మోహన్‌బాబుగారు! మీరు షిర్డీ గురించి అలా అనడం బాగోలేదు!! : భక్తుల ఆగ్రహం

తెలుగు సినిమా విలక్షణ నటుడు, నిర్మాత, శ్రీవిద్యానికేతన్ సంస్థల అధినేత మంచు మోహన్‌బాబు సాయిబాబా కి పరమ భక్తుడు. ఆయన మాటల్లోనూ, సినిమాల్లోనూ ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయన వ్యక్తం చేస్తుంటారు. అదే భక్తితో ఇప్పుడాయన చంద్రగిరి మండలం రంగం పేటలో దక్షిణాదిలోనే అతి పెద్దదైన సాయి బాబా గుడిని నిర్మించారు. కానీ.. అక్కడి మీడియాతో మాట్లాడుతూ మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. నెటిజన్స్ కామెంట్స్ రూపంలో నిరసన.. నిన్న మంగళవారం ఆ గుడికి సంబంధించి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. మంచు కుటుంబ సభ్యులైన మోహన్ బాబు దంపతులు, విష్ణు,మనోజ్, లక్ష్మీ ప్రసన్న, పిల్లలు అందరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సాయి బాబా గుడి దక్షిణాదిలోనే అతి పెద్దదని మంచు మోహన్‌బాబు తెలియజేశారు.
అక్కడి వరకు బాగానే ఉంది కానీ.. అసలు మీడియాతో మోహన్ బాబు ఏమన్నారంటే.. ‘‘ఇదొక అద్భుతం. నా దృష్టిలో ఇక భక్తులు షిరిడీ సాయినాథుని ఆలయానికి వెళ్లనక్కర్లేదు. ఈ గుడి కట్టాలనుకున్నప్పుడు విష్ణు బాబు ఒక మాట అన్నాడు. "డాడీ! గుడి కడితే వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చిన భక్తులందరూ ఈ గుడికి రావాలి. అలా కడితే కట్టండి లేకపోతే లేదు" అన్నాడు. అలాగే కట్టానని అనుకుంటున్నాను. మహాద్భుతంగా కట్టాం. రుషికేష్ నుంచి దాదాపు 110 సంవత్సరాలకు పైనున్న యోగి సహా యోగులు, రుషీశ్వరులు నుంచి చెక్కలు, ఆయన లిపితో రాసిన కొన్ని అమూల్యమైన మూలికలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇదంతా నా ఒక్కడి కోసమే కాదు.. విద్యాలయం, పక్క గ్రామాలు, రెండు తెలుగు రాష్ట్రాలు, యావత్ భారతదేశం నెంబర్ వన్‌గా ఉండాలని, అందరూ క్షేమంగా ఉండాలని ఈరోజు ప్రారంభించాం’’ అన్నారు.
ఈ స్పీచ్‌లో మోహన్ బాబు ఇకపై భక్తులు షిరిడీకి వెళ్లనవసరం లేదని చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ అసంతృప్తిని వక్తం చేస్తున్నారు. ‘‘బాబాగారి ఆలయం మీరు నిర్మించడం చాలా ఆనందదాయకం. తిరుపతి వచ్చినవారు అందరూ మీరు నిర్మించిన ఆలయానికి రావాలనుకోవడం కూడా అద్భుతంగావుంది. కానీ...షిరిడీ వెళ్ళనవసరం లేదు అని చెప్పడం బాగోలేదు.అది బాబా నడయాడిన పవిత్ర స్థలం, జీవించిన అమృతభూమి, దాని గొప్పదనం దానిదే" అని అంటున్నారు.