రివ్యూ : మిమ్మల్ని భయపెట్టే హర్రర్ 'మసూద'

రివ్యూ : మిమ్మల్ని భయపెట్టే హర్రర్ 'మసూద'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మంఎట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
నటీనటులు: సంగీత, తిరువీర్‌, కావ్య కల్యాణ్‌రామ్‌, శుభలేఖ సుధాకర్‌, సత్యప్రకాష్‌, సత్యం రాజేష్‌ తదితరులు
కెమెరా: నగేష్‌, ఆర్ట్: క్రాంతి ప్రియమ్‌, ఎడిటర్‌: జెస్విన్‌ ఫ్రభు
సౌండ్‌ డిజైన్‌: సింక్‌ సినిమా, స్టంట్స్: రామ్‌ క్రిష్ణన్‌, స్టంట్‌ జాషువా, సంగీతం: ప్రశాంత్‌.ఆర్‌.విహారి
నిర్మాత: రాహుల్‌ యాదవ్‌ నక్కా, రచన, దర్శకత్వం: సాయికిరణ్‌

ఇండస్ట్రీలో కొన్ని బ్యానర్లకు స్పెషల్‌ క్రేజ్‌ ఉంటుంది. మళ్లీరావా, ఏజెంట్‌ సాయిశ్రీనివాస్‌ ఆత్రేయ సినిమాలను తెరకెక్కించిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మీద కూడా ఎప్పుడూ ఓ నజర్‌ ఉంటుంది. ఇప్పుడు ఆ బ్యానర్‌ నుంచి వచ్చిన మూవీ మసూద. ఈ సినిమా ఎలా ఉంది? జనాలకు నచ్చుతుందా? అసలు మసూద ఎవరు? ఆమె కథ ఏంటి? సమీక్ష లో చూడండి!

కథ:

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ ని మెప్పించిన 'మసూద' అంతగా వాళ్ళను ఎందుకు ఆకట్టుకుంది?  కథలో చూద్దాం! గోపి (తిరువీర్‌) ఓ ప్రైవేట్‌ ఆఫీస్‌లో పనిచేస్తుంటాడు. అతని కొలీగ్‌ మిని (కావ్య). ఆమెను ఇష్టపడుతుంటాడు. అయితే స్వతహాగా ఇంట్రోవర్ట్ కావడంతో ఆ విషయాన్ని బయటకు చెప్పడు. తీరా ఒకరికొకరు అర్థమవుతున్నారనుకునే సమయానికి గోపి అపార్ట్ మెంట్‌లో ఓ ఇష్యూ జరుగుతుంది. గోపీ ఉండే అదే అపార్ట్ మెంట్‌లో ఉంటుంది నీలమ్‌ (సంగీత). ఆమె కూతురు నజియా(అఖిల రామ్) ఆర్టిస్ట్. ఉన్నట్టుండి పిచ్చిగా ప్రవర్తిస్తుంది నజియా. ఆ విషయం అర్థం కాని నీలమ్‌.. గోపీ సాయం కోరుతుంది. సాయం చేయడానికి వెళ్లిన గోపీకి మసూద గురించి తెలుస్తుంది. నజియాకీ మసూదకీ సంబంధం ఏంటి? నజియా చేతికున్న బ్రేస్‌లెట్‌ ఎవరిది? గోపీకీ, నీలమ్‌ కుటుంబానికి ఉన్న రిలేషన్‌ ఎలాంటిది? గోపీని మిని అర్థం చేసుకుందా? అపార్థం చేసుకుందా? ఇలాంటి చాలా విషయాలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే!

నటీనటుల హావభావాలు:

సంగీత స్కూలు టీచర్‌ కేరక్టర్‌లో, సింగిల్‌ మదర్‌గా, కాటన్‌ చీరలు కట్టుకుని చాలా బాగా యాక్ట్ చేశారు. స్ట్రాంగ్‌ విమెన్‌గా ఆమె కేరక్టర్‌కి న్యాయం చేశారు.. నజియా కేరక్టర్‌ చేసిన అమ్మాయి అఖిల రామ్ నేచురల్‌గా పెర్ఫార్మ్ చేసింది. గోపీలాంటి పాత్రలు మనకు నిజజీవితంలోనూ చాలా ఎదురుపడుతుంటాయి. కావాల్సినంత మాట్లాడటం, అవతలివారికి వీలైనంత సాయం చేయడం, తన పని తాను చేసుకుపోవడం.. ఇలాంటి కేరక్టరిస్టిక్స్ తో చాలా మంది రిలేట్‌ అవుతారు. మిని లాంటి అమ్మాయిలు మనకు తరచుగా కనిపిస్తూనే ఉంటారు.

సాంకేతికవర్గం పనితీరు:

మామూలుగా మసూద అని టైటిల్‌ పెట్టినప్పుడు, టైటిల్‌ పాత్రధారిని పాజిటివ్‌ కోణంలో చూపించే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ సినిమాలో మసూదది నెగటివ్‌ కేరక్టర్‌. దాన్ని కూడా చాలా అందంగా మలచి, అందరికీ కన్విన్సింగ్‌గా చెప్పగలిగారు డైరక్టర్‌. ఎక్కడా బోర్‌ కొట్టకుండా, జాగ్రత్తగా స్క్రీన్‌ప్లే రాసుకున్నారు. పనిచేసే చోట జీతాలు సరిగా ఇవ్వకపోతే, ఆ జీతాల మీద ఆధారపడ్డ కుటుంబాలు ఎదుర్కునే పరిస్థితులు… గౌరవంగా బతుకుతున్న సొసైటీని ప్రతిరోజూ ఫేస్‌ చేయలేక పడే పాట్లను కూడా సెన్సిటివ్‌గా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ సౌండ్‌ని స్పెషల్‌గా మెన్షన్‌ చేయాల్సిందే సినిమాకు అత్యంత పెద్ద ప్లస్‌ పాయింట్‌. కెమెరాపనితనం, ఆర్ట్ వర్క్ కూడా బావుంది. సినిమాను ఇంకాస్త క్రిస్పీగా ఎడిట్‌ చేసి ఉంటే బావుండేది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.

విశ్లేషణ:

కథ ఆసక్తిగా సాగుతున్నా, స్క్రీన్‌ మీద సన్నివేశాలు మాత్రం స్లోగా సాగుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. సాటి మనిషికి సాయం చేయాలంటే వారితో ఏదో రిలేషన్‌ ఉండక్కర్లేదని చెప్పే మూవీ మసూద. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది మసూద. హారర్ సినిమాలు అంటే ఎక్కువగా హిందూ సంప్రదాయం నేపథ్యంలో ఉంటాయి. 'మసూద'లో డిఫరెన్స్ ఏంటంటే... కథంతా ముస్లిం నేపథ్యంలో సాగుతుంది. ఆత్మలను వదిలించడానికి సాధువులు, అఘోరాలు పూజలు చేయడం హారర్ సినిమాల్లో చూసుంటాం. 'అరుంధతి'లో షాయాజీ షిండే రోల్ తావీదులు కట్టినా... అందులోనూ హిందూ పూజలు ఎక్కువ. కానీ, 'మసూద' అంతా ముస్లిం నేపథ్యంలో సాగడంతో... పీర్ బాబాలు ఆత్మలను వదిలించడానికి ఇస్లాం నేపథ్యంలో పూజలు చేయడం, మసీదులో మంత్రించిన కత్తితో దెయ్యాన్ని అంతం చేయడానికి చూపించడం వంటివి ఉంటాయి. మసూద'లో ముస్లిం నేపథ్యం... సన్నివేశాలను తెరకెక్కించిన తీరు కొంచెం కొత్తగా ఉంటుంది. కథ విషయానికి వస్తే... ఆ కొత్తదనం తక్కువ. కథను నడిపించిన తీరు కూడా సాధారణంగా ఉంటుంది. ప్రథమార్థంలో దర్శకుడు పాత్రలను పరిచయం చేయడానికి మాత్రమే వాడుకున్నారు. దాంతో కథ ముందుకు కదలదని ఫీలింగ్ ఉంటుంది. నిడివి ఎక్కువైనా కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. విశ్రాంతి తర్వాత అసలు కథ మొదలైంది. కథ సాధారణంగా అనిపించినా... సన్నివేశాలు బావున్నాయి. చివరి అరగంట ఉత్కంఠ కలిగిస్తుంది. అందుకు ఛాయాగ్రహణం, సంగీతం ప్రధాన కారణమని చెప్పాలి. ఏదో జరుగబోతుందనే ఉత్కంఠను అలా కొనసాగించారు. 

 

Tags :
ii). Please add in the header part of the home page.