బోస్టన్‌లో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

బోస్టన్‌లో శత వసంతాల సార్వభౌమునికి నిత్య నీరాజనం కార్యక్రమం ఘనంగా జరిగింది. బోళ్ల గారి ప్రోత్సాహంతో, బోస్టన్ ప్రెసిడెంట్ అంకినీడు చౌదరి రావి, న్యూ హాంప్షైర్ ప్రెసిడెంట్ అనిల్ పొట్లూరి చొరవతో జరిగిన ఈ వేడుకలు అభిమానుల సందడి మధ్య విజయవంతంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా గౌతు శిరీష, గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గౌతు శిరీష మాట్లాడుతూ.. ‘‘బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. ఆయన ద్వారానే బడుగు, బలహీనవర్గాలకు నిజమైన రాజ్యాధికారం లభించింది. పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 9 శాతం రిజర్వేషన్లను కల్పించారు. మహిళల కోసం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 20శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుంది’’ అని అన్నారు.
మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ... ‘‘రాజకీయ, సినీరంగంపైనే కాదు.. యావత్ తెలుగు నేలపై ఎన్టీఆర్ పేరు చెరగని సంతకం. సినీ ప్రపంచంలో ఒక అరుదైన సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేశారు. హీరో అంటే అందరికీ ఎలా ఆదర్శంగా ఉండాలో భవిష్యత్ తరాలకు తెలియజెప్పిన ఘనత ఆయన సొంతమన్నారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేక్‌ను కట్ చేశారు. అనంతరం ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితంపై క్విజ్ పోటీలు, ఎన్టీఆర్ వేషధారణ పోటీలు నిర్వహించారు. వీటితో పాటు మా ఆ ‘‘నంద’’ తారకం నృత్య నాటక సంగీత కళాంజలి ఆధ్వర్యంలో కూచిపూడి, భరతనాట్యం వంటి సాంప్రదాయ నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పాత రోజుల ఫ్యాషన్ వాక్, ఎన్టీఆర్ పాటలు, డ్యాన్సులతో సందడి చేశారు. ఆయా కార్యక్రమాలు ప్రసాంధ్రులను బాగా ఆకట్టుకున్నాయి. అనంతరం ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ గారి అమృత భోజనం అందరూ ఆరగించారు.