ఆయన వర్క్ ఫ్రం హోమ్ ముఖ్యమంత్రి..

ఆయన వర్క్ ఫ్రం హోమ్ ముఖ్యమంత్రి..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇల్లు కదలరని, ఆయన వర్క్‌ ఫ్రం హోమ్‌ ముఖ్యమంత్రి అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. జల విలయం వల్ల నష్టపోయిన చిత్తూరు, కడప జిల్లాలో పర్యటించేందుకు నాదెండ్ల మనోహర్‌ తిరుపతికి వచ్చారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నుంచి పలకరించే దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. ఏ మాత్రం పరిపాలన దక్షత లేని వ్యక్తిగా జగన్‌ తయారయ్యారని వ్యాఖ్యానించారు. ప్రజలు కష్టాలు పడుతుంటే సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే చేసి జిల్లాకు రూ.2 కోట్లు సాయం ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. బాధ్యత కలిగిన ఒక రాజకీయ పార్టీగా ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి అండగా నిలిచేందుకు తాము వచ్చామన్నారు.

జనసేన పార్టీ తరపున వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, నిత్యావసర సరుకుల పంపిణీ వంటి కార్యక్రమాల్ని చేపట్టామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు విడతల పర్యటనలు జరపాలని అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారని తెలిపారు. తొలి విడతగా తాను పర్యటించి వరద నష్టంపై అంచనాలు రూపొందిస్తామని అన్నారు. రెండో విడతలో పవన్‌  పర్యటిస్తారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి కుటుంబాన్ని ఆదుకొనే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.

 

Tags :