బోస్టన్ లో ఘనంగా ప్రారంభమైన ఎన్నారై టీడిపి మహానాడు

బోస్టన్ లో ఘనంగా ప్రారంభమైన ఎన్నారై టీడిపి మహానాడు

హాజరైన టీడిపి ప్రముఖులు...ఆకట్టుకున్న చంద్రబాబు ప్రసంగం

అమెరికాలోని బోస్టన్‌ నగరంలో మే 20, 21 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే తెలుగుదేశం మహానాడు కార్యక్రమాల్లో మొదటిరోజు ప్రముఖుల ప్రసంగాలతో ఘనంగా సాగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పార్టీ సీనియర్‌ నేతలు ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, వై.వి.ప్రభాకర చౌదరి, పార్టీ నేతలు గౌతు శిరీష, నన్నారి నర్సిరెడ్డి, మన్నవ సుబ్బారావు తదితరులు హాజరయ్యారు.

ఆకట్టుకున్న చంద్రబాబు ప్రసంగం

ఈ వేడుకకు స్వాగతోపన్యాసం  చేసి అధినేత చంద్రబాబు తన సందేశాన్ని అందించి, అక్కడి ప్రవాస ఆంధ్రుల్లో కొత్త ఉత్సాహం నింపారు.  జగన్‌ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిన వైనాన్ని వివరిస్తూనే ఇటీవల తాను చేపట్టిన జిల్లాల పర్యటన (ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం మొదలుకుని కడప వరకూ) ఏ విధంగా సాగిందన్నది వివరిస్తూనే, ప్రజల్లో వచ్చిన మార్పు, వారిలో వెల్లువెత్తిన చైతన్యం అన్నవి తనను ఆలోచింపజేశాయని అన్నారు. అదేవిధంగా తాము చేపట్టిన నిరసన కార్యక్రమాలకు కూడా మంచి స్పందన వస్తున్నదని చెప్పారు. బాదుడే బాదుడు పేరిట నిర్వహించిన కార్యక్రమాన్ని విశేష ఆదరణ వచ్చిందని, ప్రజలు ఇప్పుడిప్పుడే పాలన సంబంధిత వైఫల్యాలను గుర్తించి, తిరుగుబాటు చేస్తున్నారని కూడా వివరించారు. చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం పార్టీని పునరుత్తేజం చేయడానికే అధిక ప్రాధాన్యం ఇస్తూ సాగింది. 2024లో మళ్లీ టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర పునర్నిర్మాణం జరపాల్సి ఉందని నొక్కి చెప్పారు. తెలుగు దేశం అధికారంలోకి రావాలని ప్రజలు ఏకపక్షంగా కోరుకుంటున్నారని, ప్రవాసులు కూడా టీడిపి విజయానికి కృషి చేయాలని కోరారు. 2,200 మందితో బోస్టన్‌ లో మహానాడు నిర్వహించడం, పార్టీకి, తెలుగు వారికి కూడా గర్వకారణమని చంద్రబాబు అభినందించారు.  తెలుగు దేశం ఆవిర్భావం తరువాతనే తెలుగు ప్రజల జీవితాల్లో పెను మార్పులు వచ్చాయని చంద్రబాబు అన్నారు. ఈ రోజు లక్షల మంది ఉన్నత చదువులతో ఐటి రంగంలో స్థిరపడడానికి నాడు తెలుగు దేశం ప్రభుత్వ తీసుకున్న పాలసీలే కారణం అని తెలిపారు. సమావేశంలో రాష్ట్రంలో పరిస్థితులు, ప్రజల వెతలు, వ్యవస్థల విధ్వంసంపై ఎన్‌ఆర్‌ఐలతో చంద్రబాబు మాట్లాడారు. జగన్‌ పాలనతో రాష్ట్రం కోలుకోలేనంతగా నష్టపోయిందని చంద్రబాబు అన్నారు.

పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులను జగన్‌ ఎలా ధ్వంసం చేశారో ప్రజలు చూశారని అన్నారు. తెలంగాణలో కొన్ని కులాలను బిసిల జాబితా నుంచి తొలగిస్తే నోరెత్తని ఆర్‌. కృష్ణయ్య లాంటి వారికి, తనతో పాటు కేసుల్లో ఉన్నవారికి జగన్‌ రాజ్యసభ టికెట్లు ఇచ్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. తాను ప్రకటించినట్లు వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తానని చంద్రబాబు మరో సారి నొక్కి చెప్పారు.  2024లో టిడిపిని అధికారంలోకి తీసుకురావడంలో ఎన్‌ఆర్‌ఐ లు తమ వంతు పాత్ర పోషించాలని చంద్రబాబు కోరారు.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావటం కోసం ప్రవాస తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్రంగా కృషి చేయాలన్నారు. ప్రవాసుల సహకారం ఎంతో అవసరం అని పేర్కొన్నారు. ఎన్నారైల సహకారంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తపరిచారు. ఎన్నికల సమయంలో ప్రవాసాంధ్రులు తమ  ప్రాంతాలకు వచ్చి తెలుగుదేశం తిరిగి అధికారంలోకి రావడం కోసం కృషి చేయాలని బుచ్చయ్యచౌదరి పిలుపు ఇచ్చారు. పార్టీ సీనియర్‌ నేతలు ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, వై.వి.ప్రభాకర చౌదరి, పార్టీ నేతలు గౌతు శిరీష, నన్నారి నర్సిరెడ్డి, మన్నవ సుబ్బారావు తదితరులు కూడా ప్రసంగించారు. ఎన్నారై టీడీపీ కన్వీనర్‌ కోమటి జయరాం అందరికీ తొలుత స్వాగతం పలికారు. అమెరికా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో టీడీపీ అభిమానులు కార్యకర్తలు ఈ మహానాడుకు తరలి వచ్చారు.

 ఈ సందర్భంగా 7 తీర్మానాలను సభ ఆమోదించింది. తర్వాత పలువురు వక్తలు ప్రసంగించారు. యువతను ఆకర్షించడం, సీనియర్‌ నేతలకు మద్దతుగా ఉండడం, సోషల్‌ మీడియాలో మరింత పుంజుకోవడం, ఏపీలోని వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై చర్చించారు.  జూమ్‌ ద్వారా టైగర్‌ చింతమనేని ప్రభాకర్‌, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.

యువతకు ఈ కార్యక్రమంలో వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఇటీవల కాలంలో పార్టీలో వచ్చిన మార్పులు, యువత భావనలు వంటి అంశాలపై చర్చించారు. అదేవిధంగా పలువురు మహిళా నాయకులు పార్టీలో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యం, భవిష్యత్తులో వ్యవహరించాల్సిన తీరు, ప్రణాళికలపై చర్చించారు. అనంతరం ప్రస్తుత ఏపీ సర్కారు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీనియర్‌ నాయకులు చర్చించారు. బోస్టన్‌ మహానాడులో పంచ్‌ జుగల్బందీ అనే వెరైటీ పోటీ నిర్వహించారు. దీనిలో సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

 

Tags :