డిసెంబర్ లో మునుగోడు ఉప ఎన్నిక?

డిసెంబర్ లో మునుగోడు ఉప ఎన్నిక?

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి చేసిన రాజీనామాను శానససభాధిపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆమోద ముద్ర వేయడంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. రాజీనామా ఆమోదించాక ఆరు మాసాల్లో ఉప ఎన్నిక నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ఇది వరకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది డిసెంబర్‌ మాసంలో ఉప ఎన్నిక జరుగుతుందన్న చర్చ సాగుతోంది. రాజీనామాను స్పీకర్‌ ఆమోదించడంతో మూడు ప్రధాన రాజకీయ పక్షాలు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీలు అభ్యర్థుల ఎంపిక, ఎన్నిక ప్రచారం, ఎన్నికల ప్రణాళిక, వ్యూహ ప్రతి వ్యూహాలపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సమన్వయకర్తలను నియమించి ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టగా టీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ ఈ ఉప ఎన్నికపై ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతలతో సహా పార్టీ ముఖ్యులతో సమాలోచనలు జరుపుతూ ప్రణాళిక రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంఘర్షణ యాత్ర మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌కు చేరుకుంది. ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన న్రపసంగించారు. మునుగోడులో విజయం సాధించేది తమ పార్టీ అభ్యర్థేనని ఆయన ఉద్ఘాటించారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాకు ఆమోదం తెలుపడంతో ఇక అన్ని పార్టీలు ఉప ఎన్నిక గోదాలోకి దిగనున్నాయి.

 

Tags :