200 కోట్ల క్లబ్‌లో చేరిన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’

200 కోట్ల క్లబ్‌లో చేరిన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’

‘వాల్తేరు వీరయ్య’ సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి , మాస్ మహారాజా రవితేజ  క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’  సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద 10 రోజుల్లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ రూ.200 కోట్ల పోస్టర్‌ను ట్వీట్ చేసింది. కాగా, 10 రోజుల్లో ‘వాల్తేరు వీరయ్య’ డిస్ట్రిబ్యూటర్ షేర్ సుమారు రూ.120 కోట్లుగా ఉంది. ఇదిలా ఉంటే, ‘వాల్తేరు వీరయ్య’ రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన చిరంజీవి మూడో సినిమా. అంతకు ముందు ‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలు రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి.

అయితే, చిరంజీవి కన్నా ముందే సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఘనత సాధించారు. మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘భరత్ అనే నేను’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సర్కారు వారి పాట’ సినిమాలు రూ.200 కోట్ల క్లబ్‌లో చేరాయి. అలాగే, ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’, ‘సాహో’ సినిమాలు రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల సరసన మెగాస్టార్ చిరంజీవి చేరారు. ఇండస్ట్రీలో ప్రస్తుతం రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి యంగ్ డైనమిక్ హీరోలు ఉన్నప్పటికీ వారెవ్వరికీ సాధ్యం కాని ఘనతను మెగాస్టార్ చిరంజీవి అందుకోవడం విశేషం. ఈ దెబ్బతో తన స్టామినా ఇంకా తగ్గలేదని బాస్ మరోసారి గుర్తుచేశారు. బాస్ ఈజ్ బ్యాక్ అనిపించారు. ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ సినిమాలు వరుసగా బాక్సాఫీసు వద్ద వైఫల్యం చెందడంతో ఇక మెగాస్టార్ పని అయిపోయిందని చాలా మంది విమర్శించారు. కానీ, సరైన సినిమా పడితే బాస్ మాస్ జాతర ఎలా ఉంటుందో ‘వాల్తేరు వీరయ్య’తో చిరు చూపించారు.

కాగా, టాలీవుడ్ నుంచి చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తరవాత రూ.200 కోట్ల సినిమాల క్లబ్‌లో ఉన్నది రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఖాతాలో చెరో రెండు రూ.200 కోట్ల సినిమాలు ఉన్నాయి. ‘రంగస్థలం’, ‘RRR’ సినిమాలు రామ్ చరణ్‌ను రూ.200 కోట్ల క్లబ్‌లో చేర్చాయి. ఇక ‘అల వైకుంఠపురములో’, ‘పుష్ప’ అల్లు అర్జున్‌కు రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను అందించాయి.  అయితే, తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాతాలో రూ.200 కోట్లు వసూలు చేసిన సినిమా లేకపోవడం గమనార్హం. సుమారు రూ.160 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘భీమ్లా నాయక్’ సినిమానే పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ది బెస్ట్.


Mythri Tweet
https://twitter.com/MythriOfficial/status/1617497468433993729

 

 

Tags :