తొమ్మిదేళ్ల కల.. నెరవేరిన వేళ

తొమ్మిదేళ్ల కల.. నెరవేరిన వేళ

తెలంగాణ ఉద్యసారథి కేసీఆర్‌తో తన కుమారైకు పేరు పెట్టించాలనే ఆయన అభిమాని, ఉద్యమకారుడు సురేశ్‌ కల ఎట్టకేలకు నెరవేరింది. గత తొమ్మిదేళ్లుగా సీఎంను కలిసే అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆయన కోరిక తీరింది. విషయం తెలిసిన కేసీఆర్‌ సురేశ్‌ను కుటుంబాన్ని తమ ఇంటికి ఆహ్వానించి నామకరణం చేసి పట్టువస్త్రాలు బహుకరించి ఆ దంపతుల కల నెరవేర్చాడు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం, నందిగామ గ్రామానికి చెందిన సురేశ్‌, అనిత దంతపులు 2013లో ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు నాటి ఉద్యమసారథి కేసీఆర్‌తో నామకరణం చేయించాలని నిర్ణయించుకున్నారు. 

అమ్మాయికి ఇప్పటిదాకా పెరుపెట్టకుండా చిట్టీ తల్లి, స్వీటీ అని పిలుస్తూ వచ్చారు. చిట్టీ పేరుతో పాప స్థానిక ప్రాథమిక పాఠశాలలో అయిదోతరగతి చదువుతోంది. ఆధార్‌ కార్డు కూడా చిట్టీ పేరుపైనే ఉంది. అయితే స్కూలులో స్థానికంగా పాపను అందరూ కేసీఆర్‌ అని పిలుస్తారు. ఈ విషయం ఎమ్మెల్సీ మధుసూదనాచారి ద్వారా తెలుసుకున్న సీఎం వారిని తమ ఇంటికి తీసుకురావాలని సూచించారు. దీంతో ఆ కుటుంబాన్ని ఎమ్మెల్సీ ప్రగతిభవన్‌ తీసుకొచ్చారు. సీఎం, ఆయన సతీమణి శోభలు తమ ఇంట్లోకి తీసుకెళ్లి సురేశ్‌ దంపతులను దీవించి వారి పాపకు మహతి అని నామకరణం చేసి ఆశీర్వదించారు. సీఎం దంపతులు వారితో కలిసి భోజనం చేసి, పట్టువస్త్రాలు పెట్టారు. మహతి చదువుకోసం ఆర్థిక సాయాన్ని అందించారు. ఆమె ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సీఎం దంపతుల ఆదరణ, దీవెనలను జీవితాంతం గుర్తుంచుకుంటామని సురేశ్‌ దంపతులు ధన్యవాదాలు తెలిపారు.

 

Tags :