రివ్యూ : 'పక్కా కమర్షియల్‌' పక్కా కామెడీ మూవీ

రివ్యూ  : 'పక్కా కమర్షియల్‌' పక్కా కామెడీ మూవీ

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్థలు :  జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్
నటీనటులు : గోపిచంద్‌, రాశీ ఖన్నా, రావు రమేష్, సత్యరాజ్‌, తదితరులు
సంగీతం : జేక్స్ బిజాయ్, సినిమాటోగ్రఫీ: క‌ర‌మ్ చావ్లా, ఎడిటర్‌: ఎన్ పి ఉద్భ‌వ్
సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాత: బ‌న్నీ వాసు, రచన, దర్శకత్వం: మారుతి
విడుదల తేది: 01.07.2022

వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి దర్శకుడిగా ఓ సినిమాను తెరకెక్కించాడంటే.. మినిమమ్ గ్యారెంటీ ఉంటుందని, హాయిగా నవ్వుకుని రావొచ్చని సగటు సినీ ప్రేక్షకుడు అనుకుంటాడు. మ్యాచో హీరో గోపీచంద్‌ మాస్ ఇమేజ్‌తో కమర్షియల్ పంథాలో వెళ్తున్న గోపీచంద్‌కి గత కొన్నేళ్లుగా కమర్షియల్ హిట్ లేకపోవడంతో.. మారుతితో కలిసి ఇప్పుడు ‘పక్కా కమర్షియల్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందాల బ్యూటీ రాశీఖన్నా హీరోయినిగా  నటించిన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ నుంచి ఈ చిత్రంపై సినీ ప్రియులకు ఆసక్తి పెరిగింది. ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. మరి ఈ సారి ఈ పక్కా కమర్షియల్ చిత్రం.. పక్కాగా కమర్షియల్ హిట్ కొట్టేసిందా? లేదా? ఫార్మాట్‌లో ఈ రోజు శుక్రవారం (జులై 1) న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది ? హిట్‌ కొట్టేసిందా లేదా  సమీక్షలో చూద్దాం. 

కథ:

ఓ అమ్మాయికి న్యాయం చేయలేకపోయానని ఓ సిన్సియర్‌ న్యాయమూర్తిగా తన వృత్తిని వదిలేస్తాడు సూర్య నారాయణ (సత్య రాజ్) వ్యాపారవేత్త వివేక్‌ (రావు రమేశ్‌) చేతిలో మోససోయిన యువతికి న్యాయం చేయలేకపోయానని బాధపడుతూ కిరాణ దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తాడు. అతని కొడుకు లక్కీ(గోపిచంద్‌) కూడా లాయర్‌ అవుతాడు. కానీ తండ్రిలా నిజాయతీగా కాకుండా మార్కెట్‌లో అవలీలగా న్యాయాన్ని అమ్మెస్తుంటాడు. తప్పు ఒప్పు చూడకుండా 'పక్కా కమర్షియల్‌'గా వ్యవహరిస్తూ డబ్బులు సంపాదిస్తాడు. ఓ కేసు విషయంలో వివేక్‌ తరఫున వాదించి.. అతనికి దగ్గరవుతాడు. అయితే వివేక్‌ వల్ల బాధింపబడిన యువకుడి కోసం, అతని భార్య కోసం మళ్లీ నల్లకోర్టు వేసి కోర్టుమెట్లు ఎక్కుతాడు సూర్య నారాయణ. కేసులో మాత్రం తండ్రీకొడుకులు ఎదురెదురుగా నిలవాల్సి వస్తుంది. వివేక్‌ తరఫున కొడుకు లక్కి రంగంలోకి దిగుతాడు. ఈ న్యాయ పోరాటంలో ఎవరు గెలిచారు? సొంత తండ్రిని కాదని వివేక్‌ తరఫున లక్కీ ఎందుకు వాదిస్తాడు ? లక్కీ మరీ అంత కమర్షియల్‌గా ఎందుకు మారాడు ? చివరకు సూర్యనారాయణ కోరుకున్నట్లుగా వివేక్‌కి శిక్ష పడిందా లేదా? తండ్రికొడుకుల న్యాయపోరాటంలో సీరియల్‌ హీరోయిన్‌ ‘లాయర్ ఝాన్సీ’ (రాశీ ఖన్నా) ఎలాంటి పాత్ర పోషించింది? అనేదే మిగతా కథ.

నటీనటుల హావభావాలు:

డబ్బుల్లేనిదే ఏ పని చేయను, డబ్బిస్తే అన్యాయాన్ని కూడా న్యాయంగా మార్చేసే లక్కీ పాత్రలో గోపీచంద్ 'పక్కా కమర్షియల్‌' వ్యక్తిగా అదరగొట్టేశాడు. ఈ చిత్రంలో గోపీచంద్ యాక్షన్, ఎమోషన్, కామెడీ, రొమాంటిక్ ఇలా అన్ని యాంగిల్స్‌ను చూపించాడు. ఇక యాక్షన్ సీక్వెన్స్‌లో ఎంతో స్టైలీష్‌గా కనిపిస్తాడు. లాయర్ ఝాన్సీ పాత్రలో రాశీ ఖన్నా అందరినీ నవ్విస్తుంది. తనకు తాను ఎక్కువగా ఊహించుకుని ఆ భ్రమలోనే బతికే పాత్రలో రాశీ ఖన్నా అద్భుతంగా నటించింది. రాశీ ఖన్నా బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ అన్నీ కూడా ఆకట్టుకుంటాయి. రావు రమేష్ తనకు అలవాటైన విలనిజాన్ని, కామెడీని జొప్పించి మరోసారి మెప్పించాడు. సత్యరాజ్ ఎప్పటిలానే ఎమోషన్ పండించాడు. అజయ్ ఘోష్, ప్రవీణ్, వైవా హర్ష, సప్తగిరి అందరూ కూడా చక్కగా నటించారు.

సాంకేతికవర్గం పనితీరు:

మారుతి  సినిమాలన్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌గా ఉంటాయి. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు బలమైక కథను ముందుకు తీసుకెళ్తాడు. పక్కా కమర్షియల్‌లో కథను పక్కకు పెట్టి కామెడీతో లాక్కోచ్చాడు. హీరోయిజం మీదనే ఎక్కువ దృష్టిపెట్డాడు. టైటిల్‌కి దగ్గట్టుగా పక్కా కమర్షియల్‌ అంశాలు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఓ ఎమోషనల్‌ సీన్‌తో సినిమా మొదలవుతుంది. పక్కా కమర్షియల్ చిత్రం లో కోర్ట్ రూమ్ డ్రామా తో కామెడీ ను మిక్స్ చేశాడు. కీలక సన్నివేశాల సమయం లో సీరియస్ నెస్ తీసుకు రావడం లో విఫలం అయ్యాడు అని చెప్పాలి. జేక్స్ బెజాయి సంగీతం బాగుంది, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అని చెప్పాలి. మారుతి ఈ చిత్రం లోని డైలాగ్స్ చాలా బాగున్నాయి. హీరో గోపీచంద్ కోసం డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ బావున్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ ఇంకాస్త బావుండేది. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

విశ్లేషణ:

న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో మారుతి ఈ కథ రాసుకున్నాడా? అని అనుకుంటే.. తెరకెక్కించాల్సిన విధానం మాత్రం ఇది కాదనిపిస్తుంది. పక్కా కమర్షియల్ అనే టైటిల్‌కు తగ్గట్టుగానే మారుతి కమర్షియల్ అంశాలను ఎక్కడా కూడా మిస్ కానివ్వలేదు. గతంలో ఇ ఇ వి సత్యనారాయణ తన చిత్రాల్లో తన పత్రాలపై ప్రేక్షకుడి కౌంటర్లను మంచి పంచ్ డైలాగ్స్ రాసుకునేవారు. అదే విధంగా  ఎక్కడ జనాలు కౌంటర్లు వేస్తారో అనుకుని ముందుగానే. ఆ కౌంటర్లను సినిమాలోనే పెట్టేసుకున్నాడు మారుతి. అంటే ఆడియెన్స్ కోణంలో నిజంగానే మారుతి బాగా ఆలోచించాడనిపిస్తుంది. అయితే చివర్లో ఓ ట్విస్ట్ ఉంటుందని ప్రేక్షకుడు ముందే పసిగట్టేస్తాడు. అదేమీ పెద్ద ఆశ్చర్యానికి గురి చేయదు. అయితే అంతకు ముందంతా కూడా హీరోను ఓ కోణంలో చూపించి.. చివరకు మాత్రం మరో కోణాన్ని చూపించేశాడు మారుతి. చివరకు నీతి సందేశాలు ఇప్పించాడు.

సెకండాఫ్ లో ఫ్లాట్ గా ఉండే స్క్రీన్ ప్లే మరియు ముందుగానే ఊహించే సన్నివేశాలతో పర్వాలేదు అనిపిస్తుంది. ఇక డబ్బు కోసం మనుషులు తమ ఎమోషన్లను కూడా అమ్మేసుకుంటారని, కుటుంబ సభ్యులు డబ్బుల కట్టలు చూసి ఎలా మారిపోతారో చూపించడం మారుతికే చెల్లుబాటు అవుతుంది. అలాంటి సిల్లీ సీన్లు ఈ చిత్రంలో బోలెడన్ని కనిపిస్తుంటాయి. చివరకు కొన్ని సందర్భాల్లో రాశీ ఖన్నా పాత్ర మరింత అతిగా అనిపిస్తుంది. ఇక ప్రథమార్థంలో హీరో కమర్షియాలిటీ, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, ఓ రెండు మూడు యాక్షన్ సీక్వెన్స్‌లు, ఓ రెండు పాటలు అన్నట్టుగా సాగింది. ద్వితీయార్థం అయినా కాస్త సీరియస్ నోట్‌లో సాగుతుందనుకుంటే నిరాశపడటం ఖాయమనిపిస్తుంది.  లాజిక్ మరియు స్క్రీన్ ప్లే ను పట్టించుకోకుండా కామెడీ ను ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు.

 

Tags :
ii). Please add in the header part of the home page.