ముగిసిన కె.విశ్వనాథ్ అంత్యక్రియలు : పంజాగుట్ట శ్మశాన వాటికలో ఖననం

దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశాన వాటికలో శుక్రవారం మధ్యాహ్నం ముగిశాయి. పంజాగుట్ట శ్మశాన వాటికలో కళాతపస్వి పార్థివదేహాన్ని ఖననం చేశారు. అంతకు ముందు ఫిలింనగర్‌లోని కె.విశ్వనాథ్ ఇంటి నుంచి పంజాగుట్ట శ్మశాన వాటిక వరకూ అంతిమయాత్ర కొనసాగింది. వీరశైవ జంగమ సంప్రదాయం ప్రకారం కళాతపస్వి అంత్యక్రియలు జరిగాయి. ఆయన్ని కూర్చోబెట్టి ఖననం చేశారు.
92 ఏళ్ల కాశీనాథుని విశ్వనాథ్.. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చాలాకాలంగా ఇంటికే పరిమితమైన విశ్వనాథ్.. గురువారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని వెంటనే ఫిలింనగర్ అపోలో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. విశ్వనాథ్ పార్థివదేహాన్ని రాత్రే హాస్పిటల్ నుంచి ఇంటికి తరలించారు. ఈరోజు ఉదయం సినీ ప్రముఖులంతా విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నటులు చంద్రమోహన్, కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, రాధికా శరత్‌కుమార్, నాజర్ సహా దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి, బోయపాటి శ్రీను, మెహర్ రమేష్, నిర్మాతలు సి.అశ్వనీదత్, అల్లు అరవింద్, డి.సురేష్ బాబు, సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్ తదితరులు కె.విశ్వనాథ్‌కు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.
ఆ తరవాత మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఫిలింనగర్‌లోని కె.విశ్వనాథ్ నివాసం నుంచి పంజాగుట్ట శ్మశాన వాటికకు అంతిమయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో విశ్వనాథ్ పార్థివదేహాన్ని ఖననం చేశారు. ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్‌గా అంత్యక్రియలను ముగించారు. ఇదిలా ఉంటే, సరిగ్గా 43 ఏళ్ల క్రితం తన సినిమా ‘శంకరాభరణం’ విడుదలైన ఫిబ్రవరి 2వ తేదీనే కె.విశ్వనాథ్ శివైక్యం అవ్వడం విశేషం.