రివ్యూ : థ్రిల్లింగ్ ఎక్సపీరియన్స్ 'మోసగాళ్లు'

రివ్యూ : థ్రిల్లింగ్ ఎక్సపీరియన్స్ 'మోసగాళ్లు'

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
బ్యానర్లు : ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ
నటీనటులు : మంచు విష్ణు, కాజల్‌, సునీల్‌ శెట్టి, నవదీప్‌, నవీన్‌ చంద్ర, రాజా రవీంద్ర తదితరులు
సంగీతం : సామ్‌ సి.ఎస్‌, సినిమాటోగ్రఫీ : షెల్డన్‌ చావ్‌, ఎడిటర్‌ : గౌతమ్‌ రాజు కథ,
నిర్మాత : మంచు విష్ణు
దర్శకత్వం : జెఫ్రీ గీ చిన్
విడుదల తేది : 19.03.2021

మంచు విష్ణు హీరోగా పరిచయం అయిననాటినుండి  సరైన హిట్ పడక సతమతమవుతున్నాడు. ఆయన హీరోగా నటించిన సినిమాలు చాలావరకు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో సినిమాల నుంచి లాంగ్‌ గ్యాప్ తీసుకున్న విష్ణు.. ఓ భారీ స్కామ్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి థ్రిల్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో 'మోసగాళ్లు' అనే పాన్‌ఇండియా సినిమాతో బరిలోకి దిగాడు. రూ.50 కోట్లకు పైగా కేటాయించి హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ మూవీ తెరకెక్కించారు.

ఈ సినిమాకు నిర్మాతగానే కాకుండా రచయితగా కూడా మంచు విష్ణు పనిచేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ మంచి స్పందన వచ్చింది. దీనికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘మోసగాళ్లు’పై భారీ అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘మోసగాళ్లు’ అందుకున్నారా? ఈ సినిమా తో అయినా మంచు విష్ణుని హిట్‌ ట్రాక్‌ ఎక్కించిందా? ఈ ‘మోసగాళ్ల’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం.

కథ:

అర్జున్ (మంచు విష్ణు), అను (కాజల్ అగర్వాల్) ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన కవల అక్కా తమ్ముళ్లు.  వీళ్ళ నాన్న తనికెళ్ళ భరణి. నీతి, నిజాయితీని నమ్ముకొని బ్రతికే ఆయనను ఓ వ్యక్తి మోసం చేయడంతో వీరి కుటుంబం వీధిన పడుతుంది. రాణిగంజ్ లోని ఓ స్లమ్ ఏరియాలో నివాసం ఉంటూ కాలం వెళ్లదీస్తుంటారు. అయితే పెరిగి పెద్దయిన అర్జున్, అను ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వస్తారు. అర్జున్ కాల్ సెంటర్‌లో పని చేస్తూ తన కుటుంబం కోసం బాగా డబ్బు సంపాదించి ఎలాగైనా కోటీశ్వరులం కావాలనే లక్ష్యంతో కసిగా ఉంటాడు. మంచి లాంగ్వేజ్ స్కిల్‌ ఉన్న అర్జున్ కాల్ సెంటర్‌లో జాబ్ చేస్తూ అక్కడి డాటా చోరీ చేస్తూ చిన్న చిన్న మోసాలకు పాల్పడుతుంటాడు. ఇతని స్కిల్ చూసి ఏకంగా ఆ కాల్ సెంటర్ యజమాని విజయ్ (నవదీప్) భారీ స్కామ్ చేద్దామని ఆఫర్ చేయడం, ఆ ఇద్దరు చేతులు కలిపి 70-30 పెర్సెంట్  డీల్ కుదుర్చుకొని అమెరికన్ల నుంచి డాలర్లు కొల్లగొట్టే అతిపెద్ద స్కామ్‌కి తెరలేపుతారు. వీరికి అర్జున్ అక్క అను తోడై ఈ భారీ మోసానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంటూ ఉంటుంది.

ఐఆర్ఎస్ (ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్) పేరు చెప్పి అమెరికన్ల నుంచి డబ్బు గుంజుతూ మొదలైన వీరి కుంభకోణం ఇంతింతై పెద్ద కంపెనీగా ఆవిర్భవిస్తుంది. టాక్స్ పేరుతో అమెరికా ప్రజలను బెదిరిస్తూ 300 మిలియన్ డాలర్స్ (26 వేల కోట్లు) స్కామ్ చేస్తారు. ఈ స్కామ్‌ని ఛేదించే ఆఫీసర్‌గా ఏసీపీ కుమార్ (సునీల్ శెట్టి) రంగంలోకి దిగడం అనేది సినిమాలో ట్విస్ట్. ఈ మోసగాళ్లును పట్టుకోవడానికి ఏసీపీ కుమార్‌ చేసిన ప్రయత్నాలు ఏంటి? ఆయన నుంచి తప్పించుకోవడానికి అను, అర్జున్‌ ఎలాంటి ఎత్తులు వేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా అర్జున్ మోసాన్ని బయటపెట్టి చివరకు అరెస్ట్ చేస్తాడు ఏసీపీ కుమార్.  మరి డబ్బు పవర్‌తో ఈ కేసు నుంచి అర్జున్ బయటపడ్డాడా.. లేదా? అను పరిస్థితి ఏంటి? నిజాయితీగా డబ్బు సంపాదించాలని భావించే అర్జున్ తండ్రికి ఈ భారీ స్కామ్ విషయం తెలిసిందా? తెలిస్తే ఏమన్నాడు? అనేదే ఈ మిగతా కథ. 

నటి నటుల హావభావాలు :

అర్జున్‌ పాత్రలో మంచు విష్ణు ఒదిగిపోయాడు. ఇదివరకెన్నడూ చూడని విష్ణుని ఈ సినిమాలో చూడొచ్చు. కన్నింగ్‌ ఫెలోగా, సీరియస్‌ లుక్‌లో విష్ణు కనిపిస్తాడు. అను పాత్రలో కాజల్‌ మెయిన్ అట్రాక్షన్ కాజల్ నటన అని చెప్పుకోవచ్చు పర్వాలేదనిపించింది. ఆమె పాత్రను ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. ఎసీపీ కుమార్ భాటియాగా సునీశ్‌ శెట్టి నటన బాగుంది సినిమాకు ప్లస్ అయింది. తన అనుభవాన్ని తెరపై చూడొచ్చు. నవీన్‌ చంద్రా, నవదీప్‌ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. ఈ చిత్రానికి వెంకటేష్ వాయిస్ ఓవర్ మరో అట్రాక్షన్.

సాంకేతిక వర్గం పనితీరు:

యదార్థ కథను రాసుకున్న మంచు విష్ణు హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ సహాయంతో ఈ సినిమాను బాగానే ప్రెజెంట్ చేశారని చెప్పుకోవాలి. ఓ సాధారణ మధ్య తరగతి అక్క, తమ్ముడు కలిసి భారీ మోసానికి పాల్పడటం అనేది ఈ సినిమాలో డిఫరెంట్ పాయింట్. వేల కోట్ల రూపాయల స్కామ్ ఎలా చేసారో చూపిస్తూ కథను ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్. దాన్ని తెరపై ఎలా థ్రిల్లింగ్ గా ‌ చూపించారు అనేదే అతని పనితనానికి నిదర్శనం.  

ఓ ప్రీ ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ హైలైట్. ఈ సినిమాకు ప్రధాన బలం సామ్‌ సి.ఎస్‌ నేపథ్య సంగీతం. కొన్ని సన్నివేశాలకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎంతో ప్రాణం పోశాడు. రొటీన్ కథలకు బిన్నంగా ఉన్న ఈ మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కాస్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ పరంగా మాత్రం వారు ఎక్కడా రాజీ పడినట్టు అనిపించదు మంచి రిచ్ గానే సినిమా అంతా కనిపిస్తుంది.

విశ్లేషణ:

ఇక ఫైనల్ గా చూసుకున్నట్టయితే నిజ జీవితంలో జరిగినటువంటి వరల్డ్స్ బిగ్గెస్ట్ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన ఈ “మోసగాళ్లు” పూర్తి స్థాయిలో ఆకట్టుకుందని చెప్పాలి. చిత్ర దర్శకుడు కాస్త తడబడినట్టు అనిపిస్తోంది. సినిమా ఆరంభంలో అను, అర్జున్‌లనేప‌థ్యాన్ని క్లుప్తంగా చూపించేసి, ప్రేక్షకుడిని అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు జెఫ్రీ గీ చిన్.మెయిన్ లీడ్ లలో కనిపించిన విష్ణు మరియు కాజల్ సహా నవదీప్ లు ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటారు.

అలాగే ఈ స్కాం అనే అంశం ఒకింత థ్రిల్ గా జనరల్ ఆడియెన్స్ కు కొత్తగా అనిపించినా సరైన నరేషన్ లేకపోవడం డీటెయిల్స్ సరైన ఎమోషన్స్ వంటివి మిస్సవ్వడం కాస్త  నిరాశ పరుస్తాయి. ఇండియాలో భారీ స్కామ్స్ చేసిన మోసగాళ్ళు కూడా లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ బయట హాయిగా తిరగడం చూపించి ఒకరకంగా ఇండియన్ లా సిస్టంపై సెటైర్ వేశారని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బే సుఖం, డబ్బే కష్టం, ఆ డబ్బే లగ్జరీ, ఆ డబ్బే సమస్య అని చెప్పే కథనే ఈ మోసగాళ్ళు. 

 

Tags :