షార్లెట్ నగరంలో తారకరామునికి ఆత్మీయ నివాళి

షార్లెట్ నగరంలో తారకరామునికి ఆత్మీయ నివాళి
 

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన అన్న నందమూరి తారక రామారావు  27వ వర్ధంతి కార్యక్రమాన్ని అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను నెమరువేసుకుంటూ షార్లెట్ ఎన్నారై టీడీపీ బలాన్ని చాటారు. పురుషోత్తం చౌదరి గుదే, ఠాగూర్ మల్లినేని, సచ్చింద్ర ఆవులపాటి, వెంకట్ సూర్యదేవర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా మహిళలు ధూప దీపాలు వెలిగించగా, ఆహ్వానితులు అందరూ పూలతో ఆత్మీయ నివాళులు అర్పించారు.

భారత కాలమానం ప్రకారం జనవరి 18, బుధవారం ఉదయం 6 గంటలకు సుమారు 150 మందికి పైగా షార్లెట్ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్రహే, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఠాగూర్ మల్లినేని తయారుచేసిన వీడియోని ప్రదర్శించారు. ఎన్టీఆర్ సినిమా జీవితం, రాజకీయ అరంగేట్రం, తెలుగుదేశం పార్టీ స్థాపన వంటి పలు విషయాలను గుర్తుకు తెచ్చిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంది. తారకరామునికి ఆత్మీయ నివాళులు అర్పించిన ఈ కార్యక్రమానికి వెంకట్ సూర్యదేవర వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఎన్టీఆర్ ఫోటోలు, తెలుగుదేశం పార్టీ జండాలు, బ్యానర్లతో వేదికను అలంకరించడంతో అందరూ ఆహ్లాదకరంగా ఫోటోలు దిగారు.

NRI TDP నాయకులు పురుషోత్తం చౌదరి గుదే మాట్లాడుతూ.. ఈరోజు మనందరం సమావేశమవ్వడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత, పద్మశ్రీ, అన్న నందమూరి తారక రామారావు ని స్మరించుకుంటూ, తన అడుగుజాడల్లో నడవాలని కోరారు. అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో నడిపేందుకు నారా చంద్రబాబు నాయుడి సారధ్యంలోని తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చేలా అందరూ కృషి చేయాలన్నారు.

ఠాగూర్ మల్లినేని మాట్లాడుతూ.. వారాంతం కాకపోయినప్పటికీ, తమ బిజీ షెడ్యూల్లో కూడా దాదాపు 150 మందికి పైగా పెద్దలు, మహిళలు, పిల్లలు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నటసార్వభౌమ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం ప్రతి ఒక్క ఎన్నారై తమవంతుగా కొంత సమయం కేటాయించాలనీ కోరారు. సోషల్ మీడియా, టెక్నాలజీ, ఆర్ధిక వనరులు, ఎలక్షన్స్, ఇలా ఎవరు చేయగలిగిన సహాయం వారు చేస్తే బాగుంటుందని అన్నారు. దీంతో అందరూ చప్పట్లతో తమ సంఘీభావాన్ని తెలియజేశారు.

రాయలసీమ నుంచి అనంతపూర్ మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి మరియు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, పెనమలూరు మాజీ శాసనసభ్యులు బోడే ప్రసాద్ ఆన్లైన్లో జూమ్ మీటింగ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సందేశాలు వినిపించారు.

బోడే ప్రసాద్ మాట్లాడుతూ.. అమెరికా కాలమానం రీత్యా ప్రపంచంలోనే అందరికంటే ముందు మీరే అన్నగారి 27వ వర్ధంతిని నిర్వహిస్తున్నారని, ఇలాంటి కార్యక్రమంలో నేను పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇదే ఉత్సాహంతో వచ్చే ఎన్నికలలో కూడా తమ శక్తి మేర తోడ్పడి మన పసుకు పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు.

 

Click here for Event Gallery

 

Tags :