డల్లాస్ లో ప్రారంభమైన పాఠశాల తరగతులు

డల్లాస్ లో ప్రారంభమైన పాఠశాల తరగతులు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో అమెరికాలోని చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న ‘పాఠశాల’ 2021-22 విద్యా సంవత్సరంను ఘనంగా ప్రారంభించారు. డల్లాస్‌లో 200 మందికి పైగా విద్యార్థులతో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ముఖ్య అతిధిగా పాల్గొని చిన్నారులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగు చిన్నారులందరూ వారి అమ్మమ్మలు, నాయనమ్మలు మరియు తాతయ్యలతో మాట్లాడి వారి అనుబంధం, ఆప్యాయతలు పొందే విధంగా వారికి తెలుగు నేర్పించాలనే సంకల్పంతో తానా పాఠశాల కృషి చేస్తుందని చెప్పారు. తెలుగులో చదవడం, రాయడం కూడా నేర్పించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఎక్కువ మంది తెలుగు నేర్చుకోవడానికి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, దీనికి కృషి చేసిన పాఠశాల చైర్మన్‌ నాగరాజు నలజుల, డల్లాస్‌ ప్రాంతీయ కార్యదర్శి సతీష్‌ కొమ్మన, పాఠశాల కో ఆర్డినేటర్‌ వెంకట శివనాగరాజు తాడిబోయిన, తానా కౌన్సిలర్‌ ఎట్‌ లార్జ్‌ లోకేష్‌ నాయుడు మరియు ఉపాధ్యాయులను అభినందించారు.

పాఠశాల చైర్మన్‌ నాగరాజు నలజుల మాట్లాడుతూ, అమెరికాలో ఉన్న తెలుగు చిన్నారులందరికి తెలుగు నేర్పించాలనే లక్ష్యంతో తానా పాఠశాలను అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరువ కావడానికి సహకరిస్తున్న తానా మరియు పాఠశాల కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో ఉన్నతమైన కార్యంలో తను భాగస్వామిని కావడం ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పాఠశాలలో ఇంత ఎక్కువగా రిజిస్ట్రేషన్స్‌ రావడానికి తానా కార్యవర్గం బాగా కృషి చేస్తోందని వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.  బోధనా విధానం, ఏ కోర్సులో ఏమి నేర్చుకుంటారు వంటి వివరాలను తానా పాఠశాల అధ్యాపకులు వెంకట్‌ కొర్రపాటి, అరుణ మరియు వెంకటయ్య లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, 200 మంది చిన్నారులు, తానా మరియు పాఠశాల బృందం పాల్గొన్నారు.

Click here for Photogallery

 

Tags :