ఎన్నారైల దృష్టి హైదరాబాద్ పైనే...

అమెరికాలోనూ ఇతర దేశాల్లోనూ ఉన్న ఎన్నారైలు తమ స్వరాష్ట్రంలోనూ, ఇతర చోట్ల రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. కాకపోతే చాలామంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తిని చూపిస్తు న్నారు. దేశంలో మరే నగరంలో లేనంతగా ఇక్కడి రియల్టీకి ఉన్న డిమాండ్‌ను గమనించి ఎన్నారైలు తమ పెట్టుబడులను ఇక్కడనే పెడుతున్నారు. హౌజింగ్‌లో ఎన్నారైల ఇష్టాయిష్టాలను తెలియజేస్తూ వ్యాపార-పారిశ్రామిక సంఘం సీఐఐ, ప్రముఖ రియల్ ఎస్టేట్ సేవల సంస్థ అనరాక్ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం ఎన్నారైలు దేశంలో ఆస్తి కొనుగోలుకు హైదరాబాద్‌నే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలింది. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ నిలిచాయి. సర్వేలో పాల్గొన్న 60 శాతం ఎన్నారైలు హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరుల్లోనే ఆస్తి కొనుగోలుకు మక్కువ ప్రదర్శించారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో ఇల్లుపట్ల 22 శాతం మంది ఆసక్తి కనబర్చారు. 20 శాతం ఎన్సీఆర్పై, 18 శాతం బెంగళూరుపై ఇష్టం చూపారు. కాగా, ఈ సర్వేలో 5,500 మంది ఎన్నారైలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వీరిలో 7 శాతం మంది అమెరికా, కెనడా, గల్ఫ్, ఐరోపా, ఇతర ఆసియా దేశాల్లో ఉన్నారు. ఇదిలావుంటే కరోనాకు ముందు జరిపిన సర్వేలో టాప్-3 నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్ ఉన్నట్టు ఈ సందర్భంగా సీఐఐ, అనరాక్ తెలిపాయి. దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో నెలకొన్న ఉత్సాహానికితోడు డాలర్‌తో పోల్చితే పడిపోతున్న రూపాయి మారకం విలువ కూడా భారత్‌లో ఎన్నారైల పెట్టుబడులకు ఊతమిస్తున్నదని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.