రివ్యూ : కథ కథనాలు బాగున్న 'నాంది'

రివ్యూ : కథ కథనాలు బాగున్న 'నాంది'

తెలుగు టైమ్స్.నెట్  రేటింగ్: 3/5
బ్యానర్ఎస్వీ2 ఎంటర్‌టైన్మెంట్
నటి నటులు : అల్లరి నరేష్, నవమి గాయక్, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ప్రవీన్‌, ప్రియదర్శి, హరీష్‌ ఉత్తమన్‌,
శ్రీకాంత్‌ అయ్యంగార్‌, దేవీ ప్రసాద్‌, వినయ్‌ వర్మ తదితరులు, సంగీతం : శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ : సిద్
నిర్మాత: సతీష్ వేగేశ్న, దర్శకత్వం: విజయ్ కనకమేడల
విడుదల తేదీ: 19.02.2021

అల్లరి నరేష్ చిత్రాలంటేనే నార్మల్ బడ్జెట్ తో చిత్రాలే తనదైన స్టయిల్లో కామెడీ సినిమాలతో నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టిన చిత్రాలు చాలా వున్నాయి.  అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. అది ఒకప్పటిమాట  కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇటీవల ఆయనతో  తీసిన సినిమాలు చాలా వరకు డిజాస్టర్ట్స్ అయ్యాయి. దీంతో చిత్రాలు కూడా చాలా తగ్గాయి మహేష్ మహర్షి లో సైడ్ పాత్ర కూడా చేసేసాడు ఆ చిత్రం హిట్ అయినా మహేష్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ ‘అల్లరి’హీరో సీరియస్ గా మారి 'నాంది' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో ఈ రోజు తెలుగు  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత ఏడాదే 2020 ఏప్రిల్ కి విడుదల చెయ్యాలనుకున్నారు. ఈ చిత్రం ఫినిష్ అయ్యింది కరోనా కారణం గా  ఇప్పటికి  ఈ సినిమా నుంచి విడుదలైంది. ఇటీవల  రిలీజ్ చేసిన  టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచేశాయి. ఇదేదో డిఫరెంట్ మూవీ అని ముఖ్యంగా 'నాంది'లో అల్లరి నరేశ్ నగ్నంగా నటించడం, సీరియస్ రోల్ పోషించడంతో ప్రతి ఒక్కరిలో ఆసక్తినెలకొంది. ఇక వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న నరేష్ కూడా నాంది పై ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. మరి నరేష్ చేసిన ఈ ప్రయోగం ఫలించి విజయం సాధించాడా? తన కెరీర్‌లో 57వ సినిమాగా రాబోతున్న ‘నాంది’ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:

ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బండి సూర్యప్రకాశ్ అలియాస్‌ సూర్య (అల్లరి నరేష్). తల్లిదండ్రులు అతనికి అంటే ఎనలేని ప్రేమ. తన చదువు కోసం తల్లిదండ్రులు ఎలాంటి సుఖాలను వదులుసుకున్నారో.. ఉద్యోగం వచ్చాక వాటన్నింటినితిరిగి ఇస్తాడు. ఇక కొడుకుకు ఉద్యోగం రావడంతో పెళ్లి చేయాలని నిర్ణయించుకొని అమ్మాయిని కూడా చూస్తారు. అతనికి ఒక అమ్మాయి (నవమి గాయక్) పరిచయం అవడం, అనుకోకుండా ఆమెతోనే పెళ్లి కుదరడం జరుగుతాయి. ఇలా ఉండగా కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న సూర్యప్రకాశ్‌ అనుకోకుండా పౌరహక్కుల నేత రాజగోపాల్‌ హత్యకేసులో అరెస్ట్‌ అవుతాడు. చేయని నేరాన్ని బనాయించి సూర్యని టార్చర్‌ పెడతాడు ఏసీపీ కిషోర్‌ (హరీష్‌ ఉత్తమన్). కేసుల మీద కేసులు పెట్టి ఐదేళ్ల పాటు సూర్యని బయటకు రాకుండా చేస్తాడు. ఈ క్రమంలో జూనియర్ లాయర్ ‌ ఆద్య (వరలక్ష్మీ శరత్‌ కుమార్) ఈ కేసును టేకప్‌ చేసి సూర్యని నిర్థోషిగా బయటకు తీసుకువస్తుంది. బయటకు వచ్చిన సూర్య తనకు జరిగిన అన్యాయంపై ఏరకంగా పోరాడాడు? అసలు పౌరహక్కుల నేతను ఎవరు, ఎందుకు చంపారు?  ఈ కేసులో సూర్యని ఏసీపీ కిషోర్‌ ఎందుకు ఇరికించాడు? జైలులో ఉన్న సూర్యకి,  లాయర్‌ ఆద్య మధ్య ఉన్న సంబంధం ఏంటి? సూర్యకు జరిగిన అన్యాయంపై లాయర్‌ ఆద్య ఏరకంగా పోరాటం చేసిందనేదే మిగతా కథ.

నటి నటుల హావభావాలు:

ఈ సినిమాకి అల్లరి నరేష్ సూర్య ప్రకాష్ పాత్ర లో నటించడం సరైనదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాత్ర మీద జాలి కలగాలి. ఎప్పుడూ నవ్వించే సినిమాల్లో చేసిన అల్లరి నరేష్ తెర మీద ఎవరి కారణంగానో కష్టాలు పడుతుంటే జాలి వేయడం సహజం. కానీ అంతలోనే అతనిలో హీరోయిజాన్ని కూడా చూపించారు. ముఖ్యంగా జైల్లో ఫైటింగు, అలాగే మరో సన్నివేశంలో కత్తి పోట్ల తర్వాత కూడా తప్పించుకోగలగడం, అవి చూసాక జాలి పోయి 'ఓహో..ఇతను కూడా ఆవేశపూరితమ్ గా కనిపించే సినిమా హీరోయే' అనిపిస్తుంది. సూర్య అనే మిడిల్‌ క్లాస్‌ యువకుడి పాత్రలో జీవించేశాడు. ప్రతిసన్నివేశాన్ని ప్రాణంపెట్టి చేశాడు. నవమి గాయక్ చూడడానికి బాగుంది. అంతకు మించి ఆమె పాత్రకి తగినంత నిడివి కానీ, నటించడానికి పెద్ద గా స్కోప్ లేదు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాకి మెయిన్ హీరో అని చెప్పాలి. ఎందుకంటే ఈమె పాత్రే లేకపోతే ఈ కథలో హీరో పడే వేదనకి ముగింపే లేదు. హరీష్ ఉత్తమన్ విలనీ బానే పండించాడు. హీరో తండ్రిగా దేవీ ప్రసాద్ ఉన్నంత టైములోనే నటించిన మంచి గుర్తింపు వచ్చింది.  ప్రియదర్శి, ప్రవీణ్ లు హీరో ఫ్రెండ్స్ గా ఓకే. లాయర్ గా శ్రీకాంత్ అయ్యంగర్ చిన్న పాత్రే అయినా పర్వాలేదనిపించాడు. 

సాంకేతికవర్గం పనితీరు :

తొలి సినిమాతోనే ఓ మంచి సందేశాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించిన దర్శకుడు విజయ్ కనకమేడలను కచ్చితంగా అభినందించాల్సిందే. ఆయన కథ, కథనాలు సినిమాకు ఊపిరిపోశాయి. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 211కు సంబంధించిన  క్లిష్టమైన అంశాన్ని సాధారణ ప్రేక్షకుడి అర్థమయ్యేలా తెరపై చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. పోలీసు ఇన్వెస్టిగేషన్ తీరు, న్యాయవ్యవస్థలోని అంశాలు, న్యాయాన్ని రాజకీయ నాయకులు ఎలా భ్రస్టు పట్టిస్తున్నారనే అంశాలను ఎక్కడా లోపాలు లేకుండా చక్కగా తెరపై చూపించాడు. ఇక శ్రీచరణ్‌ పాకాల తన రీరికార్డింగ్‌ ఇంకా మెరుగు పర్చాలి. పాటలు అంతంత మాత్రంగానే వున్నాయి. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  హైలైట్ అనిపించుకున్నవే కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్నాయి. ఈ చిత్రంలో అటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపించలేదు. "ఆవేశం సమస్యని సృష్టిస్తుంది.. ఆలోచన దాన్నిపరిష్కరిస్తుంది’, ‘దేవుడు.. మంటలు ఆర్పడానికి నీళ్లు ఇస్తే.. గుండె మంటల్ని ఆర్పడానికి కనీళ్లు ఇచ్చాడు" వంటి సంభాషణలు ‌ గుండెల్ని హత్తుకుంటాయి. ప్రీక్లైమాక్స్‌లోని కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. సిధ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ చోటా కే ప్రసాద్ పనితీరు చాలా బాగుంది. ఎక్కడా సాగతీత లేకుండా సినిమాను చకచకా నడించాడు. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. 

విశ్లేషణ:

ఈ సినిమా ముఖ్యోద్దేశం. అన్యాయంగా జైళ్లలో మగ్గుతున్న రిమాండ్ ఖైదీలు విడులయ్యాక తమను కేసుల్లో ఇరికించిన వారిపై పెట్టే రివర్స్ కేస్ కి సంబంధించిన సెక్షన్ అన్నమాట. దీనిని సక్రమంగా వాడుకోకపోవడం మూలంగానే జైళ్లల్లో అన్యాయంగా పెట్టబడ్డ ఖైదీలున్నారనే సామాజిక అంశం ఎత్తుకోవడం బాగుంది. పోలీసు ఇన్వెస్టిగేషన్ తీరు, న్యాయవ్యవస్థలోని అంశాలు, న్యాయాన్ని రాజకీయ నాయకులు ఎలా భ్రస్టు పట్టిస్తున్నారనే అంశాలను ఎక్కడా లోపాలు లేకుండా చక్కగా తెరపై చూపించాడు. అందుకు దర్శక నిర్మాతలను అభినందించాలి. అయితే ఇటువంటి కథలను ఎత్తుకున్నప్పుడు ఉత్కంఠభరితంగా ప్రజంటేషన్ బాగుండాలి. చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ఓ మంచి సందేశాత్మక చిత్రం వచ్చిందని చెప్పొచ్చు. 

 

Tags :