా ఈ సినిమా అక్కట్టుకోలేక పోయింది.  స్టార్ట్ అయిన మొదటి రీల్ కే... సినిమా ఎలా ఉండ‌బోతుంద‌నేది స‌గ‌టు ప్రేక్ష‌కుడికి తెలిసి పోతుంది. ఇక సినిమా ఇంట‌ర్వెల్‌కు వ‌చ్చే స‌రికి ఇక సెంక‌డాఫ్ ఎలా ఉంటుంద‌నేది క్లియ‌ర్ క‌ట్‌గా అర్థ‌మైపోతుంది. స‌రే! పాయింట్ పాతదే క‌దా.. దాన్ని బేస్ చేసుకుని అల్లుకునే స‌న్నివేశాలు ఏమైనా కొత్త‌గా ఉన్నాయా అంటే అదీ లేదు.  ‘మాచర్ల నియోజకవర్గం’ రొటీన్ కథ, బోరింగ్ మూవీ.     

 

Tags :