నోబెల్ బహుమతి వేలం.. గత రికార్డును బద్దలుకొట్టింది

యుద్ధం కారణంగా శరణార్థులైన ఉక్రెయిన్ పిల్లలను ఆదుకునేందుకు రష్యన్ జర్నలిస్టు డిమిత్రి మురటోవ్ ముందుకొచ్చారు. గత ఏడాది తాను పొందిన నోబెల్ శాంతి బహుమతి మెడల్‌ను వేలానికి పెట్టగా 10.35 కోట్ల డాలర్లు (దాదాపు రూ.808 కోట్లు) పలికింది. గత రికార్డును బద్దలుకొట్టింది. 1962లో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ 2014లో తన మెడల్‌ను వేలానికి పెట్టగా, అప్పట్లో 47,6 లక్షల డాలర్లు వచ్చాయి. కాగా, వేలంలో వచ్చిన డబ్బును రష్యన్ జర్నలిస్టు డిమిత్రి మురటోవ్ ఉక్రెయిన్ పిల్లల సంక్షేమానికి వినియోగించనున్నారు. శరణార్థులైన పిల్లలకు సేవలు అందిస్తున్న యూనిసెఫ్‌కు ఈ మొత్తం నేరుగా చేరుతుంది. ప్రముఖ రష్యన్ దినపత్రిక నోయ గజెటాకు డిమిత్రి మురటోవ్ సంపాదకుడు. జర్నలిజంలో ఆయన చేసిన విశేష కృషికి గత ఏడాది నోబెల్ బహుమతి లభించింది. మురటోవ్ మొదటి నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూనే ఉన్నారు.