మే 28న వర్జీనియాలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

మే 28న వర్జీనియాలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

విశ్వ విఖ్యాత నవరస నటనా సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను భారీగా నిర్వహించడానికి అమెరికాలో ఉన్న ఎన్టీఆర్‌ అభిమానులు  ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమం వివరాలను తెలియజేస్తున్నారు. వర్జీనియాలో జరగనున్న  అన్న గారి శతజయంతి ఉత్సవాలకు సకుటుంబ సమేతముగా రావాల్సిందిగా శ్రీనివాస్‌ ఉయ్యూరు కోరుతున్నారు. ఈ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. 

అన్న ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో ప్రతి తెలుగు అభిమాని పాల్గొని ఎన్టీఆర్‌పై అభిమానాన్ని చాటాలని, ఈ సందర్భంగా నిర్వహించే పలు కార్యక్రమాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

నందమూరి తారక రామారావు శతజయంతి శుభ సందర్భంగా అన్నగారి అభిమానులు మరియు శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు నిర్వహించు శ్రీనివాస కళ్యాణంలో అందరూ పాల్గొనాలని కూడా శ్రీనివాస్‌ ఉయ్యూరు కోరారు. ఈ వేడుకలో భాగంగా సకల భక్త జనుల సమక్షములో కనుల పండుగగా భక్తులను అనుగ్రహించుటకు అన్నగారి అభిమానులు ఏర్పరిచిన ఈ కల్యాణ వేడుకను కనులార చూచుటకు భక్తులు మరియు అభిమానులు తమ బంధు మిత్రులతో కలసి సకుటుంబ సమేతంగా విచ్చేసి  స్వామి వారి అనుగ్రహానికి కృపాపాత్రులు కావలిసిందిగా ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉత్సవాలను పురస్కరించుకుని రక్తదానశిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. మే 28వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. అందరూ పాల్గొని రక్తాన్ని దానం చేయాల్సిందిగా నిర్వాహకులు కోరారు.

ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకుని పలు ఆటల పోటీలను కూడా నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రికెట్‌ టోర్నమెంట్‌లో గెలిచినవారికి 3000డాలర్ల ప్రైజ్‌మనీని కూడా బహుకరించనున్నారు. రన్నర్‌గా వచ్చిన టీమ్‌కు 1000 డాలర్లు ప్రైజ్‌మనీ ఇస్తున్నారు.

ఆటలపోటీల్లో భాగంగా క్యారమ్‌ టోర్నమెంట్‌ను కూడా నిర్వహిస్తున్నారు. తెలుగువాళ్ళకు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. గెలిచినవారికి 1000డాలర్ల ప్రైజ్‌మనీని కూడా బహుకరించనున్నారు. రన్నర్‌గా వచ్చిన టీమ్‌కు 500 డాలర్లు ప్రైజ్‌మనీ ఇస్తున్నారు.

వాలీబాల్‌ టోర్నమెంట్‌ను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇందులో గెలిచినవారికి 2000డాలర్ల ప్రైజ్‌మనీని కూడా బహుకరించనున్నారు. రన్నర్‌గా వచ్చిన టీమ్‌కు 1000 డాలర్లు  ప్రైజ్‌మనీ ఇస్తున్నారు.

ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ శతజయంతి వేడుకల్లో ఫస్ట్‌ ఎయిడ్‌, సిపిఆర్‌ ట్రైనింగ్‌ను ఇప్పిస్తున్నారు. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యవసర సమయంలో ఇవ్వాల్సిన వైద్యచికిత్సను తెలుసుకోవాల్సిందిగా వారు కోరారు.

మే 28 ,2022 శనివారం ఉదయం 7 :00 గం నుండి రాత్రి 11 : 00 గం వరకు

వేదిక : MICHAEL & SON SPORTSPLEX AT DULLES,
21610 Atlantic Blvd, Sterling, VA 20166
www.ntrfansusa.com

 

 

Tags :