కోవిడ్ కట్టడికి సరైన వ్యూహంతో ముందుకెళ్ళాలి - మోదీ

కోవిడ్ కట్టడికి సరైన వ్యూహంతో ముందుకెళ్ళాలి - మోదీ

కోవిడ్‌-19 కట్టడి కోసం వ్యూహాలు రూపొందించే ముందు సామాన్యుల జీవనోపాధి, ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కోవిడ్‌-19 తాజా పరిస్థితి, కట్టడిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, ఉన్నతాధికారులతో ఇటీవల నిర్వహించిన అత్యున్నతస్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్‌-19 కట్టడి కోసం అవసరాన్నిబట్టి అక్కడికక్కడ స్థానిక ఆంక్షలు విధించడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ శతాబ్దిలోనే అతిపెద్ద మహమ్మారితో భారతదేశం చేస్తున్న యుద్ధం 3వ సంవత్సరంలోకి ప్రవేశించిందని గుర్తుచేస్తూ, 130 కోట్ల మంది భారతీయులు ఖచ్చితంగా కరోనాపై విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఒమిక్రాన్‌’ గురించి ఇంతకుముందున్న సందేహాలు ఇప్పుడు క్రమక్రమంగా తీరుతున్నాయని, ఈ వేరియంట్‌ మునుపటి వేరియంట్‌ల కంటే చాలా రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రధాని అన్నారు. దీన్ని ఎదుర్కొనే క్రమంలో అందరూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని, కానీ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

ఈ పండుగల సీజన్‌లో ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తత ఎక్కడా తగ్గకుండా చూడాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇదివరకటిలా ముందస్తు, సమయానుకూల, సమష్టి విధానాలతో పోరాడాలని పిలుపునిచ్చారు. కోవిడ్‌-19 కట్టడికి కలిసికట్టుగా శ్రమించడమే ఏకైక మార్గమని, విజయం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ప్రధాని మోదీ అన్నారు. మనం కరోనా వ్యాప్తిని ఎంత ఎక్కువగా నిలువరించగలమో సమస్య అంత తక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. భారతదేశంలో తయారైన వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా తమ పనితీరును నిరూపించుకుంటున్నాయని అన్నారు. దేశంలో దాదాపు 92% జనాభాకు మొదటి డోసు అందించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. దేశంలో 2వ డోస్‌ కవరేజ్‌ కూడా దాదాపు 70 శాతానికి చేరుకుందని చెప్పారు. 10 రోజుల వ్యవధిలో, దేశంలో దాదాపు 30 మిలియన్ల మంది కౌమారదశ పిల్లలకు టీకాలు అందించగలిగామని అన్నారు. ఇది భారతదేశ సామర్థ్యాన్ని చూపుతోందని, సవాళ్లను ఎదుర్కోవడంలో మన సంసిద్ధతను చాటుతుందని వెల్లడించారు.

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, వయోధికులకు ఎంత త్వరగా ముందుజాగ్రత్త మోతాదును అందిస్తే, మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సామర్థ్యం అంతగా పెరుగుతుందని అన్నారు. 100% వ్యాక్సినేషన్‌ కోసం ‘హర్‌ ఘర్‌ దస్తక్‌’ ప్రచారాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. వేరియంట్‌ ఏదైనా కానీ, వ్యాక్సినేషన్‌ ఒక్కటే దాన్ని ఎదుర్కొనే సమర్థవంతమైన మార్గమని ఆయనన్నారు. ఆరోగ్య వసతులు, మౌలిక సదుపాయాలను పెంపొందించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 23 వేల కోట్ల ప్యాకేజిని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవడంపై మెచ్చుకున్నారు. ఈ నిధులతో దేశవ్యాప్తంగా 800 పీడియాట్రిక్‌ యూనిట్లు, 1.5 లక్షల ఐసీయూ`హెచ్‌డీయూ పడకలు, 5 వేలకు మించి ప్రత్యేక అంబులెన్సులు, 950 లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ స్టోరేజి ట్యాంకులు సమకూరినట్టు పేర్కొన్నారు. అయితే కరోనాను ఓడిరచే క్రమంలో ఈ వసతుల కల్పన మరింతగా పెంచుకుంటూ వెళ్లాల్సిందేనని, కొత్తగా పుట్టుకొచ్చే వేరియంట్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని అన్నారు.

సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోగ్య వసతుల కల్పనలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై కృతజ్ఞతలు తెలియజేశారు. తమ తమ రాష్ట్రాల్లో కోవిడ్‌-19 కొత్త కేసుల తాజా పరిస్థితి, తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్‌, సమస్యలు, సవాళ్ల గురించి ప్రధానితో చర్చించారు. 

 

Tags :