వామ్మో.. మృణాల్ రెమ్యూనరేషన్ అంతా..!

మృణాల్ ఠాకూర్. సీతారామం అనే ఒక్క సినిమా తన పేరును అన్ని భాషల్లోనూ మారుమ్రోగేలా చేసింది. ఏ ముహూర్తాన మృణాల్ సీతారామంను ఓకే చేసిందో కానీ ఈ సినిమాతో తనకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. నూర్జాహాన్ క్యారెక్టర్‌లో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. ప్రిన్సెస్ నూర్జాహాన్ గా తను అందరి మనసులను గెలుచుకుంది.
వెండితెరపై ఆమె పలికించిన హావభావాలకు స్పెషల్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. కానీ టాలీవుడ్‌లో రెండో ఛాన్స్ అందుకోవడానికి మృణాల్ కి కాస్త టైమ్ పట్టింది. ఈ గ్యాప్ లో నాలుగైదు బాలీవుడ్ సినిమాలకు సైన్ చేసింది. అవి ఇంకా సెట్స్ పైనే ఉన్నాయి. ఇదిలా ఉంటే నాని నటిస్తున్న 30వ సినిమాలో హీరోయిన్‌గా కూడా మృణాల్ ఎంపికైంది.
చాలా మంది హీరోయిన్లను అనుకున్నాక ఆఖరికి ఆ క్యారెక్టర్ కు మృణాల్ అయితేనే సెట్ అవుతుందని కోరి మరీ ఆమెను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు అమ్మడు అడిగిన రెమ్యూనరేషన్ వింటే కళ్లు తిరిగి పడిపోవడం ఖాయం. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు కోట్ల రెమ్యూనరేషన్‌ని ఈ సినిమాకు మృణాల్ అందుకుంటుందని తెలుస్తోంది.
దీన్ని బట్టి టాలీవుడ్ లో మృణాల్ డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తొలి సినిమాకు కేవలం 30 నుంచి 50 లక్షలు వరకు మాత్రమే తీసుకున్న ఈమె, రెండో సినిమా కోసం గ్యాప్ ఎక్కువ తీసుకుని మరీ 3 కోట్లు అందుకుంటుందంటే మాటలా మరి. రీసెంట్‌గా అమ్మడు హైదరాబాద్‌లో ఇల్లు కూడా కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీకి ఈమెనే హీరోయిన్ అనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి.