317 జీవోను వెంటనే రద్దు చేయాలి: సీతక్క

317 జీవోను వెంటనే రద్దు చేయాలి: సీతక్క

ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటమాడుతున్న 317 జీవోను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్‌ చేశారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అద్యక్షుడు బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌పై చేపట్టిన నిరసన కార్యక్రమంలో సీతక్క పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే సీతక్క, వెంకట్‌ను సైఫాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ 9 మంది ఉపాధ్యాయులు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగుల పాలిట యమపాశంగా మారిందన్నారు. ఈ జీవో వల్ల ఉద్యోగులు మానసిక ఆవేదనకు గురౌతున్నారని అన్నారు.

జీవో 317 ప్రకారం రికార్డ్‌ చేయబడిన ఆదివాసీ ఉద్యోగులకు స్థానికంగానే బదిలీల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు. రోస్టర్‌ విధానం పాటించకుండానే రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌కు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తూట్లు పొడిచిందని ధ్వజమెత్తారు. ఉద్యోగుల ప్రాణాలు తీస్తున్న ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మల్టీ జోనల్‌ పోస్టుల విషయంలో ఉద్యోగ సంఘాలతో చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన బదిలీలను చేపట్టాలని అన్నారు. బీజేపీ డ్రామాలు ఆపాలని,  రాష్ట్రపతి చేత ఉత్తర్వులు రద్దు చేపించాలని డిమాండ్‌ చేశారు.

 

Tags :