ప్రవాసుల సహకారంతో త్వరలో.. ఓయూలో స్టార్టప్ లు

ప్రవాస ఉస్మానియన్ల సహకారంతో త్వరలోనే ఉస్మానియా యూనివర్సిటి క్యాంపస్‌లో పలు స్టార్టప్‌లను ప్రారంభించనున్నట్లు ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రవిందర్ తెలిపారు. ఇందుకు ప్రఖ్యాత కంపెనీలలో సీఈవోలుగా పని చేస్తున్న ఓయూ పూర్వ విద్యార్థులు ముందుకు రావడం చాలా సంతోషకరమన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసిన ఉస్మానియా పూర్వ విద్యార్థుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. అమెరికా పర్యటనతో ఓయూ పురోభివృద్ధికి ఎంతో మేలు జరుగనుందన్నారు. ఈ సమావేశానికి యాపిల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ వంటి ప్రముఖ కంపెనీలల్లో కీలక స్థానాల్లో ఉన్న దాదాపు వందమందికిపైగా హాజరయ్యారన్నారు. తాము చదువుకున్న విశ్వ విద్యాలయానికి ఎంత ఇచ్చినా తక్కువేని, త్వరలోనే ఉస్మానియాను సందర్శించి తమ సహకారాన్ని అందిస్తామని పలు కంపెనీలకు చెందిన సీఈవోలు, ఉద్యోగులు ప్రకటించినట్లు వీసీ తెలిపారు.