హుజూరాబాద్ కు ట్రబుల్ షూటర్ !

హుజూరాబాద్ కు ట్రబుల్ షూటర్ !

తెలంగాణలో కాక రేపుతున్న హుజురాబాద్ రాజకీయం.. మరింత రంజుగా మారబోతోంది. మాజీ మంత్రి ఈటలను ఎదుర్కొనేందుకు.. గులాబీ దళపతి కేసీఆర్ పార్టీలోని కీలక నేతలకు బాధ్యతలు అప్పగించబోతున్నారు. హుజురాబాద్‌లో గులాబీ పార్టీ పట్టు సడలకుండా ఉండేందుకు.. ట్రబుల్ షూటర్ హరీశ్ రావును గ్రౌండ్‌లోకి దించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి హరీశ్ మాత్రమే ఈ ఆపరేషన్‌ని సక్సెస్ చేయగలరని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

టీఆర్ఎస్‌లో సీనియర్ లీడర్‌గా గుర్తింపు పొందిన లీడర్లతో.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా ఒకరు. ఆయన్ని సీఎం కేసీఆర్.. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో.. ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని ఇన్ డైరెక్ట్‌గా చెప్పేశారు. దీంతో.. తన నియోజకవర్గమైన హుజురాబాద్‌లో తరచుగా పర్యటిస్తున్నారు. అధికార పార్టీని, గులాబీ లీడర్లను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈటలకు చెక్ పెట్టాలంటే.. నియోజకవర్గ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్‌లతో పాటు త్వరలోనే కీలక నేతలైన మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌కు కూడా బాధ్యతలు కట్టబెట్టేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీలో కొనసాగిన ఈటల రాజేందర్‌ను ఎదుర్కోవాలంటే.. పార్టీలోని సీనియర్ నేతలనే రంగంలోకి దించాలనే స్ట్రాటజీతో.. సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం.. టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన హరీశ్‌ని రంగంలోకి దించాలని నిర్ణయించినట్లు సమాచారం.

హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే.. టీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలింది. దీంతో.. పార్టీ నేతలందరినీ మళ్లీ గులాబీ టెంట్ కిందకు తీసుకొచ్చేందుకు.. అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే.. కొందరు టీఆర్ఎస్‌తోనే కలిసి ఉంటామని ప్రకటించారు. కొందరు ఈటల నియోజకవర్గంలో పర్యటించగానే.. ఆయనకు జైకొడుతున్నారు. దీంతో.. హుజురాబాద్ ఇష్యూను.. అధికార టీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకుంది. పార్టీ పరంగా.. ఇప్పటివరకు ఈటలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోయినా.. జరుగుతున్న పరిణామాలతో.. ఈటల ఎప్పుడైనా పార్టీకి, ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పే అవకాశం ఉందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. అప్పటిదాకా ఎదురుచూడకుండా.. ఇప్పటి నుంచే హుజురాబాద్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు.. గులాబీ పార్టీ రెడీ అయ్యింది.

టీఆర్ఎస్ హుజురాబాద్‌పై ఫోకస్ చేయడంతో.. నియోజకవర్గంలో పట్టున్న ఈటలను ఎదుర్కొనేందుకు.. ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంత్రి హరీశ్‌కు.. హుజురాబాద్ బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే.. ట్రబుల్ షూటర్ నియోజకవర్గ నేతలతో టచ్‌లో ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇటీవల.. మాజీ మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యలు కూడా మంత్రి హరీశ్‌కు.. హుజురాబాద్ ఇంచార్జ్‌గా బాధ్యతలు ఇవ్వబోతున్నారనే సంకేతాలిచ్చాయి.

అయితే.. ఈటల రాజేందర్, హరీశ్ రావుకు మధ్య ఉద్యమ కాలం నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో.. ఈటల పట్టు తగ్గించేందుకు.. హుజురాబాద్‌లో హరీశ్ రావు చేయబోయే ఆపరేషన్ ఆసక్తి రేపుతోంది. గతంలో చాలాసార్లు ఉపఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో.. మంత్రి హరీశ్ రావు ఇంచార్జ్‌గా వ్యవహరించారు. 2006 కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికలోనూ.. హరీశ్ ఇంచార్జ్‌గా ఉన్నారు. పరకాల, స్టేషన్ ఘన్‌పూర్, కొడంగల్, గద్వాల్ నియోజకవర్గాల్లో జరిగిన ఉపఎన్నికల్లోనూ.. హరీశ్ ఇంచార్జ్‌గా బాధ్యతలు చూసుకున్నారు. ఇప్పుడు.. హుజురాబాద్‌ను ఎలా డీల్ చేస్తారన్నదే.. మోస్ట్ ఇంట్రస్టింగ్ పాయింట్.  మరి చూద్దాం ఏం జరుగుతుందో!

 

Tags :
ii). Please add in the header part of the home page.