ఐటీ బ్రాండింగ్ పై ప్రత్యేక దృష్టి రాష్ట్ర ఐటీ,పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి

ఐటీ బ్రాండింగ్ పై ప్రత్యేక దృష్టి  రాష్ట్ర ఐటీ,పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోకి భారీ ప్రాజెక్టులను ఆకర్షించే విధంగా ఐటీ బ్రాండిరగ్‌పై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వర్కింగ్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్‌ (డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీ) విధానం అమలుపై వివిధ శాఖల అధికారులతో ఇటీవల ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార పౌరసంబంధాల శాఖ సమన్వయంతో అపీటా ప్రమోషన్‌పై మరింత ఫోకస్‌ చేయాలని సూచించారు. త్వరలోనే ఢల్లీి వెళ్లి దేశంలోనే తొలిసారిగా అమలు చేస్తున్న డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీ విధానం గురించి కేంద్ర ఐటీ శాఖ మంత్రికి వివరించనున్నట్లు తెలిపారు. ఈ విధానంలో పెద్దస్థాయి ఐటీ కంపెనీలు భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీ పైలెట్‌ ప్రాజెక్టు కింద తొలుత 29 చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, వీటిని డిసెంబర్‌ నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుతం విద్యుత్‌ కొరతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, ఈ కేంద్రాలకు కొరత లేకుండా నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కేంద్రంలో పవర్‌ బ్యాకప్‌ కోసం యూపీఎస్‌, జనరేటర్లను ఏర్పాటు చేయడం ద్వారా కంపెనీలను ఆకర్షించవచ్చన్నారు. ఈ 29 కేంద్రాలకు అవసరమైన బ్యాండ్‌విడ్త్‌ సదుపాయాన్ని సత్వరమే కల్పించాలని ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డిని ఆయన ఆదేశించారు. రెండు మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు అతి తక్కువ సమయంలో చౌకగా సరుకు రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు.

ఇందుకోసం త్వరలోనే కొత్త లాజిస్టిక్‌ విధానం తీసుకొస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం గతి శక్తి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మేకపాటి అనంతరం రాష్ట్ర లాజిస్టిక్‌ పాలసీపై భాగస్వాములతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్తగా పోర్టుల నిర్మాణంతో పోర్టుల సామర్థ్యం అదనంగా 350 మిలియన్‌ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పోర్టుల వద్ద రెండు మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

 

Tags :