MKOne Telugu Times Business Excellence Awards

111 జీవో రద్దు వివాదాస్పదం..?

111 జీవో రద్దు వివాదాస్పదం..?

111 జీవోను రద్దు చేస్తూ బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అత్యంత వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా విపక్షాలు, పర్యావరణ నిపుణులు.. ఈనిర్ణయాన్ని తూర్పారబడుతున్నారు. ఇది హైదరాబాద్ భవిష్యత్ ను తీవ్రంగా్ దెబ్బతీసే ప్రమాదకరమైన నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. ఇక టీపీసీసీ చీఫ్ అయితే .. కేసీఆర్ ను ఇథియోపియా, ఇతర దేశాల నియంతల సరసన కేసీఆర్ ను నిలబెట్టారు. ఇంతకూ ఈ జీవో రద్దుపై ఎందుకింత ఆందోళన వ్యక్తమవుతోంది..

1908లో హైదరాబాద్ వరదలతో అతలాకుతలమైంది. ఈవరదల కారణంగా సుమారు 50 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తినష్టం సంభవించింది. దీంతో అప్రమత్తమైన నిజాం నవాబు.. హైదరాబాద్ నగర పరిరక్షణకు నడుం కట్టారు. నాటి ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సారధ్యంలో.. భవిష్యత్తులో వరదలు రాకుండా నిర్మాణాలు చేపట్టారు. అందులో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంటజలాశయాలను నిర్మించారు. ఈ జలాశయాల వల్ల నగరానికి నీటి సరఫరాతో పాటు.. వరదల బారిన పడకుండా రక్షిస్తున్నాయి.

1996లో నాటి ఉమ్మడిపాలకులు.. హైదరాబాద్ పరిరక్షణకు మరిన్ని చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా 111 జీవో తెచ్చారు. 84 గ్రామాలను కన్సర్వేషన్ ప్రాంతంలోకి తెచ్చారు. అంటే ప్రొటెక్టెడ్ ఏరియా అన్నమాట. ఇక్కడ పర్యావరణ సమతుల్యాన్ని తెబ్బతీసే ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా కఠిన నిబంధనలు అమలు చేశారు. దీనివల్ల మరోసారి 1908 లాంటి భారీవరదలు నగరంపై పడకుండా తగిన చర్యలు తీసుకున్నారు.

అయితే హైదరాబాద్ సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అన్నివైపులా నగరం అభివృద్ధి చెందుతున్నా.. ఇక్కడ మాత్రం జీవో కారణంగా ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు అందకుండా పోతున్నాయి. దీంతో ఈ గ్రామాల ప్రజలు.. జీవో రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం... ఎట్టకేలకు జీవో 111 రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల .. ఈ 84 గ్రామాల్లో భూమి బంగారం కానుంది. ఇక్కడి రైతులు, గ్రామస్తులకు ప్రయోజనాలు దక్కనున్నాయి.

అయితే.. ఇక్కడి భూముల్లో 80శాతం.. బీఆర్ఎస్ నేతలు, వారి అనుచరుల చేతుల్లోనే ఉన్నాయని విపక్షనేతలు ఆరోపిస్తున్నారు. భూములను పేదల నుంచి తీసుకున్న తర్వాతే.. జీవో రద్దు నిర్ణయం చేశారని విమర్శిస్తున్నారు. ఈజీవో రద్దు వెనక భారీ భూకుంభకోణం ఉందంటున్నారు. ఇలాంటి చర్యలు చేపడుతున్నా.. కేంద్రం ఏమీ  పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.

ఇంతవరకూ బాగానే ఉంది. ఇప్పుడు అక్కడ ఎలాంటి నిర్మాణాలైనా చేపట్టవచ్చు. ఫలితంగా రియల్ రంగం మరింత వేగంగా పురోగమిస్తుంది. కానీ ప్రకృతి విపత్తు వస్తే నగరం పరిస్థితి ఏంటి? ఇప్పుడు చిన్న  వర్షానికి నగరం చెరువవుతోంది. చాలా ప్రాంతాలు నీటమునిగి విలవిలలాడుతున్నాయి. ఈపరిస్థితుల్లో జీవోరద్దుతో హైదరాబాద్ మరింత ప్రమాదంలో పడుతుందన్న ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.

 

 

Tags :