MKOne TeluguTimes-Youtube-Channel

రివ్యూ : 'మైఖేల్' ప్రేక్షకులతో ఖేల్

రివ్యూ : 'మైఖేల్' ప్రేక్షకులతో ఖేల్

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2/5

నటీనటులు : సందీప్ కిషన్, గౌతమ్ మీనన్, విజయ్ సేతుపతి, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మీ శరత్ కుమార్, అనసూయ, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, అనీష్ కురువిల్లా తదితరులు మాటలు : త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి ఛాయాగ్రహణం : కిరణ్ కౌశిక్ సంగీతం : సామ్ సిఎస్ నిర్మాతలు : భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు కథ, కథనం, దర్శకత్వం : రంజిత్ జయకొడి విడుదల తేదీ: 03.02.2023

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన తొలి పాన్ ఇండియా సినిమా 'మైఖేల్'. ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్ని చాలా ఆకట్టుకున్నాయి. హీరోకి తోడు ప్రత్యేక పాత్రలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఇతర పాత్రల్లో గౌతమ్ మీనన్, అనసూయ, వరలక్ష్మీ శరత్ కుమార్, వరుణ్ సందేశ్ లాంటి తారాగణం ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ రోజు విడుదలైన ఈ చిత్రంతో సందీప్ కిషన్ ఈ సారైనా సక్సెస్ సాధించాడా? లేదా సమీక్షలో చూద్దాం.

కథ:

ముంబై మాఫియా సామ్రాజ్యానికి గురునాథ్ (గౌతమ్ మీనన్) తిరుగులేని రాజు. ఓ సందర్భంలో అతడిని భారీ ఎటాక్ నుంచి మైఖేల్ (సందీప్ కిషన్) కాపాడతాడు. ఆ తర్వాత గురునాథ్ నమ్మదగిన వ్యక్తుల్లో మైఖేల్ ఒకడవుతాడు. తనపై ఎటాక్ ప్లాన్ చేసిన వ్యక్తుల్లో రతన్ (అనీష్ కురువిల్లా) ను తప్ప మిగతా అందరినీ చంపేసిన గురునాథ్, అతడిని చంపే బాధ్యత మైఖేల్ చేతిలో పెడతారు. రతన్‌ను పట్టుకోవడం కోసం ఆమె కుమార్తె తీర (దివ్యాంశ కౌశిక్)ను ఫాలో అవుతాడు మైఖేల్. ఆ క్రమంలో ఒక్కటవుతారు. రతన్ చేతికి దొరికినా మైఖేల్ చంపకుండా వదిలేస్తాడు. ఎందుకు? ఆ విషయం తెలిసిన గురునాథ్ ఏం చేశాడు? మైఖేల్ చావాలని గురునాథ్ కుమారుడు అమర్ నాథ్ (వరుణ్ సందేశ్), భార్య (అనసూయ) పగతో రగిలిపోవడానికి కారణం ఏమిటి? మధ్యలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రలు ఏమిటి? చివరకు, మైఖేల్ ఏం చేశాడు? అనేది మిగతా కథ.

నటి నటుల హావభావాలు:

సందీప్ కిషన్ 'ప్రస్థానం' నుంచి ఇప్పటి వరకు చేసిన సినిమాలు చూస్తే... ఈ చిత్రంలో నటనా పరంగా ఎంతో ఆకట్టుకున్నాడు. మైఖేల్ జీవితంలో జరిగిన పరిణామాలను, అలాగే తన తల్లికి అన్యాయం చేసిన వ్యక్తి పై పగ తీర్చుకునే క్రమాన్ని కొంతవరకు బాగానే ఎలివేట్ చేశారు. అదే విధంగా మైఖేల్ గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు అనే కోణంలో ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం చేశారు. మైఖేల్ పాత్రలో సందీప్ కిషన్ నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా అతనిలోని ఆవేశం, ధైర్యసాహసాలు, అన్యాయం జరిగితే ఎదురుతిరిగే లక్షణాలను సందీప్ కిషన్ తన హావాబావాలలో బాగా పలికించాడు. 'మైఖేల్' మాఫియా బ్యాక్‌డ్రాప్ కావడంతో మాసీగా చేసుకుంటూ వెళ్ళారు. గుండెల్లో అంతులేని బాధను బయటపెట్టలేని యువకుడిగా బాగా నటించారు. ఇక హీరోయిన్ గా నటించిన దివ్యాంశ కౌశిక్ తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్ బాగా నటించింది. అనసూయకి కీలక పాత్ర దొరికింది. విజయ్ సేతుపతి పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే గౌతం మీనన్, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ పర్మార్మెన్స్ లు కూడా బాగున్నాయి. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. మాఫియా డాన్ పాత్రలో గౌతమ్ మీనన్ నటన కంటే వాయిస్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. 'మైఖేల్'తో వరుణ్ సందేశ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లకు షిఫ్ట్ అయిపోవచ్చు.

సాంకేతికవర్గం పనితీరు:

ఈ కథనూ ఇంతకు ముందు సినిమాల్లో చూసినట్టు ఫీలవుతాం. మరి, కొత్తగా ఏముంది? అంటే... 'మైఖేల్' కథ, కథనాలు కొత్త కాకపోవచ్చు. కథను చెప్పిన తీరు 'కెజిఎఫ్'ను గుర్తు చేస్తుంది. అయితే... మేకింగ్ & ట్రీట్మెంట్, నేపథ్య సంగీతం మెల్లగా అలవాటు అవుతూ ఉంటుంది. రెట్రో స్టైల్‌లో బాగా తీశారు. యాక్షన్ సినిమా ప్రేమికులకు ఆ స్టైల్ బాగా నచ్చుతుంది. కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ బావుంది. కథా నేపథ్యానికి తగ్గట్టు లైటింగ్ థీమ్, కలర్ గ్రేడింగ్ చక్కగా చేశారు. సామ్ సిఎస్ స్వరాలు, నేపథ్య సంగీతం బావుంది. కానీ, కథ డిజప్పాయింట్ చేస్తుంది. కథనం కూడా! దర్శకుడు రంజిత్ జయకొడి టేకింగ్ ఓకే. సినిమా చివరలో తనకు స్ఫూర్తి ఇచ్చిన సినిమాల పేర్లు కూడా వేశారు. అయితే... ఆ కథ, అందులో ట్విస్టులు మాత్రం పవన్ కళ్యాణ్, ప్రభాస్ చేసిన తెలుగు సినిమాలను గుర్తు చేస్తాయి. సినిమా నిడివి కూడా ఎక్కువైన ఫీలింగ్ ఉంటుంది. నెమ్మదిగా ముందుకు కదులుతుంది. డైలాగులు, హీరోకి ఇచ్చే ఎలివేషన్లు, సీన్లు... ప్రతి దాంట్లో 'కెజిఎఫ్'ప్రభావం కనపడుతుంది. నిర్మాతలు భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ:

'మైఖేల్' - అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ఇది. కథ, కథనంలో కొత్తదనం ఉండదు. ఆల్రెడీ చూసేసిన సినిమాలే గుర్తుకు వస్తాయి. అయితే... మేకింగ్ స్టైల్, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్, సామ్ సిఎస్ సంగీతం కొంత వరకూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ మైఖేల్ మూవీలో మెయిన్ పాయింట్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు బాగానే ఉన్నాయి. ఐతే, స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్ట్ మిస్ అవ్వడం, అలాగే ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ కూడా బలహీనంగా ఉండటం, పంజా, మున్నా, ముఖ్యంగా కేజీఎఫ్ వంటి చిత్రాలను ఎక్కువగా అనుకరించడం వంటి అంశాలు సినిమాకి బాగా మైనస్ అయ్యాయి. ఐతే, సినిమాలో సందీప్ కిషన్ నటన బాగుంది. మైఖేల్ పాత్ర తాలూకు కొన్ని ఎమోషన్స్ బాగున్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. కొత్తకంటెంట్ తో ఈ తరహా సినిమా తీస్తే రిజల్ట్ వేరే రేంజ్‌లో ఉండేది.

 

 

Tags :