కొవిడ్ ఆంక్షల్ని మళ్లీ పొడిగించిన కేంద్రం

కొవిడ్ ఆంక్షల్ని మళ్లీ పొడిగించిన కేంద్రం

గత కొన్నాళ్లుగా తగ్గుముఖం పట్టినట్టే కనిపించిన కొవిడ్‌ మహమ్మారి, మళ్లీ ఒమిక్రాన్‌ రూపంలో గుబులు రేపుతున్నాయి. దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న కొవిడ్‌ నిబంధనలు, మార్గదర్శకాల్ని డిసెంబర్‌ 31 వరకు పొడిగించింది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ పట్ల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ అత్యంత అప్రమత్తతో ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరించింది. ఒమిక్రాన్‌ కలకలం నేపథ్యంలో ఈ నెల 25న కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా తెలిపారు.

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కచ్చితంగా స్క్రీనింగ్‌, టెస్టింగ్‌ చేయాలని సూచించారు. అలాగే వారు ఎవరెవరిని  కలిశారో ట్రేసింగ్‌ చేసి, వారికి పరీక్షలు నిర్వహించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎవరికైనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వారి శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు పంపాలని ఆదేశించారు.  దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న కొవిడ్‌ కట్టడి చర్యల్ని డిసెంబర్‌ 31 వరకు కొనసాగించాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించారు.

 

Tags :