ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ యాత్రల సందడి

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ యాత్రల సందడి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతోపాటు, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ, జన సేన పార్టీలు ఇప్పటి నుంచే ప్రజల వద్దకు పయనమవుతున్నాయి. ఈ యాత్రలతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ముందే వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. అన్ని పార్టీలు జనం బాట పట్టాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు అధికార వైఎస్‌ఆర్‌సిపితోపాటు, తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఇందుకోసం ఈ రెండు పార్టీలు ఇప్పటి నుంచే ప్రజలను ఆకట్టుకునేందుకు వీలుగా, వారి సమస్యలను తెలుసుకునేందుకు ప్రజల వద్దకు వెళ్ళే కార్యక్రమాలను చేపట్టాయి. మరోవైపు జనసేన పార్టీ కూడా ప్రజల వద్దకు వెళ్ళేందుకు సిద్ధమైంది.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ...

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి తమ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రతి గడపకు వెళ్ళి వివరించేందుకు వీలుగా గడపగడపకు అన్న కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు, ముఖ్యంగా పథకాల నిర్వహణను తెలుసుకునేందుకు ముఖ్యంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ నగర ప్రాంతాల్లో కానీ ఇంటింటికీ తిరిగితేనే సమస్యలు తెలుస్తాయి.. గెలిచిన ఎమ్మెల్యేలు ఇంట్లో కూర్చొంటే సమస్యలు తెలియవు అన్న ప్రధానోద్దేశంతో  ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రూపొందించారు. అందులో భాగంగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు తమ తమ నియోజకవర్గాల్లోని ప్రజలను స్వయంగా కలుసుకుని వారికి తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను, అందిస్తున్న ప్రయోజనాలను వివరిస్తున్నారు.

మరోవైపు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర పేరుతో మరో ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టింది. దీని ద్వారా బస్సులో ప్రజల వద్దకు వెళ్ళి తమ ప్రభుత్వం బిసి, ఎస్‌.సి., ఎస్‌.టీ, ఇతర సామాజిక వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను, ఆయా వర్గాలకు రాజకీయ సాధికారత దిశగా ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ తీసుకున్న నిర్ణయాలను వివరించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత.. చంద్రబాబు నాయుడు

తెలుగుదేశం పార్టీ ఇటీవల నిర్వహించిన మహానాడు  సక్సెస్‌ తరువాత కేడర్‌ లో జోష్‌ వచ్చిన విషయం తెలిసిందే.  ఆ జోష్‌ను రెట్టింపు చేస్తూ.. అందర్నీ ఎన్నికలకు సిద్ధం చేసేలా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయడు బస్సు యాత్రను చేపట్టారు. ఇప్పటికే ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి జిల్లాలో మహానాడు నిర్వహణతో పాటు జిల్లాల పర్యటనల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై రోడ్‌ షోలు, బహిరంగ సభల్లో అధినేత చంద్రబాబు ప్రసంగాలకు పార్టీ అన్నీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 26 జిల్లాల్లో ఏడాదిన్నర పాటు విసృత్తంగా పర్యటించేందుకు పక్కా ప్లాన్‌ సిద్ధం చేసుకున్నారు. తెలుగు దేశం కేడర్‌లో జోష్‌ను రెట్టింపు చేసేందుకు, అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లేందుకు అన్ని విధాలుగా చంద్రబాబు ప్రిపేర్‌ అవుతున్నారు. వైసీపీని ఎదుర్కోవాలంటే ఎక్కువ కాలం ప్రజల్లో ఉండాలని పార్టీ నేతలు ఇచ్చిన సలహాలతో చంద్రబాబు జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. ఒక్కో టూర్‌ మూడు రోజుల చొప్పున నెలకు రెండు జిల్లాల్లో పర్యటించాలని ప్లాన్‌ చేస్తున్నారు.   మొదటి రోజు బహిరంగ సభ, రెండో రోజు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జులతో సమీక్షలు, క్యాడర్‌ తో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి.. అందర్నీ అప్రమత్తం చేయనున్నారు. ఇక మూడో రోజు వివిధ నియోజకవర్గాల్లో రోడ్‌ షోలలో పాల్గొంటూ.. అక్కడ నిర్వహించే బహిరంగ సభల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై మాట్లాడబోతున్నారు. కేవలం ఏడాదిలోనే మొత్తం 80కి పైగా నియోజకవర్గాలను చుట్టేసి.. ఎక్కువమంది ప్రజలను నేరుగా కలిసేలా.. పర్యటనను  రూపొందించారు. 

లోకేష్‌ పాదయాత్ర..

మరో వైపు లోకేష్‌ పాదయాత్ర చేయాలన్న సూచనలు పార్టీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. నేరుగా లోకేష్‌ కూడా ఈ అంశంపై స్పందించారు. పాదయాత్ర చేయాలా... బస్సు యాత్ర చేయాలా అన్నది పార్టీ నిర్ణయిస్తుందని.. పార్టీ ఎలాంటి బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తానని లోకేష్‌ తెలిపారు. మరో వైపు పార్టీలో యువతనేతలంతా కలిసి పాదయాత్ర చేయడం ద్వారా యువతను ఆకట్టుకోవచ్చన్న ఆలోచన కూడా జరుగుతోంది. దీనపైనా ఓ నిర్ణయం తీసుకున్నారని విధి విధానాలను ఖరారు చేసుకున్న తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.

పవన్‌ కల్యాణ్‌ కూడా...

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు వీలుగా బస్సు యాత్రను చేపడుతున్నారు. అక్టోబరు 5 విజయదశమి రోజున తిరుపతి నుంచి ఈ పర్యటన ప్రారంభమవుతుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. దసరా రోజున ప్రారంభించి ఆరు నెలల్లో రాష్ట్రమంతా పర్యటించటంతో పాటు ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ బహిరంగసభలు నిర్వహించనున్నట్టు జనసేన నేతలు పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటనలు ఉండేలా రూట్‌ మ్యాప్‌ రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్లోనే ఎన్నికలు ఉంటాయనే సంకేతాలు వస్తున్నందున రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు పెద్దగా సమయం లేదని ఇప్పటినుంచే నాయకులు సన్నద్ధం కావాలనేది పవన్‌ అభిప్రాయం. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేం దుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో ప్రభుత్వ వైఫల్యాలు ఎస్సీ ఎస్టీలపై దాడులు వంటి కీలకమైన అంశాలపై.. పవన్‌ ప్రచారం చేయనున్నారు. అదేవిధంగా సీపీఎస్‌ రద్దు మద్య నిషేధం పోలవరం ప్రత్యేక హోదా అంశాలపైనా.. జగన్‌ మాట తప్పిన విషయాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు.

ఈ పర్యటనలు ఆరు నెలల నుంచి ఏడాదిపాటు జరుగుతాయని తెలుస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో అటు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు మాజీ మంత్రి లోకేష్‌ కూడా పర్యటన ప్రారంబించనున్నారు. అంటే.. టీడీపీ ఒకవైపు.. జనసేన మరోవైపు.. టీడీపీ ప్రారంభించనున్న ఈ యాత్రలు రాష్ట్రంలో రాజకీయాలను మరింత వేడెక్కించడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.

 

Tags :