టీడీపీ అధికారంలోకి వచ్చాక.. మళ్లీ ఎన్టీఆర్ పేరు

టీడీపీ అధికారంలోకి వచ్చాక.. మళ్లీ ఎన్టీఆర్ పేరు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆరోగ్య విశ్వవిద్యాలయానికి మళ్లీ ఎన్టీఆర్‌ పేరు పెడతామని టీడీపీ ప్రధాన కార్యదర్వి నారా లోకేశ్‌ అన్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మారుస్తూ సీఎం జగన్‌ యావత్‌ తెలుగుజాతిని బాధపెట్టే నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ పేరు మార్చడాన్ని వైసీపీ నేతలు ఇష్టపడటం లేదన్నారు. ఏ ఆత్మతో మాట్లాడి జగన్‌ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారో ఆ దేవుడికే తెలియాలన్నారు.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జిల్లాకో వైద్య కళాశాల తెచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా లోకేశ్‌ గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ బిల్లుల్ని అడ్డగోలుగా ఆమోదిస్తోందని ధ్వజమెత్తారు. విపక్షాలకు భయపడి అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులే పెట్టారని ఆక్షేపించారు. ఎన్టీఆర్‌  పేరు ఎందుకు తొలగించారో ఈ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు.  ఎన్టీఆర్‌పై అంత గౌరవమే ఉంటే ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎందుకు పేరు మార్చారని నిలదీశారు. హెల్త్‌ వర్సిటీకి చెందిన రూ.400 కోట్ల నిధుల్ని జగన్‌ కొట్టేశారని ఆరోపించారు.

సీఎం జగన్‌ అయ్యాక రాష్ట్రంలో మూడు ముక్కలాట మొదలైందన్నారు. మూడు రాజధానుల పేరిట అడ్డగోలుగా వ్యవహరిస్తూ పేర్లు మార్చుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని పేర్లూ మార్చిస్తే ఏమవుతుంది? రాష్ట్రం పేరు కూడా మారిస్తే ఏమవుతుంది? అని ప్రశ్నించారు. కేంద్రంలో మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఢల్లీిలో ఉన్న విమానాశ్రయానికి ఇందిరా గాంధీ పేరు తొలగించలేదని, హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ పేరు మార్చలేదన్న విషయాన్ని జగన్‌ గుర్తు పెట్టుకోవాలని సూచించారు.  శాసన మండలిలో టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలంతా ఎన్టీఆర్‌ పేరు మార్పును ముక్తకంఠంతో వ్యతిరేకించారన్నారు. ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మండలిలో ఆందోళన చేసినట్లు తెలిపారు.

 

Tags :