కర్ణాటక కొత్త సీఎం సిద్దరామయ్యకు ప్రధాని కంగ్రాట్స్

కర్ణాటక కొత్త సీఎంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం సిద్ధరామయ్యకు ఇది రెండోసారి. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 135 స్థానాల్లో విజయం సాధించి, అతి పెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం సీఎం పదవి ఎవరికి ఇవ్వాలని తీవ్రంగా చర్చించిన కాంగ్రెస్ అధిష్టానం.. సిద్దరామయ్య వైపే మొగ్గు చూపింది. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సిద్దరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరూ తమ పదవీకాలంలో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రస్తుత జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.