చైనా పాఠం..! జనం తిరగబడితే ఎంతటి నియంతలైనా తలవంచాల్సిందే!!

చైనా పాఠం..! జనం తిరగబడితే ఎంతటి నియంతలైనా తలవంచాల్సిందే!!

ప్రజలు తిరగబడితే ఎంతటి నియంతలైనా తలవంచాల్సిందే.! చరిత్ర ఇదే చెప్తోంది. దశాబ్దాలపాటు రాజ్యాలను ఏలిన ఎంతోమంది ఒక్క ఉద్యమానికి పారిపోయిన సందర్భాలున్నాయి. యుక్రెయిన్ పై యుద్ధం విషయంలో రష్యా అధినేత పుతిన్ ప్రజాగ్రహానికి తలొంచాల్సి వచ్చింది. ఇప్పుడు చైనాలో కూడా ఇదే జరుగుతోంది. మూడోసారి అధికారంలోకి వచ్చి తనకు తిరుగులేదనిపించుకున్న జిన్ పింగ్ ఇప్పుడు ప్రజాగ్రహానికి కారణమవుతున్నాడు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో తల పట్టుకుంటున్నాడు. కమ్యూనిస్టు దేశంలో అధ్యక్షుడు చెప్పిందే వేదం. అక్కడ ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించే అధికారం ఉండదు. అయితే నియంతృత్వ పోకడలు ఎక్కువైతే ప్రజల్లో కూడా తిరుగుబాటు మొదలవుతుంది. ఇప్పుడు చైనాలో ఇదే జరుగుతోంది. జిన్ పింగ్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. జిన్ పింగ్ దిగిపో.. అని నినాదాలు చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది.?

చైనా కమ్యూనిస్టు దేశమనే విషయం మనకు తెలిసిందే. అక్కడ ప్రజాస్వామ్యం ఉండదు. ప్రభుత్వ నిర్ణయాలను ధిక్కరించకూడదు. రాజు చెప్పిందే వేదం అన్నట్టు అక్కడ అధ్యక్షుడి మాటే శాసనం. కమ్యూనిస్టు పార్టీని పూర్తిగా తన అదుపులో ఉంచుకున్న జిన్ పింగ్ ఇప్పుడు అటు పార్టీ పైన, ఇటు ప్రభుత్వంపైన పూర్తి పట్టు సాధించారు. అక్కడ ఆయన ఏం చెప్తే అదే జరగాలి. వాస్తవానికి చైనా కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల ప్రకారం రెండుసార్లు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టే అధికారం ఉంటుంది. కానీ ఆ రూల్స్ ను సవరించుకున్న జిన్ పింగ్ .. మూడోసారి అధికార పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన నియంతృత్వ పోకడలు మరింత ఎక్కువయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు, తనపై ఉన్న అసంతృప్తిని అణచివేసేందుకు కఠిన నిర్ణయాలతో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇప్పుడు జిన్ పింగ్ కూడా తలవంచాల్సిన పరిస్థితులు వచ్చాయి. కమ్యూనిస్టు పార్టీకి, జిన్ పింగ్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్దఎత్తున రోడ్లపైకి వస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ధిక్కరిస్తున్నారు. ముఖ్యంగా జీరో కోవిడ్ పాలసీపై జనం విసుగెత్తిపోయారు. దీంతో ఊహించని విధంగా వీధుల్లోకి వచ్చేస్తున్నారు. దీంతో గతంలో ఎన్నడూ చైనాలో చూడని దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. చైనాలో ప్రజలు తిరుగుబాటు చేయడమా.. దాన్ని ప్రభుత్వం చూస్తూ ఉండడమా.. అని ఆశ్చర్యపోతున్నారు. కానీ జిన్ పింగ్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత ముందు తలొంచక తప్పట్లేదు. తన ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష నిర్వహించుకోవాల్సిన పరిస్థితిని ప్రజలు తీసుకొచ్చారు.

ప్రజల తిరుగుబాటుతో జిన్ పింగ్ ప్రభుత్వం తలొగ్గింది. పలు నిబంధనలను సవరించింది. జీరో కోవిడ్ పాలసీలో మార్పులు తీసుకొచ్చింది. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొంటోంది. కోవిడ్ సోకిన వారికి ప్రైమరీ కాంటాక్ట్ గా ఉన్న వారికి వారం రోజులపాటు చైనాలో క్వారంటైన్ తప్పనిసరి. అయితే ఈ నిబంధనను సడలించి ఐదు రోజులకు తగ్గించింది. అది కూడా మూడు రోజులు హోం క్వారంటైన్లో ఉంటే చాలు. ఇక సెకండరీ కాంటాక్ట్ లను ట్రేస్ చేసి మరీ క్వారైంటైన్ సెంటర్లకు తరలించేవారు. కానీ ఇప్పుడు ఈ నిబంధనను పూర్తిగా ఎత్తేసింది. అంతేకాదు.. గతంలో ఏదైనా నగరంలో ఒక్కచోట కరోనా కేసు నమోదైతే నగరం మొత్తాన్ని నిర్బంధించేసేవారు. ఇళ్లకు తాళాలు వేసి బంధించేవారు. కానీ ప్రజల తిరుగుబాటుతో ఈ నిబంధనను కూడా సడలించింది. ఎంతటి నియంతలకైనా ప్రజలు బుద్ధి చెప్పగలరనేందుకు ఇదే ఉదాహరణ.

 

 

Tags :