రివ్యూ: నేటి ప్రేక్షకుడికి నచ్చని 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2/5
నిర్మాణ సంస్థలు : అమ్ము క్రియేషన్స్, కల్పనా చిత్ర
నటీనటులు: సోహెల్, మృణాళిని రవి, రాజేంద్ర ప్రసాద్, మీనా, వరుణ్ సందేశ్, రష్మీ, సునీల్, అలీ,
అజయ్ ఘోష్, సప్తగిరి, ప్రవీణ్, పృధ్వి, రాజా రవీంద్ర, కృష్ణ భగవాన్, వైవా హర్ష, హేమ, సన, సురేఖావాణి తదితరులు నటించారు.
సంగీత దర్శకులు: ఎస్ వి కృష్ణా రెడ్డి, ఎడిటర్: ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ: సి.రామ్ ప్రసాద్, నిర్మాతలు: కోనేరు కల్పన
దర్శకుడు : ఎస్ వి కృష్ణా రెడ్డి
విడుదల తేదీ : 03.03.2023
తొమ్మిది ఏళ్ళ క్రితం వచ్చిన యమలీల 2 తరువాత సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో బిగ్ బాస్ ఫేం సోహెల్ బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాళిని హీరోహీరోయిన్‌లుగా వచ్చిన చిత్రం ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు. రాజేంద్ర ప్రసాద్, మీనా, వరుణ్ సందేశ్, సునీల్, అలీ వంటి భారీ తారాగణం తో కె అచ్చిరెడ్డి సమర్పణలో, నిర్మాత సి. కళ్యాణ్ సతీమణి కోనేరు కల్పన నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఎస్వీ కృష్ణారెడ్డి మార్క్ తో గత చిత్రాల వలె ఈ చిత్రం ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోచూద్దాం.
కథ:
విజయ్(సోహైల్)కి పెద్ద డైరెక్టర్ అవ్వాలని కల ఉంటుంది. అయితే రెండు సినిమాలు తీసినా, అవి రెండూ ప్లాపులు కావడంతో ఆయనకు మరో సినిమా అవకాశం దొరకడం గగనంగా మారింది. ఇక చేసేది ఏమిలేక ఇంట్లో తండ్రి పోరు భరించలేక ఆయన చేసే కొండపల్లి బొమ్మలను అమ్మడం కోసం ఒక స్కెచ్ వేస్తాడు. ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో బొమ్మల స్టాల్ పెట్టిన సమయంలో హాసిని ( మృణాళిని రవి) అతని మొదటి చూపులోనే చూసి ప్రేమిస్తుంది. ఆర్గానిక్ వెంకట రమణ (రాజేంద్రప్రసాద్) కూతురు హాసిని, కూతుర్ని ఆర్గానిక్ వెంకట రమణ ఎంతో అపురూపంగా పెంచుకుంటాడు. ఆమె విషయంలో నేటి జనరేషన్ ల అడ్వాన్స్ గా ఉండకూడదని ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. అయితే... ఆర్గానిక్ వెంకట రమణ భయ పడినట్లుగానే.. హాసిని విజయ్ తో ప్రేమలో పడుతుంది. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విజయ్ – హాసిని ప్రేమ కథ ఎలా సాగింది ?, ఆర్గానిక్ వెంకట రమణ వీరి ప్రేమను అంగీకరించాడా ? లేదా ? అనేది మిగతా సినిమా కథ.
నటి నటుల హావభావాలు :
హీరోగా నటించిన బిగ్‌బాస్ ఫేం సోహెల్ తన పాత్ర మేరకు బాగా నటించాడు. తన ఈజ్ యాక్టింగ్ తో అండ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో సోహెల్ ఆకట్టుకున్నాడు. విజయ్ పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోయిన్ గా నటించిన మృణాళిని రవి తన లుక్స్ తో ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో నటించడానికి ఆమె బాగానే తాపత్రయ పడింది. ఇక పేరెంట్స్ పాత్రల్లో కనిపించిన రాజేంద్రప్రసాద్, మీనా ల గురించి వేరే చెప్పనవసరం లేదు వాళ్ళ సినీ కెరీర్ అలాంటిది. మీనా డైలాగ్స్ బాగానే ఉన్నాయి. అలాగే భారీగా వున్నా నటీనటులంతా తమ పాత్ర ల పరిధి మేరకు నటించారు.
సాంకేతికవర్గం పనితీరు :
సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి అంటేనే అసభ్యతకు తావు లేకుండా పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రాలు వుంటాయని తెలుసు. అయితే ఈ సారి దర్శకుడు సరైన కథా కథనాలను రాసుకోలేకపోయారు. కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే కుటుంబ కథా చిత్రాలు దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డి పేరుకు ఈ సినిమా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. అసభ్యతకు తావు లేకుండా పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా అయన మార్క్ కనపడుతుంది. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు పరవాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
విశ్లేషణ :
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి చాలా గ్యాప్ తర్వాత దర్శకుడిగా చేసిన ఈ చిత్రం ఏ అంశంలో ఆకట్టుకోలేకపోయింది. నమ్మశక్యం కాని సన్నివేశాలతో, ఇంట్రెస్ట్ కలిగించలేని ప్లేతో అండ్ వర్కౌట్ కాని కామెడీ సీన్స్ వంటి అంశాలు కారణంగా ఈ సినిమా ప్రేక్షకుడికి కిక్ ఇవ్వలేదు. ప్రధానంగా ఇందులో విజయ్ పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు కొన్ని చోట్ల పర్వాలేదు. అక్కడక్కడా కొన్ని లవ్ సీన్స్ అండ్ ఎమోషన్స్ బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా ఈ నాటి ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చదు అంతే!