MKOne TeluguTimes-Youtube-Channel

కె విశ్వనాథ్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం.. జాతీయ స్థాయిలో యావత్ సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం

కె విశ్వనాథ్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం.. జాతీయ స్థాయిలో యావత్ సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం

సినీ ప్రపంచంలో దిగ్గజ దర్శకులుగా పేరొందిన కళాతపస్వి కె విశ్వనాథ్ మృతి పట్ల జాతీయ స్థాయిలో  యావత్ సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ నివాళులర్పించారు. సీనియర్ దర్శకులు, ఎన్నో క్లాసికల్ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కె విశ్వనాథ్ కన్ను మూశారు. అనేక సామాజిక అంశాలపై సినిమాలు తీసి అందులో కళలకు అమితమైన ప్రాచుర్యం కల్పించిన కళా తపస్వి  తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వృద్ధాప్యంతో సంభవించిన అనారోగ్య కారణాలతో గురువారం రాత్రి అపోలో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.

విశ్వనాథ్ మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు కాగా.. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ  సైతం ట్వీట్ చేస్తూ.. విశ్వనాథ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘శ్రీ కె. విశ్వనాథ్ గారి మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. అతను సినీ ప్రపంచంలో ఒక దిగ్గజం. సృజనాత్మకత కలిగిన దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీ లోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వివిధ ఇతివృత్తాలతో వారు తీసిన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి. అతని కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’ అంటూ ట్వీట్ చేశారు మోడీ. ప్రతి నటుడికి ఆయనతో పనిచేయడం ఒక ఎడ్యుకేషన్ లాంటిది. ఆయన చిత్రాలు భావితరాలకు ఒక గైడ్ వంటిది. 43 సంవత్సరాల క్రితం ఆ మహనీయుడి ఐకానిక్ చిత్రం శంకరాభరణం విడుదలైన రోజునే బహుశా ఆ శంకరుడికి ఆభరణంగా ఆయన కైలాసానికి ఏతెంచారు. ఆయన చిత్రాలు ఆయన చిత్రాల  సంగీతం ఆయన కీర్తి అజరామరమైనది. ఆయన లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకి తెలుగు వారికి ఎప్పటికి తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ ఆయన కుటుంభ సభ్యులందరికి అసంఖ్యాకమైన ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. అంటూ చిత్రాంజీవి ట్వీట్ చేసారు.

‘మాస్ట్రో, కళా తపస్వి శ్రీ కె. విశ్వనాథ్ గారు. రెస్ట్ ఇన్ పీస్ సార్. ఎన్నో తరాల తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసిన చిత్రాలతో తనదైన ముద్ర వేసిన దర్శకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు’ అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ్ సైతం ఈ సందర్భంగా నివాళి అర్పించారు. ‘తనకు మాత్రమే సొంతమైన యూనిక్ విజువల్ అండ్ మ్యూజిక్ స్టైల్.. ఆయన అమితంగా గౌరవించే సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విలక్షణమైన పాత్రలే కె.విశ్వనాథ్‌ గారిని నిజమైన రచయితగా మార్చాయి. ఆయన, తన సహచరుడు సిరివెన్నెల కలిసి స్వర్గంలో అద్భుతమైన మ్యూజిక్ ఇంటరాక్షన్‌ పొందుతారని ఆశిస్తున్నాను’ అని ట్వట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ‘కె. విశ్వనాథ్ జీ.. మీరు నాకు చాలా నేర్పించారు. ఈశ్వర్ సమయంలో మీతో సెట్‌లో ఉండటం దేవాలయంలో ఉన్నట్లుగా ఉంది. RIP గురూజీ’ అంటూ కె విశ్వనాథ్‌కు నమస్కరిస్తున్న ఫొటో షేర్ చేశారు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్. ‘కె విశ్వనాథ్ గారి మరణవార్త విని నిజంగా బాధ కలిగింది. ఇది తెలుగు పరిశ్రమకే కాదు మన దేశానికే నష్టం! ఆయన సన్నిహితులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి. వారి ఆత్మకు శాంతి కలుగుగాక’ అని విక్టరీ వెంకటేష్ నివాళి అర్పించారు. కళాతపస్వి కె విశ్వనాథ్ మృతి పట్ల జాతీయ స్థాయిలో  వందలకొద్ది  సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/narendramodi/status/1621369495712600065

 

Tags :